– 89శాతం నిధులు వినియోగించని రాష్ట్రాలు, యూటీలు
– కేటాయించింది రూ.2,264 కోట్లు.. ఖర్చు చేసింది 252 కోట్లే
– ఒక్క పైసా ఉపయోగించని మహారాష్ట్ర.. తెలంగాణ ఆరు శాతమే
న్యూఢిల్లీ : దేశంలో మహిళల భద్రతకు ఉద్దేశించిన ‘నిర్భయ నిధి’ పట్ల ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కనీసం కేటాయించిన నిధులను సరైన రీతిలో వినియోగించడంలో కూడా విఫలమవు తున్నాయి. మహిళల భద్రత కోసం దేశంలోని రాష్ట్రా లు, యూటీలకు రూ.2,264 కోట్లు కేటాయించగా అందులో 89శాతం నిధులు కూడా ప్రభుత్వాలు ఖర్చు చేయలేకపోయాయి. ఇందులో రూ.252 కోట్లు మాత్రమే(అంటే 11శాతం) వినియోగించాయి. కేంద్ర ప్రభుత్వ సమాచార విశ్లేషణ ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఆయా రాష్ట్రాలు సమర్పించిన సమాచారం ఆధారంగా కైలాశ్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ దీనిపై విశ్లేషణ చేసింది. దేశంలోని ఏ ఒక్క రాష్ట్రం కూడా నిర్భయ నిధిలో 50శాతానికి మించి ఖర్చు చేయకపోవడం గమనార్హం.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేవలం 15శాతం కంటే తక్కువగా నిధులను ఖర్చు చేశాయి. ఐదుశాతం నిధుల వినియోగంతో దేశ రాజధాని ఢిల్లీ అత్యంత పేలవ ప్రదర్శనను చూపింది. ఇక 50శాతం నిధుల వినియోగంతో ఉత్తరాఖండ్, మిజోరాంలు మొదటి స్థానంలో ఉండగా, ఒక్క పైసా ఖర్చు చేయని మహారాష్ట్ర జాబితాలో అట్టడుగున నిల్చింది.
ఇక ఆరుశాతం నిధులు మాత్రమే ఖర్చు చేసి అట్టడుగు జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నది. 2017లో నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ‘క్రైం ఇన్ ఇండియా’ నివేదిక ప్రకారం.. మహిళలపై జరుగుతున్న నేరాల్లో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉండగా, చిన్నారులపై జరుగుతున్న నేరాల్లో మూడోస్థానంలో ఉండటం గమనించాల్సిన అంశం. నిధుల వినియోగంలో ఉత్తరాఖండ్, మిజోరాం తర్వాత ఛత్తీస్‌గఢ్ (43శాతం), నాగాలాండ్ (39శాతం), హర్యానా (32శాతం), గోవా(26శాతం) ఉన్నాయి.
ఇక తమకు కేటాయించిన మొత్తంలో నిర్భయ నిధిని తక్కువగా ఖర్చు చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాత త్రిపుర, తమిళనాడు(మూడు శాతం), మణిపూర్( నాలుగు శాతం), ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్ (ఐదుశాతం), తెలంగాణ, ఒడిషా, కర్నాటక(ఆరు శాతం)లు ఉన్నాయి. దేశంలో మహిళల భద్రత గురించి ఎంతో శ్రద్ధ వహిస్తున్నా మని చెప్పుకునే మోడీ సర్కార్, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు.. కనీసం వారికి కేటాయించిన నిధులను ఖర్చు సరైనరీతిలో ఖర్చు చేయకపోవడంపై మహిళా సంఘాలు, సామా జిక కార్యకర్తలు ఆగ్రహం చేస్తున్నారు. ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
(Courtesy Nava Telangana)