విల్లాలకు ‘ఫుల్లు’.. జనాలకు ‘నిల్లు’

0
218

మాంద్యంలోనూ యాదాద్రిలో వీఐపీల భవనాలకు భారీగా నిధులు
– జ్వరాలతో జనం అల్లాడుతుంటే…
సకల హంగులతో నిర్మాణాలు
విష జ్వరాలతో ప్రజలు ఓవైపు ఆస్పత్రుల్లో నానా ఇబ్బందులు పడుతుంటే వారికి సరైన వైద్యం అందించడంలో మీనమేషాలు లెక్కిస్తున్న తెలంగాణ సర్కారు.. యాదాద్రిలో వీవీఐపీలుండే విల్లాల కోసం మాత్రం అనూహ్యంగా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది. ఓవైపు రెండు మూడు నెలలుగా ఫించన్లు రాక ముసలివాళ్లు బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా, యూరియా బస్తాల కోసం రైతులు రోజుల తరబడి వేచి చూస్తున్నా, కార్మికుల ఉద్యోగాలు పోతున్నా సర్కార్‌ లైట్‌గా తీసుకుంటున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘పెద్దలు’ండే విల్లాల కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించటం…సర్వత్రా ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. కానీ విల్లాల నిర్మాణాన్ని మాత్రం శరవేగంగా పూర్తి చేస్తుండటం గమనార్హం.
‘మాకు బేషజాలు లేవు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కారణం కేంద్రమే. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నందున ఈసారి బడ్జెట్‌ పద్దు తగ్గిస్తున్నాం. మాంద్య కారణంగా పలు రంగాలకు కోత తప్పదు’
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
దేశంలో నెలకొన్న మాంద్యం కారణంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చూడని ఆర్థిక సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తున్నదని ముఖ్యమంత్రి సెలవిచ్చారు. కానీ, యాదాద్రిలో వీవీఐపీల విడిది కోసం యాదాద్రిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అత్యంత ఖరీదైన విల్లాలకు మాత్రం మాంద్యం దెబ్బ తాకడం లేదా.అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రపతి, ప్రధాని, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, ముఖ్యమంత్రి వంటి వారు ఆలయానికి వచ్చినప్పుడు విడిది చేయడం కోసం.. దాదాపు 15 విల్లాలను రూ. 100 కోట్లతో నిర్మిస్తున్నారు. ఆలయానికి కింద, యాదగిరీశుడి కొండ పక్కనే ఉన్న మరోకొండపై వీటిని ఆఘమేఘాల మీద కడుతున్నారు. వీటిలో అన్ని హంగులుండేలా.. నిర్మాణాలు చేపడుతున్నారు. వీవీఐపీలు ఉండే విల్లా.. 15 వేల చదరపు అడుగుల ఏరియాలో నిర్మిస్తున్నారు. మిగతా వాటిని 7,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కడుతున్నారు. వీవీఐపీలుండే విల్లాలో ఐదు బెడ్‌రూంలతో పాటు లివింగ్‌ రూం, డైనింగ్‌, కిచెన్‌లూ ఉన్నాయి. ‘తెలంగాణ తిరుపతి’గా పిలవబడుతున్న యాదాద్రి సర్వసౌకర్యాలతో నిర్మిస్తున్నారు.. ఏపీలోని తిరుపతి ఉన్న కాటేజీల కంటే అత్యున్నత స్థాయిలో విల్లాల నిర్మాణాలు చేపట్టాలని సర్కారు భావిస్తున్నది. దీంతో వీటికి ఖజానా నుంచి నిధుల వరదపారుతున్నది.
మరోవైపు ఆలయంలో కనీస సదుపాయాలు లేక సాధారణ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళా భక్తులకు టాయిలెట్లు లేక వారు నానా అవస్థలు పడుతున్నారు. కొత్త గుడిని నిర్మించేందుకుని ప్రస్తుతం ఉన్న గుండాన్ని కూడా తొలగించడంతో భక్తులు బయట నల్లాల దగ్గరే స్నానమాచరిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ సరిగా లేక ఆ పరిసరాలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. అంతేగాక కొత్తగా కడుతున్న ఆలయం ఎప్పటికీ పూర్తవుతుందో తెలీడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఇటీవలే ఈ ఆలయ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి సైతం అధికారుల మీద ఫైర్‌ అయ్యారని వార్తలూ వచ్చాయి. వచ్చే దసరా నాటికి పూర్తి చేస్తామని సర్కారు చెబుతున్నా.. ప్రస్తుతం జరుగుతున్న పనులను బట్టి చూస్తే సాధ్యం కాదనేలా లేదని అధికారవర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగానే త్వరలోనే అక్కడ ‘మహా సుదర్శన యాగం’ చేయనున్నారని సమాచారం.
దీనిపై స్థానికులు స్పందిస్తూ.. మాంద్యం ఉన్నప్పుడు అంత భారీ, అత్యాధునిక నిర్మాణాలను చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక సుమారు రెండు నెలలుగా ప్రజలు డెంగ్యూ, విషజ్వరాలతో బాధపడుతుంటే చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న సర్కారు.. వీవీఐపీల కోసం నిర్మించే విల్లాలకు మాత్రం నిధుల కొరత లేకుండా చూస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Courtesy Navatelangana

Leave a Reply