నితీశ్‌ మిషన్‌-2024

0
26

ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో బిహార్‌ సీఎం.. 13 పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు

న్యూఢిల్లీ : బిహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ మిషన్‌-2024 లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించారు. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీలో అడుగుపెట్టిన నితీశ్‌.. విపక్ష నేతలను వరుసబెట్టి కలుస్తున్నారు. సోమవారం తొలిరోజు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ, కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామిని కలిసి చర్చించారు. మంగళవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాను వారి కార్యాలయాల్లో కలుసుకున్నారు. అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తోనూ సమావేశమయ్యారు. ఇక ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన (ఉద్ధవ్‌ వర్గం), ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ పార్టీ బిజూ జనతాదళ్‌ నేతలతో కూడా నితీశ్‌ భేటీ కానున్నట్లు సమాచారం. కాగా, నితీశ్‌ ఢిల్లీ పర్యటనను ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంగానే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 2024 ఎన్నికలలోపు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రె్‌సతోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 500కు పైగా స్థానాల్లో బీజేపీతో ప్రత్యక్ష పోరు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. నితీశ్‌ సంప్రదింపులు జరుపుతున్న పార్టీలన్నీ దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ప్రభావం చూపేవే కావడం గమనార్హం.

గ్రామీణ ప్రాంతాల్లోని స్థానాలే కీలకం..
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని లోక్‌సభ స్థానాలే ప్రధానంగా కేంద్రంలో అధికారాన్ని నిర్దేశిస్తుంటాయి. దీంతో ఏ కూటమి దృష్టి అయినా గ్రామీణ ప్రాంతాల్లోని స్థానాలపైనే ఎక్కువగా ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కలిపి దేశంలో మొత్తం 353 లోక్‌సభ స్థానాలున్నాయి. కాగా, 2019 ఎన్నికల్లో వాటిలో 207 సీట్లను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు 126 సీట్లు మాత్రమే దక్కాయి. ఇప్పుడు నితీశ్‌ కూటమి పూర్తిగా ఈ గ్రామీణ ప్రాంతాలపైనే పెట్టబోతోందని సమాచారం. .

నితీశ్‌ కలిసే పార్టీల ప్రభావం ఎంత?
నితీశ్‌కుమార్‌ సోమవారం ఢిల్లీలో పలు పార్టీల నేతలను కలవడం, మరికొన్ని పార్టీల నేతలను కలుసుకునే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో.. ఆయా పార్టీల బలం, వివిధ ప్రాంతాల్లో వాటి ప్రభావం ఎంత? అన్న చర్చ మొదలైంది. ఆ అంశాలను పరిశీలిస్తే..

ప్రస్తుతం లోక్‌సభలో విపక్షాల్లో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌. 2019లో కాంగ్రెస్‌ 52 సీట్లు గెలుచుకుంది. 210 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. అంటే మొత్తం 262 స్థానాల్లో బీజేపీకి కాంగ్రెస్‌ ప్రత్యక్ష పోటీనిచ్చింది.

జాతీయ పార్టీ హోదాలో ఉన్న సీపీఎం ప్రస్తుతం కేరళలో అధికారంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌లోనూ బలంగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 62 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం సీపీఎంకు లోక్‌సభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు.

ప్రతిపక్ష పార్టీల్లో అత్యంత అనుభవజ్ఞులైన నేతల్లో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఒకరు. మహారాష్ట్రకు చెందిన పవార్‌కు, ఆయన పార్టీకి అక్కడ ప్రజాదరణ ఉంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలుండగా.. ఎన్సీపీకి ప్రస్తుతం 5 మంది ఎంపీలున్నారు.

నితీశ్‌కుమార్‌ ఫోన్‌లో మంతనాలు జరిపిన ఉద్ధవ్‌ ఠాక్రేకు చెందిన శివసేనకు కూడా మహారాష్ట్రలో మంచి పట్టుంది. ఆ పార్టీకి 19 మంది లోక్‌సభ సభ్యులున్నారు. అయితేఇటీవల శివసేన రెండుగా చీలింది.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రతిపక్ష పార్టీల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకురాలిగా పేరుంది. తృణమూల్‌ పార్టీ నుంచి 23 మంది ఎంపీలు ఉన్నారు.

17 లోక్‌సభ స్థానాలున్న తెలంగాణలో కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ కొన్ని నెలలుగా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.

ఒడిసా సీఎం కుర్చీలో 22 ఏళ్లుగా కొనసాగుతున్న నవీన్‌ పట్నాయక్‌ కూడా నితీశ్‌కుమార్‌తో టచ్‌లో ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు గురించి కూడా నితీశ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. మొత్తం 21 లోక్‌సభ స్థానాలున్న ఒడిసాలో పట్నాయక్‌ పార్టీ బీజేడీ 2019 ఎన్నికల్లో 12 సీట్లు గెలుచుకుంది.

ఢిల్లీకి వెళ్లే రహదారి బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ గుండా వెళుతుందనేది రాజకీయ నేతలు చెప్పుకొనే మాట. నితీశ్‌కుమార్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌ల పొత్తు తర్వాత బిహార్‌-జార్ఖండ్‌లో గట్టి పోటీకి ఇద్దరూ సిద్ధమవుతున్నారని భావిస్తున్నారు.

‘ప్రధాని’ ఎంపిక నా ఎజెండా కాదు: నితీశ్‌
ప్రధానమంత్రి పదవికి తాను హక్కుదారునని భావించడం లేదని బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ అన్నారు. ఆ కోరిక కూడా తనకు లేదని మరోసారి స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో ప్రతిపక్షాలన్నింటినీ కలిపి ఒక్క వేదికపైకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. ఢిల్లీలో పర్యటనలో భాగంగా మంగళవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాను, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను వారి కార్యాలయాల్లో కలుసుకున్నారు. ఆయా సందర్భాల్లో నితీశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. వామపక్షాలు, కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలన్నీ చేతులు కలిపి సంఘటిత ప్రతిపక్షంగా మారాల్సిన తరుణమిదేనని అన్నారు. ప్రధాని రేసులో ఉన్నారా.. అని మీడియా వేసిన ప్రశ్నకు ‘లేదు’ అని నితీశ్‌ సమాధానమిచ్చారు. కాగా, నితీశ్‌ తిరిగి ప్రతిపక్షాల శిబిరంలోకి రావడం జాతీయ రాజకీయాలకు మంచి సంకేతాన్ని అందించిందని సీతారాం ఏచూరి సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply