నిధుల కటకట.. అందని ఆసరా

0
30
  • లబ్ధిదారులకు సమయానికి చేతికందని పెన్షన్లు
  • గతంలో ప్రతి నెలా ఆరో తేదీలోపు అందజేత
  • మూడు నెలలుగా 15వ తేదీలోపు ఇస్తున్న వైనం
  • ఈసారి 20వ తేదీ గడిచినా అందని దుస్థితి
  • పండుటాకులు, వితంతువుల ఎదురుచూపులు
  • ఆర్థిక శాఖ ఆదేశాలతో ట్రెజరీ కార్యాలయాల్లో
  • పింఛను బిల్లుల ఫ్రీజింగ్‌:  విశ్వసనీయ వర్గాలు

హైదరాబాద్‌ : ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించలేకపోతున్న ప్రభుత్వం.. ఆసరా పెన్షన్ల విషయంలోనూ అదే దుస్థితికి చేరింది. ప్రతి నెలా నిర్దేశిత తేదీలోగా పెన్షన్లు చెల్లించకుండా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితుల వంటివారిని రోజుల తరబడి ఎదురుచూసేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా.. ఈసారి పెన్షన్‌ను 20వ తేదీ గడిచిపోయినా చెల్లించలేదు. దీంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశానిస్పృహలకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పొందుతున్న వారి సంఖ్య 38 లక్షల దాకా ఉంది. వారికి ప్రతి నెలా రూ.980 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. ‘సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ (సెర్ప్‌)’ ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తోంది. కొన్ని గ్రామాల్లో సెర్ప్‌ సిబ్బంది, మరికొన్ని గ్రామాల్లో బ్రాంచీ పోస్టు ఆఫీసుల ద్వారా, ఇంకొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఈ ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు.ఇదివరకు ప్రతి నెలా ఆరో తేదీలోపు పెన్షన్లను చెల్లించేవారు. గత మూడునెలలుగా 15వ తేదీలోపు చెల్లిస్తున్నారు. ఆగస్టు నెల పెన్షన్‌ ఈ నెల 20వ తేదీ గడిచినా లబ్ధిదారులకు అందలేదు. పెన్షన్‌ తప్ప ఎలాంటి అండా లేని వృద్ధులు దీనివల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. పెన్షన్‌ కోసం పంచాయతీ కార్యాలయాలు, పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.

ఆర్థిక శాఖ ఆదేశాలతోనే…?
వాస్తవానికి సంవత్సరానికి సరిపడా ఆసరా పెన్షన్ల డబ్బును ఆర్థిక శాఖ సెర్ప్‌కు విడుదల చేస్తుంది. సెర్ప్‌ ప్రధాన కార్యనిర్వహణాధికారి ఖాతాలో సొమ్ము ఉన్నట్లు కాగితాలపై లెక్కలుంటాయి. ట్రెజరీ కార్యాలయాలకు బిల్లులు సమర్పించి నిధులను డ్రా చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు అనుగుణంగా ఆయా గ్రామాలకు నిధులను పంపిస్తారు. కానీ.. ట్రెజరీ కార్యాలయాల నుంచి పెన్షన్ల బిల్లులు క్లియర్‌ కావడం లేదు. ఆర్థిక శాఖ నుంచి అందుతున్న ఆదేశాల మేరకే ట్రెజరీ కార్యాలయాల్లో ఈ బిల్లులు క్లియర్‌ చేయకుండా స్తంభింపజేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర ఆర్థిక శాఖ తన ప్రాధాన్యాల మేరకు కొన్ని రకాల బిల్లులను క్లియర్‌ చేయాలని, కొన్ని రకాల బిల్లులను ఫ్రీజ్‌ చేయాలని పేర్కొంటూ సబ్‌ ట్రెజరీ అధికారులకు ఆదేశాలిస్తుంది. అలా ఈసారి ఫ్రీజింగ్‌ జాబితాలో ఆసరా పింఛను బిల్లుల వంతు వచ్చినట్లు తెలిసింది. ఆర్థిక శాఖ వద్ద సరిపడా నిధులు లేకపోవడం వల్లే పెన్షన్ల సొమ్మును ఫ్రీజ్‌ చేశారని తెలుస్తోంది.

Courtesy Andhrajyothi

Leave a Reply