పీఎం కిసాన్ కొందరికే..!

0
264

-కేటాయింపు 75 వేల కోట్లు.. ఖర్చు 26 వేల కోట్లే
– కౌలు రైతుల ఊసేలేదు

న్యూఢిల్లీ: గత సాధారణ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కొందరికే పరిమితమవుతోంది. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారమే దేశంలో 14.5 కోట్ల మంది రైతులున్నారు. వీరందరికి ఈ పథకం కింద 75 వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి ఈ మొత్తంలో అతి కష్టం మీద 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 33శాతం నిధులు ఖర్చు కావన్నమాట. గత ఆర్థిక సంవత్సరంలో 26వేల కోట్ల రూపాయలనే ఖర్చు చేశారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి లక్ష్యాన్ని చేరుకుంటామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ ఆచరణలో నెరవేరడం అనుమానమే! భూ యజమానుల సంఖ్యకు, వాస్తవంగా సాగు చేసే వారి సంఖ్యకు మధ్య ఉన్న భారీ తేడానే ఈ పరిస్థితికి కారణం. జీవనోపాధి కోసం భూమి మీద ఆధారపడిన ప్రతిఒక్కరు రైతే అని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ చెబుతున్నా దానినే కేంద్రం పట్టించుకోవడం లేదు. మన రాష్ట్రంలోనూ రైతు భరోసా అమలు విషయంలో ఇటువంటి సమస్యే తలెత్తుతున్న విషయం తెలిసిందే. రైతులందరికి భరోసా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెబుతూనే మరోవైపు కౌలుదారులకు అమలు చేసే విషయంలో అనేక ఆంక్షలు పెడుతున్న సంగతి తెలిసిందే.
ఈ పథకానికి ప్రామాణికంగా తీసుకున్న వ్యవసాయ గణాంకాలు యజమాని ఎవరన్న దానితో సంబంధం లేకుండా సాగులో ఉన్న భూ కమతాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. కేంద్ర వ్యవసాయశాఖ అధికారికంగా ప్రకటించిన విధానం ప్రకారం భూమి లేనప్పటికీ జీవనోపాధికోసం దానిపైన ఆధారపడిన ప్రతి ఒక్కరూ రైతే! అయితే, పీిఎం కిసాన్‌ పథకంలో ఈ నిర్వచనాన్ని కేంద్రం విస్మరించింది. భూమిపై స్పష్టమైన హక్కు ఉన్న యజమానిని మాత్రమే రైతుగా పరిగణించింది, ఫలితంగా భూమిపై యాజమాన్య హక్కు లేనప్పటికీ పెద్ద సంఖ్యలో సాగుదారులుగా ఉన్న వారికి దీని ప్రయోజనం అందలేదు.
ఇలా భూమిపై ఆధారపడి జీవితాన్ని సాగిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఏం లేదు. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 14.43 కోట్ల మంది వ్యవసాయ కార్మికులున్నారు. వీరందరిని కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకురావాల్సిఉంది.అంటే, ఇప్పటికే అంచనా వేస్తున్న 14.5 కోట్ల మంది రైతులకు అదనంగా కౌలురైతులను, వ్యవసాయ కార్మికులను పరిగణలోకి తీసుకోవాల్సిఉంది. దానికి భిన్నంగా అధికారికంగా రికార్డుల్లో కనిపించే రైతులకు కూడా ఈ పథకం ప్రయోజనాలు అందడం లేదు. ఒక మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడిన వ్యవసాయ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ సైతం ఇదే విషయాన్ని చెప్పారు. ‘దాదాపుగా 33శాతం నిధులు మిగిలే అవకాశం ఉంది’ అని ఆయన అన్నారు.

నిధులు … ఖర్చు ఇలా
ఈ పథకం కింద 20 వేల కోట్ల రూపాయలను 2018-19లో కేంద్రం తొలుత కేటాయించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 12.5 కోట్ల మంది చిన్న. మధ్య తరగతి రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ కేటాయింపులు చేశారు. ఎన్నికల తరువాత రైతులుందరిని ఈ పథకం కిందకు తీసుకువస్తున్నట్లు చేసిన ప్రకటనను 2018-19 సంవత్సరానికి కూడా వర్తింపచేశారు. అన్ని తరగతుల రైతులను కలుపుకుంటే దేశవ్యాప్తంగా 14.5 కోట్ల మందికి ఈ ప్రయోజనాలు అందాల్సిఉంది. కానీ, జరిగింది వేరు. రైతుల సంఖ్యకు తగ్గట్టుగా 75 వేల కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ,
అతి కష్టం మీద 26వేల కోట్ల రూపాయలను మాత్రం ఖర్చు చేయగలిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. అతి కష్టం మీద 50 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయగలుగుతున్నారు.

భూ కమతం అంటే..?
కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ ప్రకారం వ్యవసాయం వినియోగించే భూమి.
రైతు కుటుంబం అంటే..
పీఎం కిసాన్‌ ప్రకారం రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత రికార్డుల ప్రకారం సాగులో ఉన్న భూమిని కలిగి ఉన్న యజమాని, అతని జీఇత భాగస్వామి, మైనర్‌ పిల్లలు.
రైతు అంటే…
వ్యవసాయ మంత్రిత్వశాఖ జాతీయ విధానం ప్రకారం వ్యవసాయ కార్యక్రమాల్లో నిమగమై జీవనోపాధి కోసం భూమిపై ఆధారపడి పంటలను, ప్రాధమిక వ్యవసాయ ఉత్పత్తులను పండించే వారు.

Courtesy Nava Telangana..

Leave a Reply