నిర్భయ దోషికి మరణశిక్షే..

0
220

రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి అక్షయ్‌ సింగ్‌ వేసిన రివ్యూ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. దోషి కోరినట్లుగా తీర్పును పునఃసమీక్షించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్షయ్‌ మరణశిక్షను ధ్రువీకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే చట్టప్రకారం ఉన్న గడువు లోగా దోషి రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. తీర్పుపై నిర్భయ తల్లి హర్షం వ్యక్తం చేశారు. న్యాయ ప్రక్రియలో మరో ముందడుగు పడిందని ఆనందపడ్డారు. తీర్పుపై అక్షయ్‌ న్యాయవాది స్పందిస్తూ.. ముందు తాము సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని, ఆ తర్వాతే క్షమాభిక్షకు వెళ్తామని తెలిపారు. మరోవైపు ఈ కేసులో దోషులకు మరణశిక్ష వెంటనే అమలు చేయాలని కోరుతూ నిర్భయ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది.

ఈ పిటిషన్‌పై తొలుత వాదనలు వినిపించిన అక్షయ్‌ తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌.. మీడియా, రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లే తన క్లయింట్‌ను దోషిగా తేల్చారని అన్నారు. అక్షయ్‌ చాలా పేద వ్యక్తి, అమాయకుడని అన్నారు. తప్పుడు ఆధారాలతో తనను ఈ కేసులో ఇరికించారన్నారు. నిర్భయ మరణ వాంగ్మూలంలోనూ అనుమానాలున్నాయన్నారు. చనిపోయే ముందు నిర్భయ ఇచ్చిన వాంగ్మూలంలో అక్షయ్‌ పేరు ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు. పుట్టుకతోనే ఎవరూ రేపిస్టులుగా మారరని, ఈ సమాజమే వారిని అలా మారుస్తుందన్నారు. సరైన విద్య లేకపోవడం వల్లే చాలా మంది నేరస్థులుగా మారుతున్నారన్నారు.  ఇప్పటికే దిల్లీ గ్యాస్‌ ఛాంబర్‌లా మారి.. మనుషుల ఆయుర్దాయాన్ని తగ్గిస్తోందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా మరణశిక్ష వేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

కాగా.. అక్షయ్‌ రివ్యూ పిటిషన్‌ను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వ్యతిరేకించారు. ఈ కేసులో దిల్లీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన తుషార్‌ మెహతా.. ‘కొన్ని నేరాలు మానవత్వానికే మాయని మచ్చలా మిగిలిపోతాయి. ఇది కూడా అలాంటిదే. ఈ కేసులో దోషి(అక్షయ్‌)కి సానుభూతి పొందే అర్హత కూడా లేదు. ఇలాంటి రాక్షసుడిని పుట్టించినందుకు, బాధితురాలిని కాపాడుకోలేకపోయినందుకు ఆ దేవుడు కూడా సిగ్గుపడుతాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో శిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కేసుల్లో దోషుల పట్ల దయ చూపించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. అక్షయ్‌ రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది.

2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్‌ కావడంతో మూడేళ్ల శిక్ష పడింది. మరో దోషి జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ అక్షయ్‌ సింగ్‌ అనే దోషి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కాగా.. ఈ కేసులో మిగతా ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్లను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Courtesy Eenadu

Leave a Reply