గుస్సాడి కనకరాజుకు పెన్షన్ ఏమాయె?

0
26
  • 10 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి మాట తప్పిన సర్కారు
  •  పద్మశ్రీ ప్రకటించిన టైంలో హామీలిచ్చి వదిలేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు
  • టీబీ వ్యాధితో దుర్భర జీవితం గడుపుతున్న ఆదివాసీ కళాకారుడు
  • పద్మశ్రీ ప్రకటించిన టైంలో హామీలిచ్చి వదిలేసిన  మంత్రులు, ఎమ్మెల్యేలు

‘‘ కేంద్ర ప్రభుత్వం నాకు పద్మశ్రీ అవార్డు ప్రకటించాక, పెన్షన్​కింద నెలకు రూ.10 వేలు ఇస్తామని రాష్ట్ర సర్కారు చెప్పింది. మంత్రి శ్రీనివాస్​గౌడ్ పెన్షన్ ​ఆర్డర్ కాపీ కూడా ఇచ్చారు. ఇచ్చి 4 నెలలు అవుతున్నా ఇప్పటి వరకైతే పెన్షన్ రాలేదు. అలాగే 5 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇల్లు, ట్రాక్టర్, నా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారు. కానీ నేటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు.’’                              కనకరాజు మార్లవాయి పద్మశ్రీ అవార్డ్ గ్రహీత

ఆసిఫాబాద్/ జైనూర్ : ఆదివాసీ సంప్రదాయ గుస్సాడీ నృత్య కళతో పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కళాకారుడు కనకరాజు కష్టాల్లో ఉన్నారు. కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన వెంటనే శాలువాలు కప్పి సన్మానాలతో ముంచెత్తిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఆయన్ని పట్టించుకోవడంలేదు.10 వేలు పెన్షన్, డబుల్ బెడ్​రూం ఇల్లు, ట్రాక్టర్, కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్​జాబ్, 5 ఎకరాల పొలం ఇప్పిస్తామంటూ హామీలు గుప్పించి వదిలేశారు. ప్రస్తుతం కనకరాజు దుర్భర జీవితం గడుపుతున్నారు. 2 నెలల క్రితమే టీబీ బారిన పడ్డారు. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్, హైదరాబాద్ లోని హాస్పిటల్స్​లో చూయించారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్​హాస్పిటల్స్​లో అడ్మిట్ కాలేక ఇంటి కాడే ట్రీట్​మెంట్ తీసుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలంటే మంచి ఫుడ్డు తీసుకోవాలని, మెడిసిన్​వాడాలని డాక్టర్లు చెబుతున్నారు. గుస్సాడీ కళకు గుర్తింపు తెచ్చిన కనకరాజు ఆరోగ్యం మెరుగుపడాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రకటించిన సాయం, పెన్షన్​ను అందించాలని అతని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఆదివాసీ సంప్రదాయానికి ప్రాణం
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు నిరుపేద.  ఆయనకు ఇద్దరు భార్యలు, 12 మంది సంతానం. కనకరాజు మార్లవాయిలోని ఐటీడీఏ ఆశ్రమ స్కూల్​లో డైలీ వేజ్​వర్కర్​గా పని చేస్తూనే గుస్సాడీ డ్యాన్సులు చేసేవారు. 3, 4 నెలలకు ఒకసారి వచ్చే వేతనంతోనే ఆయన కుటుంబం గడిచేది.  గుస్సాడీ నృత్య కళను పెంచిపోషిస్తున్న కనకరాజుకు పద్మశ్రీ ఇవ్వనున్నట్లు కేంద్రం జనవరిలో ప్రకటించింది. ఆ వెంటనే గుస్సాడీ నృత్యంతో ఆదివాసీ సంప్రదాయానికి, అలాగే రాష్ట్రానికి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కనకరాజుకు నెలకు రూ.10వేలు పెన్షన్ ఇస్తామని తెలంగాణ సర్కారు హామీ ఇచింది. మే 31న మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంప్ ఆఫీస్​లో కనకరాజుకు స్వయంగా పెన్షన్ ఆర్డర్ కాపీని అందచేశారు. 4 నెలలు గడుస్తున్నా రాజు చేతికి ఇంతవరకు పెన్షన్ అందలేదు. పద్మశ్రీ అవార్డ్ గ్రహీతతో స్కూల్ డ్యూటీ చేయించకూడదని ఐటీడీఏ ఆఫీసర్లు నిర్ణయించారు. దాంతో కనకరాజుకు ఉపాధి కూడా దూరమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన టీబీ బారిన పడ్డారు. కనకరాజును, అతని కుటుంబానికి టీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అయినా కనకరాజు పరిస్థితిని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని అతని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Courtesy V6velugu

Leave a Reply