కోచింగ్‌కు డబ్బులు లేవని యువకుడి ఆత్మహత్య

0
168

కొత్తకోట : కూలీ పని చేసుకునే ఆ దంపతులు ఎంతో కష్టపడి పెద్ద కొడుకును డిగ్రీ వరకు చదివించారు. పై చదువులకు ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో ఆ యువకుడు సొంతంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. కొలువు రాకపోవడంతో తల్లిదండ్రుల సహకారంతో పీజీ పూర్తి చేశాడు. ఈ సారి ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. అయితే ప్రస్తుతం తమ కుటుంబం వద్ద అందుకు సరిపడా డబ్బులు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో శుక్రవారం జరిగింది. నిర్వేన్‌ గ్రామానికి చెందిన సంద వెంకటమ్మ, బాలయ్య దంపతులకు ముగ్గురు సంతానం. కూలీ పనులు చేసి కుమారుడు కురుమూర్తి (26)ని పీజీ వరకు చదివించారు. కురుమూర్తి డిగ్రీ పూర్తి అయిన నాటి నుంచే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాడు. ఉద్యోగం రాకపోవడంతో గత ఏడాది ఎకనామిక్స్‌లో పీజీ పూర్తిచేశాడు. ఈసారి ఏదో ఒక ఉద్యోగం సాధించాలని కోచింగ్‌ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు.

హైదరాబాద్‌లో కోచింగ్‌ సెంటర్‌లో చేరడానికి రూ.40 వేలు కావాలని తల్లిదండ్రులను గురువారం అడిగాడు. పొలం అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తామని వారు చెప్పడంతో కురుమూర్తి తీవ్ర మనస్తాపం చెందాడు. కొత్తకోట శివారులోని వెంకటగిరి దేవాలయం సమీపంలో శుక్రవారం పురుగుల మందు తాగాడు. హైదరాబాద్‌లో ఉన్న తమ్ముడు మహేశ్‌కు వీడియో కాల్‌ చేసి విషయం చెప్పాడు. మహేశ్‌ తన మిత్రులకు సమాచారం అందించడంతో వారు వెంటనే వెళ్లి కురుమూర్తిని ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ కురుమూర్తి చనిపోయాడు.

Courtesy Andhrajyothi

Leave a Reply