- తెలంగాణ, ఏపీ సహా 15 రాష్ట్రాల్లో 93 చోట్ల ఎన్‌ఐఏ, ఈడీ మెరుపుదాడులు
- పీఎఫ్‌ఐ అధ్యక్షుడు సహా 106 మంది అరెస్టు.. వారిలో 45 మంది ఎన్‌ఐఏ అదుపులో
- అందులో ఐదుగురు ఏపీ వారే! నలుగురు గుంటూరు.. ఒకరు హైదరాబాద్‌లో అరెస్ట్
- చాంద్రాయణగుట్టలో పీఎఫ్‌ఐ కార్యాలయం సీజ్.. ఎన్‌ఐఏ ఆఫీస్‌కు రావాలని నోటీస్
- రిమాండ్‌లో ఉన్న నలుగురి కస్టడీ కోసం పిటిషన్.. నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా
హైదరాబాద్, కరీంనగర్, కర్నూలు, గుంటూరు : తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు, ఆ సంస్థ సభ్యుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలు దాడులు చేపట్టాయి. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాద శిక్షణ శిబిరాల నిర్వహణ, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం, నిషేధిత సంస్థల్లో చేరేలా ప్రజలను ప్రోత్సహించడం వంటి కేసులకు సంబంధించి.. మొత్తం 93 చోట్ల దాడులు నిర్వహించి 106 మందిని అరెస్టు చేశాయి. దాదాపు 300 మంది అధికారులు గురువారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచే ఈ మెరుపుదాడులు ప్రారంభించారు. అత్యధికంగా కేరళలో 22 మందిని అరెస్టు చేయగా.. మహారాష్ట్ర, కర్ణాటకల్లో 20 చొప్పున, తమిళనాడులో 10 మంది, అసోంలో 9, ఉత్తరప్రదేశ్‌లో 8 మందిని, ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురిని, మధ్యప్రదేశ్‌లో నలుగురిని, పుదుచ్చేరి, ఢిల్లీల్లో ముగ్గురు చొప్పున, రాజస్థాన్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పీఎ్‌ఫఐ ప్రమేయం ఉన్న 19 కేసుల్లో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ.. 5 కేసులకు సంబంధించి 45 మందిని గురువారం అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ఎన్‌ఐఏ అరెస్టు చేసినవారిలో 19 మంది ఒక్క కేరళ నుంచే ఉన్నారు. తమిళనాడు (11), కర్ణాటక (7), ఆంధ్రప్రదేశ్ (4), రాజస్థాన్ (2), యూపీ (1), తెలంగాణ (1) రాష్ట్రాల్లో మిగతావారిని అరెస్టు చేసింది. ఈ సోదాల్లో పలు పత్రాలను, ఆయుధాలను, ఇస్లామిక్ ఉగ్రవాద సాహిత్యాన్ని, కంప్యూటర్లను, ల్యాప్‌టా్‌పలు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.. అరెస్టయినవారిలో పీఎ్‌ఫఐ చైర్మన్ ఒ.ఎం.ఎ.సలాం, ఢిల్లీ పీఎ్‌ఫఐ చీఫ్ పర్వేజ్ అహ్మద్ కూడా ఉన్నారు. వీరంతా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహించడం, ఆయా ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రజలను ప్రోత్సహించడం వంటి నేరాలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. వారి హింసాత్మక చర్యలతో ప్రజల మనసులపై ప్రత్యక్ష ప్రభావం పడుతోందని ఎన్‌ఐఏ తన ప్రకటనలో వివరించింది. కాగా.. వివిధ రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్న చోటకు ముస్లిం యువత చేరుకుని ‘ఎన్‌ఐఏ గో బ్యాక్’ నినాదాలతో హోరెత్తించారు. మరికొన్ని చోట్ల దాడులను అడ్డుకునే ప్రయత్నం చేసినా స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఆర్థిక లింకులపై ఈడీ ఆరా
2020లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల వెనుక, యూపీలోని హత్రా్‌సలో దళితమహిళపై సామూహిక హత్యాచారం ఘటన నేపథ్యంలో మతవిద్వేషాలు రేపే కుట్ర వెనుక పీఎ్‌ఫఐ ఆర్థిక లింకులపై ఈడీ ఆరా తీస్తోంది. పీఎ్‌ఫఐపైన, ఆ సంస్థ పదాధికారులపైన లఖ్‌నవూలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ (నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం) కోర్టులో రెండు అభియోగపత్రాలు దాఖలు చేసింది. వీటిలో ఒకటి గత ఏడాది ఫిబ్రవరిలో దాఖలు చేసింది. 2020లో హత్రా్‌సలో దళిత మహిళ సామూహిక హత్యాచారం అనంతరం మతవిద్వేషాలు రేపడానికి, తీవ్ర భయోత్పాతాన్ని సృష్టించడానికి పీఎ్‌ఫఐ, ఆ సంస్థ సభ్యులు కృషి చేశారని అందులో పేర్కొంది. ఇందుకు అవసరమైన వనరుల కోసం మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు వెల్లడించింది.
ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదమిది..
తమ సంస్థకు చెందిన జాతీయ, రాష్ట్ర స్థాయి, స్థానిక నాయకుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని.. రాష్ట్ర కమిటీ కార్యాలయంపైనా దాడులు జరిగాయని పీఎ్‌ఫఐ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అసమ్మతి స్వరాలను అణచివేయడానికి దర్యాప్తు సంస్థలను ప్రయోగించిన నియంతృత్వ పాలనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అందులో పేర్కొంది. ఈ దాడులను ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదంగా అభివర్ణించింది. కేరళలో శుక్రవారం హర్తాళ్ నిర్వహిస్తామని ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో..
పీఎ్‌ఫఐ కేసులో మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో రెండోసారి ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ పాతబస్తీతోపాటు మేడ్చల్, ఘట్‌కేసర్, ఉప్పల్‌లోని పీఎ్‌ఫఐ కార్యాలయాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. చాంద్రాయణగుట్టలోని పీఎ్‌ఫఐ కార్యాలయంలో ఉదయం 3 గంటల నుంచి 7 గంటల దాకా సోదాలు చేసి కీలకపత్రాలు, హార్డ్ డిస్క్, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని సీజ్ చేసి.. మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో నిర్వాహకులు విచారణకు హాజరు కావాలంటూ నోటీ్‌సలు అంటించారు. హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌ల్లో ఎన్‌ఐఏ, ఈడీ సోదాలు కొనసాగాయి. ఒక్క కరీంనగర్‌లోనే ఎనిమిది చోట్ల సోదాలు చేశారు. నిజానికి ఈ నెల 18న కరీంనగర్‌లోని హుస్సేనిపురలో ఒక ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు.. జగిత్యాలకు చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్ అహ్మద్ అనే పీఎ్‌ఫఐ కార్యకర్తను అరెస్టు చేశారు. అతణ్ని హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించి విచారించారు. అతడిచ్చిన సమాచారంతోనే గురువారం కరీంనగర్‌లో మరికొందరు పీఎ్‌ఫఐ కార్యకర్తలు, సానుభూతిపరుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక.. ఎన్‌ఐఏ దాడులకు కారణమైన ఐదు కేసుల్లో ఒకటి నిజామాబాద్ జిల్లాకు చెందిందని అధికారులు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పీఎ్‌ఫఐ సభ్యులపై గత జూలైలో నిజామాబాద్ 4వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు.. దర్యాప్తులో లభించిన సమాచారం మేరకు గత ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి నలుగురు పీఎ్‌ఫఐ నాయకుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల రిమాండ్ రిపోర్టులో పీఎ్‌ఫఐ కార్యకలాపాలకు సంబంధించిన సంచలన విషయాల్ని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ ఆటోనగర్‌కు చెందిన అబ్దుల్ ఖాదర్ శరీర దారుఢ్య శిక్షణ ముసుగులో.. ఇనుపరాడ్డు, కత్తి, కొడవలి వంటి ఆయుధాలతో ఓ వర్గానికి చెందిన వారిపై దాడిచేసి మట్టుబెట్టే విధానాలపై శిక్షణ ఇస్తున్నట్లు ఆరోపించింది. అబ్దుల్ ఖాదర్‌కు పీఎ్‌ఫఐ నాయకుల నుంచి పెద్దమొత్తంలో నిధులు అందాయని, ఆ నిధులతోనే తన ఇంటిపై నిర్మాణం చేసి కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు రిమాండ్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కాగా.. గురువారం హైదరాబాద్‌లో అబ్దుల్‌వారి్‌సతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 మందికిపైగా అనుమానితుల్ని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. టెర్రర్ ఫండింగ్‌తోపాటు.. అజ్ఞాతంలో ఉన్న పీఎ్‌ఫఐ నేతలు, శిక్షణ పొందిన వారి గురించి ఎన్‌ఐఏ కూపీ లాగుతోంది. పీఎ్‌ఫఐ బ్యాంకు ఖాతాలు, ఫండింగ్, ఖర్చుల వివరాలనూ ఎన్‌ఐఏ బృందాలు సేకరించాయి. అనుమానితుల కాల్ డేటా, సోషల్ మీడియా ఖాతాలపైనా అవి దృష్టి సారించాయి. ఇదిలా ఉండగా.. గత ఆదివారం అరెస్టయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సయ్యద్ యాసిన్ సమీర్, ఫిరోజ్‌ఖాన్, మహ్మద్ ఉస్మాన్, మహ్మద్ ఇర్ఫాన్‌లను తదుపరి విచారణ నిమిత్తం 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదుపులోకి తీసుకున్న అనుమానితుల్ని పూర్తిస్థాయిలో విచారించిన తర్వాత ఆధారాల మేరకు కొందర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు.. ఏపీలోని కర్నూలు నగరం పాతబస్తీలోని ఎస్‌డీపీఐ నేత అబ్దుల్‌వారిజ్ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఈ విషయం తెలిసి ఎస్‌డీపీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఎన్‌ఐఏ గోబ్యాక్, బీజేపీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. గుంటూరులో 30 మంది అధికారులు పీఎ్‌ఫఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తలు, సభ్యుల ఇళ్లు కార్యాలయాల్లో తనిఖీలు చేసి నలుగురిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు.
తెలుగు రాష్ట్రాల్లో అరెస్టయినవారు
ఆంధ్రప్రదేశ్: షేక్ అబ్దుల్ రహీమ్,
షేక్ అబ్దుల్ వాహిద్ అలీ, షేక్ జఫ్రుల్లా, రియాజ్ అహ్మద్
తెలంగాణ: అబ్దుల్ వారిస్ (ఈయన కర్నూలు నగరానికి చెందిన నేత; హైదరాబాద్‌లో అరెస్టు చేశారు)