‘నిర్భయ’ నిధులపై నిర్లక్ష్యం

0
245
‘నిర్భయ’ నిధులపై నిర్లక్ష్యం

వాటా విషయంలో రాష్ట్రాల వెనకంజ

ల్లి కడుపులో పిండంగా రూపుదిద్దుకున్నప్పటి నుంచి ఆడపిల్లది అస్తిత్వ పోరాటమే! పుట్టినప్పటి నుంచి భద్రత కోసం ఆమె అనుక్షణం పోరాటం చేయాల్సి వస్తోంది. ఇందుకోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాను జోడించడం లేదు. 2012లో దిల్లీలో జరిగిన నిర్భయ హత్యోదంతం అనంతరం అప్పటి ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వం నిర్భయ నిధిని ఏర్పాటు చేసింది. 2013 బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలతో ప్రారంభించింది. కేంద్ర మహిళా, శిశు సంరక్షణ మంత్రిత్వ విభాగం దీనికి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ ఈ నిధి కింద రూ.3600 కోట్లు సమకూరగా 63 శాతం నిధులు విడుదలయ్యాయి. దాదాపు సగం రాష్ట్రాల్లో 15శాతం నిధులు మాత్రమే ఇటీవల వరకు వినియోగించినట్లు కేంద్రం గుర్తించింది.

వినియోగం అరకొరే
కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా విడుదల చేసిన రూ.1,656 కోట్లలోనూ తొమ్మిది శాతం మాత్రమే వెచ్చించినట్లు గుర్తించారు. ఈ నిధులతో బాధితులకు పరిహారం, నేరతీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘా కెమేరాల ఏర్పాటు, పెట్రోలింగ్‌ వాహనాల కొనుగోలు, రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్సు ప్రయోగశాలల ఆధునికీకరణ, అత్యవసర స్పందన, సహాయక విభాగాల ఏర్పాటు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక-2017 ప్రకారం మహిళలపై అకృత్యాల్లో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న మహారాష్ట్రకు నిర్భయ నిధుల నుంచి రూ.149.40 కోట్లను మంజూరు చేయగా ఇంతవరకు ఒక్క రూపాయి సైతం వినియోగించలేదు. మణిపూర్‌, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, డామన్‌-డయ్యూలలోనూ ఇదే పరిస్థితి. రూ.50 కోట్లకు మించి ఈ నిధులను పొందిన ఎనిమిది రాష్ట్రాల్లోనూ వినియోగం గరిష్ఠంగా ఏడు శాతానికి మించలేదు. రూ.390.90 కోట్ల మంజూరుతో అగ్రతాంబూలం పొందిన దిల్లీలో రూ.19.41 కోట్లను మాత్రమే వినియోగించారు. మహిళలపై అకృత్యాల్లో దేశంలోనే మొదటి స్థానం పొందిన ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.119.39 కోట్లు కేటాయించగా రూ.3.93 కోట్లను వెచ్చించారు. రూ.191.72 కోట్లు పొందిన కర్ణాటక, రూ.190.68 కోట్లు విడుదలైన తమిళనాడు, రూ.103.51 కోట్లు మంజూరైన తెలంగాణ, రూ.75.70 కోట్లు సమకూరిన పశ్చిమ్‌ బంగ, రూ.70.04 కోట్లు పొందిన గుజరాత్‌ రాష్ట్రాల్లో వినియోగం రెండు నుంచి ఏడు శాతమే. గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడులతో పోల్చితే రాజస్థాన్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాలకు వరసగా రూ.33.73 కోట్లు, రూ.22.70 కోట్లు, రూ.43.16 కోట్లను కేటాయించారు.

ఆంధ్రప్రదేశ్‌కు రూ.58.64 కోట్లు కేటాయించగా ఇంతవరకూ నిధుల వినియోగ ధ్రువీకరణపత్రాలను సమర్పించలేదు. కర్ణాటకకు రూ.33.64 కోట్లు కేటాయించగా రూ.2.20 కోట్లకు మాత్రమే వినియోగ ధ్రువీకరణ పత్రాలను సమర్పించింది. కేంద్ర న్యాయశాఖ 11 రాష్ట్రాల్లో 1,023 శీఘ్ర విచారణ న్యాయస్థానాల (ఎఫ్‌టీసీ) ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. వీటి ఏర్పాటు ప్రక్రియ ఇంకా బాలారిష్టాలను దాటలేదు. రైల్వే శాఖ రూ.500 కోట్లతో 983 స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. నోడల్‌ అథారిటీగా వ్యవహరిస్తున్న మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 12 రాష్ట్రాల్లో మహిళా పోలీసు వాలంటీర్ల నియామకానికి వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా మాత్రమే కొంత మేరకు నిధులు వినియోగించుకున్నాయి. మిగిలిన రాష్ట్రాల నుంచి ఎటువంటి వినియోగ ధ్రువీకరణ పత్రాలు అందలేదు. మహిళా సహాయక నంబర్ల సార్వజనీకరణకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ నంబరు 112తో అనుసంధానానికి ఉద్దేశించినా- దిల్లీ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ కర్ణాటక వంటి రాష్ట్రాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. మహిళలు, చిన్నారులపై సైబర్‌ నేరాలను నిరోధించడానికి 11 రాష్ట్రాలకు నిధులు కేటాయించగా 20 శాతానికి మించి ఏ రాష్ట్రంలోనూ వెచ్చించలేదు.

చిత్తశుద్ధి అవసరం
‘దిశ’ ఘటన నేపథ్యంలో పాలకులు యుద్ధ ప్రాతిపదికపై కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉంది. మాటువేసి కాటువేసే తోడేళ్లు ఎప్పుడూ సమయం కోసం ఎదురుచూస్తుంటాయని, అటువంటి ఘటనలు తమ రాష్ట్రాల్లోనూ జరిగే ప్రమాదం ఉందని గుర్తించాలి. రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిదే. ఈ విషయంలో సందర్భానుసారంగా ఆర్థిక సహాయం చేయడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిమితమవుతుంది. మహిళలు, బాలికలపట్ల అత్యాచారాలు, అకృత్యాలు మితిమీరిపోతున్న నేపథ్యంలో బాధితులకు పరిహారం, పునరావాసం, అకృత్యాలు జరగకుండా నివారణ చర్యల కోసం ఉద్దేశించినది నిర్భయ నిధి. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ విధానాలను రూపొందిస్తున్నా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ నిధులు మురిగిపోవు అందువల్ల వాటిని వినియోగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంతగా ఆసక్తి చూపడం లేదనే భావన ఉంది. ఇటువంటి పథకాలను చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే మహిళ నిర్భయంగా, నిబ్బరంగా ఉండగలదు!
(Courtesy Eenadu)

Leave a Reply