హక్కు లేదు.. పట్టా లేదు!

0
666

-హరితహారానికి ముందు రగులుతున్న ‘పోడు’
– ఉమ్మడి ఖమ్మంలో గిరిజనులతో నిరంతర ఘర్షణ
– ట్రాక్టర్లు తెచ్చి చదును చేస్తున్న అటవీ సిబ్బంది
– అడ్డుకుంటున్న రైతులపై కేసులు, వేలల్లో జరిమానాలు
– ఆరేండ్లలో ఒక్క హక్కు పత్రమివ్వని సర్కారు

ఖమ్మం: దశాబ్దాలుగా పోడు గోడు తీర్చే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వాలు మారుతున్నా అమాయక గిరిజనుల ఆర్తనాదాలు వినేవారు లేరు. పంట సీజన్‌ సమయంలో దాడులు చేయడం, వేసిన పంటలు దున్నేయడం వంటి చోద్యం నడుస్తున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. మరో మూడురోజుల్లో హరితహారం ప్రారంభం కానున్న నేపథ్యంలో పోడు భూములు లాక్కునేందుకు అధికారులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లోని పోడులోకి వెళ్లి ట్రాక్టర్లతో అధికారులు చదును చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

పోడు రైతులు దొంగలు కాదనీ, పొట్టకూటికోసమే పోడు నరుక్కుని బతుకుతున్నారనీ, వారికి పట్టాలు, హక్కుపత్రాలిచ్చి సంక్షేమ పథకాలు అందజేస్తామనీ స్వయంగా సీఎం కేసీఆర్‌ 2018 ఎన్నికల సమయంలో ప్రకటించారు. సీఎం హౌదాలో జిల్లాకు రెండ్రోజులు కేటాయించి ఈ సమస్యకు చెక్‌ పెడతానని హామీనిచ్చారు. కానీ ఆరేండ్ల తెలంగాణలో ఒక్క హక్కుపత్రం ఇవ్వకపోవడంతో గమనార్హం. గత ఇరవై రోజులు ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అవగతమవుతుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4లక్షల ఎకరాల్లో 80వేల మంది గిరిజనులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి ప్రభుత్వం ప్రకటించిన గిరిజనుల అటవీహక్కు పత్రాలను అందజేయాల్సి ఉంది. యూపీఏ హయాంలో కేవలం 1.78లక్షల ఎకరాలకు మాత్రమే హక్కుపత్రాలు పంపిణీ చేశారు. ఇంకా జిల్లాలో 2.22 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు ఇవ్వాల్సి ఉంది. చేతికందాల్సిన హక్కుపత్రాలు ఫారెస్ట్‌, రెవెన్యూ, ఐటీడీఏ, కలెక్టరేట్‌లో మూలుగుతున్నాయి.

మొక్కలు నాటే పేరిట భూముల్లోకి..
ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న హరితహారానికి ముందు ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం, ఏన్కూరు, కొణిజర్ల, సత్తుపల్లి, పెనుబల్లి, కారేపల్లి, కామేపల్లి, భద్రాద్రి జిల్లా జూలూరుపాడు, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, ములకలపల్లి, మణుగూరు, ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో పోడు ఉద్యమం రగులుకుంది. రఘునాథపాలెం మండలంలోని గణేశ్వరం, దొనబండ, చింతగుర్తి, లచ్చిరాం తండా, ఈర్లపూడి, పంగిడి, మల్లేపల్లి గ్రామాల్లో డెబ్బై ఏండ్లుగా సాగులో ఉన్న గిరిజనులు మానసిక క్షోభకు గురవుతున్నారు. దొనబండ గ్రామంలో ఏడు దశాబ్దాలుగా ఉన్న సర్వేనెంబర్‌ 410, 11, 12లో సుమారు 155 ఎకరాల గిరిజనుల భూముల హక్కుపత్రాలను ఇటీవల రెవెన్యూ శాఖ రద్దుచేసింది. గిరిజనులకు నోటీసులిచ్చి పంటపొలాల్లో హద్దులు ఏర్పాటు చేశారు. గణేశ్వరంలో సర్వేనెంబర్‌ 79లో 520 ఎకరాల్లోని హక్కుపత్రాలు రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. గ్రామంలో బోడ వీరు రైతు ఇటీవల బోర్‌వెల్‌ యంత్రాన్ని తీసుకురాగా అటవీశాఖ అధికారులు సీజ్‌చేసి రూ.70వేలు జరిమానా విధించారు. కారేపల్లి మండలం పాటిమీద గుంపు, మూలపోచారం, బాజుమల్లాయిగూడెంలో వారం రోజులుగా పోడులో అటవీ అధికారులు ట్రాక్టర్లతో దుక్కులు దున్ని నేలను చదును చేస్తున్నారు. అదే భూముల్లో గిరిజనులు విత్తనాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు.

కామారెడ్డి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లోనూ..
కామారెడ్డి జిల్లాలో 30 వేవల ఎకరాల్లో పోడు భూములుంటే అప్పట్లో మన్మోహన్‌ హయాంలో 7 వేల ఎకరాల్లో పట్టాలిచ్చారు. కానీ అందులోనూ కందకాలు తవ్వుతున్నట్టు రైతులు వాపోతున్నారు. పట్టాలిచ్చిన వాటికి కూడా విత్తనాలు, ఎరువులు ఇవ్వడం లేదు. 10 వేల ఎకరాల కోసం ఫారెస్టు, రెవెన్యూ అధికారుల మధ్య నేటికీ వివాదం నడుస్తోంది. గాంధారి, మాచారెడ్డి, సదాశివనగర్‌, ఎల్లారెడ్డి, లింగంపేట, జుక్కల్‌ మండలాల్లో ఈ సమస్యలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో లక్ష ఎకరాల్లో పోడు భూములుంటే 48 వేల ఎకరాలకు హక్కుపత్రాలిచ్చారు. ములుగు జిల్లా ఏటూరునాగారాం, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఇప్పటికీ వేల ఎకరాల్లో పోడు సమస్య నడుస్తోంది. భూపాలపల్లి జిల్లా ఘనపురం, మహబూబాబాద్‌ జిల్లా గూడురులో కూడా ప్రతియేటా వివాదం తెరపైకి వస్తోంది. గతేడాది తాడ్వాయి మండలంలో రైతులను చెట్లకు కట్టేసిన విషయం విదితమే.

చావైనా బతుకైనా పోడులోనే..
– అధికారులు దున్నారు.. రైతులు విత్తనాలు చల్లారు!
– ప్లాంటేషన్‌ పనులు అడ్డుకున్న గిరిజనులు

కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పాటిమీదిగుంపు సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదివారం రంగాపురం ఫారెస్టు బీట్‌లో సాగుచేస్తున్న పోడులోకి ట్రాక్టర్లు, డోజర్లతో వచ్చి ప్లాంటేషన్‌ కోసం అధికారులు దున్నుతుండగా రైతులు అడ్డుకున్నారు. దున్ననిచ్చేది లేదంటూ అడ్డుగా కూర్చున్నారు. ప్లాంటేషన్‌ పనులను అడ్డుకుంటే పీడీ యాక్టు కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు. జీవనాధారం పోయిన తర్వాత జైల్లో ఉన్నా ఇక్కడున్నా ఒకటేనంటూ భీష్మించారు. అనంతరం అధికారులు ట్రాక్టర్లతో దున్నిన పోడులో రైతులు సమిష్టిగా విత్తనాలు చల్లారు. చీమలపాడు, బాజుమల్లాయి గూడెం, పాటిమీదిగుంపు లకుచెందిన పోడు సాగుదారులు ఐక్యంగా పోడుకు వచ్చి సేద్యం పనులు చేశారు. పోడుదారులకు సీపీఐ(ఎం), సీపీఐ, న్యూడెమోక్రసీ సంఘీభావం, మద్దతు తెలిపాయి. ఈ భూమిలో ప్లాంటేషన్‌ కోసం మొట్లు తీశామని, ఈసారి దున్నుతుంటే రైతులు అడ్డుపడటం సరికాదని, వారి ఏ హక్కూ లేదని కారేపల్లి ఫారెస్టు రేంజ్‌ అధికారి నాగేశ్వరరరావు వివరణ ఇచ్చారు.

దాడులు ఆపాలి, హక్కుపత్రాలివ్వాలి
ఇటీవల జిల్లా మంత్రి ఆదేశించినా అటవీ అధికారుల్లో మార్పురాలేదు. గతంలో పోడు రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ప్రభుత్వం బేషరతుగా ఎత్తివేయాలి. వారికి చట్ట ప్రకారం రావాల్సిన హక్కుపత్రాలు పంపిణీ చేయాలి. గిరిజనులపై దాడులు చేస్తే సహించేదిలేదు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పలువురు అమాయకులు భయంతో ఆత్మహత్యలు చేసుకున్నారు.
– భూక్యా వీరభద్రం, గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి

Courtesy Nava Telangana

Leave a Reply