దళిత యువకుడి మృతి

0
384

లాఠీ దెబ్బలు తాళలేకే: కుటుంబ సభ్యుల ఆరోపణ
పరారీకి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు: ఎస్పీ
ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో ఘటన
వీఆర్‌కు ఎస్‌ఐ.. కేసు నమోదు

ఒంగోలు: ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ దళిత యువకుడు చికిత్స పొందుతూ మరణించిన ఘటన వివాదాస్పదమైంది. చీరాల థామస్‌పేటకు చెందిన వై.కిరణ్‌కుమార్‌ (26), ఆయన స్నేహితుడు వి.షైనీ అబ్రహం శనివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై కొత్తపేట నుంచి చీరాలకు వస్తున్నారు. మాస్క్‌ పెట్టుకోలేదని కొత్తపేట చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు. అక్కడ యువకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండో పట్టణ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తీవ్రంగా కొట్టడం వల్లే తమ కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని కిరణ్‌కుమార్‌ తండ్రి మోహన్‌రావు ఆరోపిస్తూ ఆసుపత్రిలోని ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యం కోసం కిరణ్‌ను గుంటూరు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందారు.

వాహనం నుంచి దూకడం వల్లే..
జీపు లోంచి దూకడం వల్ల తీవ్ర గాయాలై కిరణ్‌కుమార్‌ మరణించినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ తెలిపారు. కిరణ్‌కుమార్‌, షైనీఅబ్రహం మద్యం మత్తులో మాస్క్‌ లేకుండా రావడంతో తమ సిబ్బంది నిలువరించారన్నారు. మాస్క్‌ పెట్టుకోలేదేమని ప్రశ్నించగా, కానిస్టేబుల్‌ రామిరెడ్డిపై ఇద్దరూ దాడి చేశారన్నారు. విషయం తెలిసిన ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ఇద్దరినీ జీపులో ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్తుండగా.. కిరణ్‌కుమార్‌ దారిలో వాహనం నుంచి దూకేశాడని.. ఈ క్రమంలోనే తీవ్రంగా గాయపడ్డాడని ఎస్పీ వివరించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మీద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కాగా.. మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

తీవ్రంగా ఖండిస్తున్నా: లోకేశ్‌
‘దళితులపై జగన్‌ ప్రభుత్వ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. దాడులకు పాల్పడిన పోలీసులపై, వారి వెనక ఉన్న అధికార పార్టీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

Courtesy Eenadu

Leave a Reply