- పితృస్వామ్య భావజాలం విడనాడండి
- దుస్తుల తీరు కారణమనే ఆలోచనొద్దు
- లైంగిక నేరాల విచారణలో కింది కోర్టుల
- జడ్జిలకు సుప్రీం కోర్టు సప్త సూత్రాలు
న్యూఢిల్లీ : లైంగిక నేరాల్లో విచారణ జరుపుతున్న కింది కోర్టుల జడ్జిలకు సుప్రీంకోర్టు గురువారం సప్త సూత్రాలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. లైంగిక వేధింపుల బాధితురాలితో రాఖీ కట్టించుకుంటే బెయిలిస్తానంటూ నిందితుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు షరతు విధించడం.. కింది కోర్టుల్లో ఇటీవలి పలు వివాదాస్పద తీర్పుల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. 9 మంది మహిళా న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా.. కింది కోర్టుల జడ్జిలకు నిరంతర శిక్షణ అవసరం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లైంగిక నేరాల విచారణ సందర్భంగా ఏడు ప్రధాన సూత్రాలను పాటించాలని పేర్కొంటూ.. పలు అనుబంధ సూచనలు చేసింది. అవి..
సుప్రీంకోర్టు సప్త సూత్రాలు
- బెయిల్ షరతుల్లో బాధితురాలిని ముద్దాయి కలవాలని సూచించకూడదు.
- నిందితుడికి బెయిల్ ఇస్తే.. బాధితురాలి పాలిట ప్రమాదమని భావించినప్పుడు భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలి. బాధితురాలిని కలవొద్దని నిందితుడిని స్పష్టంగా హెచ్చరించాలి.
- నిందితుడికి బెయిల్ సమాచారాన్ని బాధితురాలికి వెంటనే అందించాలి. రెండు రోజుల్లో బెయిల్ కాపీలు అందేలా ఏర్పాట్లు చేయాలి.
- బాధితురాలి ఆహార్యం, ప్రవర్తన, విలువలను ఉటంకించకూడదు. పితృస్వామ్య భావజాలాలు ప్రతిబింబించకూడదు.
- మధ్యవర్తిత్వం, బాధితురాలిని పెళ్లి చేసుకునేలా రాజీ వంటి చర్యలకు అవకాశమివ్వొద్దు.
- విచారణ, తీర్పు సమయాల్లో.. జడ్జిలు బాధితుల పట్ల సున్నితత్వాన్ని ప్రదర్శించాలి.
- న్యాయ వ్యవస్థపై బాధితులు విశ్వాసం కోల్పోవడానికి దోహదపడే పదాలను వాడొద్దు
మరికొన్ని సూచనలు
- మహిళలు అబలలు, బలహీనులు అందుకే వారికి భద్రత కావాలి అనే ధోరణి కూడదు. వారు అసమర్థులు, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరనే భావనలను విడనాడాలి.
- మగవారే ఇంటికి పెద్ద దిక్కు. నిర్ణయాధికారం వారిదే.. మాతృత్వం మహిళ విధి అనే ధోరణిని జడ్జిలు విడిచిపెట్టాలి.
- రాత్రిళ్లు ఒంటరిగా ఉన్నారనో.. ధుస్తుల తీరు వల్లో మహిళలు లైంగిక దాడికి గురయ్యారనే ఆలోచనలను వీడనాడాలి.
- బాధితురాలికి మద్యం, ధూమపానం వంటి వ్యసనాలున్నంత మాత్రాన.. ఆమె నిందితుడికి సహకరించిందని ఎట్టి పరిస్థితుల్లోనూ భావించకూడదు.
Courtesy Andhrajyothi