ఆడపిల్లనమ్మా..

0
202
  • అమ్మాయిలపై ఆగని దాడులు
  • జిల్లాలోనూ గతంలో ఎన్నో సంఘటనలు
  • శంషాబాద్‌ ఘటనతోనైనా మార్పు అవసరం

ఆడపిల్లగా పుట్టగానే అభద్రతాభావం వెంటాడుతోంది..చిన్నాపెద్దా వయస్సుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు బలైపోతున్నారు..చదువుకునే పాఠశాలలో.. ఉద్యోగం చేసే చోట వేధింపులు తగ్గడం లేదు..ప్రయాణాల్లో మానవమృగాలతో ప్రమాదం పొంచి ఉంటోంది..శంషాబాద్‌ ఘటన తో మహిళలు తల్లడిల్లిపోతున్నారు.. ఒంటరిగా వెళ్లడానికి జంకుతున్నారు.

రాష్ట్రంలో ఒకేరోజు ఇద్దరు యువతులు హత్యకు గురవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్‌, హన్మకొండలో కామాంధులు యువతులను అత్యాచారం చేసి ఆపై హతమార్చారు. ఈ రెండు ఉదంతాలతో మహిళల భద్రతపై తీవ్ర చర్చ జరుగుతోంది.

నిజామాబాద్‌ కమిషనరేట్‌లోనూ ఇలాంటి ఘటనలు ఉన్నాయి. ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకొని అత్యాచారానికి పాల్పడిన ఘటనలు జరిగాయి. ఆపై వీడియోలు తీసి బెదిరింపులకు దిగిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమిషనరేట్‌ పోలీసులు మహిళల భద్రతపై ఏ మేరకు భరోసా కల్పిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా షీ టీంలు, అత్యవసర సేవల నంబర్లు ఉన్నా వాటిపై విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా యంత్రాంగం వైఫల్యం చెందుతోంది.’

జిల్లాలో ఇదీ పరిస్థితి

  • అత్యాచార ఘటనలు జిల్లాలో ఎక్కువగానే జరిగాయి. ప్రధానంగా రహదారుల వెంబడి ఒంటరిగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకొని దారుణాలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్‌ నగర శివారులోని ఆరో ఠాణా పరిధిలో ఆరు నెలల వ్యవధిలోనే మూడు అత్యాచార ఘటనలు నమోదయ్యాయి.

సారంగాపూర్‌ అటవీ ప్రాంతంలో జన సంచారం లేకపోవడంతో ఇక్కడ వరుస ఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో పన్నెండేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అలీసాగర్‌, అశోక్‌సాగర్‌, మల్లారం అటవీ ప్రాంతాల్లోకి ప్రేమజంటలు వెళ్తుంటాయి. వీరిని లక్ష్యంగా చేసుకొని దుండగులు వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి.

అప్రమత్తం అయ్యే అవకాశాలున్నా..

  • గతంతో పోలిస్తే ప్రస్తుతం సాంకేతిక వినియోగం పెరిగింది. ప్రతి మహిళ వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. పోలీసు శాఖలోనూ సాంకేతిక వినియోగం ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. డయల్‌ 100 ఫిర్యాదుపై తక్షణమే స్పందిస్తున్నారు. ఇంతటి అవకాశం ఉన్నా వీటిని సద్వినియోగం చేసుకోవట్లేదు.

డాక్టర్‌ చదివిన శంషాబాద్‌ ఘటనలోని మహిళ ఆపదలో ఉన్నానని గుర్తించి డయల్‌ 100కు గానీ ఇతర అత్యవసర సేవల నంబర్లకు గానీ ఫోన్‌ చేసి ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదు. కళాశాలలు ఇతర పనులపై వెళ్లే తమ ఆడపిల్లలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది.

మరోవైపు పోలీసు శాఖ విస్తృత చైతన్యం కల్పించాలి. షీ బృందాలతో తరుచూ అవగాహన సదస్సులు నిర్వహించాలి. అత్యవసర సేవల నంబర్లు ప్రజల్లోకి వెళ్లేలా సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేయాలి.

ప్రధాన రహదారుల్లో..

జిల్లాలోనూ జాతీయ రహదారి ఉంది. ఇందల్‌వాయి శివారు నుంచి బాల్కొండ, కంఠేశ్వర్‌ శివారు నుంచి ఆర్మూర్‌ వరకు జాతీయ రహదారులున్నాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రధాన రహదారులు కూడా 150 కిలోమీటర్ల మేర ఉన్నాయి. వీటిల్లోనూ పక్కాగా హైవే పెట్రోలింగ్‌ జరగట్లేదు. ఫలితంగా వరుస నేరాల ఘటనలు జరుగుతున్నాయి. దారిలో వెళ్లే వాహనదారులను వెంబడించి దోచుకెళ్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి.

ఇప్పటికైనా పోలీసులు అప్రమత్తం కాకుంటే శంషాబాద్‌ తరహా ఘటన జిల్లాలో ఎక్కడయినా జరగొచ్ఛు టోల్‌ప్లాజాల వద్ద మాత్రమే పక్కా నిఘా వ్యవస్థ ఉంది. రహదారులపై మరెక్కడా సీసీ కెమెరాలు లేవు. ఏదైనా నేరం జరిగితే నిందితులను పట్టుకోవడం కష్టతరమే.

డయల్‌ 100లో ఇలా..

డయల్‌ 100లో ఫిర్యాదుల స్వీకరణకు పక్కాగా లెక్క ఉంటోంది. దీనికితోడూ ఫిర్యాదు అందిన క్షణాల వ్యవధిలోనే స్పందించేలా వ్యవస్థ ఉంది. సాధ్యమైనంత వరకు డయల్‌ 100కు ఫిర్యాదు చేయడం ఉత్తమం. గడిచిన రెండేళ్లతో పోలిస్తే డయల్‌ 100కు వస్తున్న ఫిర్యాదులు పెరుగుతూ వస్తున్నాయి.

ప్రతి ఫిర్యాదుపై సంబంధిత సిబ్బంది స్పందించిన తీరుని లెక్కిస్తున్నారు. నిర్ణీత సమయం దాటకుండా ఫిర్యాదుదారుని సమస్యను పరిష్కరించాలి. దీన్ని మహిళలు అత్యవసర సమయంలో సద్వినియోగం చేసుకొంటే బాగుంటుంది. మూడేళ్లలో డయల్‌ 100కు ఫిర్యాదులు పెరిగాయి ఇలా..

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 58 ఈవ్‌టీజింగ్‌ ఘటనలు జరిగాయి. ఇందులో 10కి పైగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మిగిలిన ఘటనల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. నిజానికి ఈ కేసుల్లోనూ కఠినంగా వ్యవహరించట్లేదన్న ఆరోపణలున్నాయి.●

షీ బృందాల సిబ్బందికి ఈ మధ్య ఇతర బందోబస్తు విధులు కేటాయిస్తున్నారు. వారు ఫిర్యాదు అందిన వెంటనే స్పందించే పరిస్థితి లేకుండా పోతోంది.

Courtesy Eenadu..

Leave a Reply