- అవే వేసుకుంటామని ఒత్తిడి తేవొద్దు..
- విద్యార్థులకు కర్ణాటక హైకోర్టు సూచన
- నేటి నుంచే స్కూళ్లు, కాలేజీలు తెరవాలి
- కేసును వీలైనంత త్వరగా తేల్చేస్తాం: కోర్టు
బెంగళూరు/న్యూఢిల్లీ : హిజాబ్ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం పరిష్కారమయ్యేదాకా విద్యాసంస్థల ప్రాంగణాల్లో ధార్మిక దుస్తులు ధరించొద్దని కర్ణాటక హైకోర్టు విద్యార్థులకు సూచించింది. హిజాబ్, కాషాయ కండువాలు ధరిస్తామని ఒత్తిడి తెస్తే ప్రజలను రెచ్చగొట్టినట్లు అవుతుందని తెలిపింది. ఈ వివాదం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూసేసిన స్కూళ్లు, కాలేజీలను శుక్రవారం నుంచే తెరవాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించింది. తుది తీర్పు ప్రకటించే దాకా విద్యార్థులెవరూ ధార్మిక దుస్తులతో తరగతులకు రావద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థి, జస్టిస్ జేఎం ఖాజీ, జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం పేర్కొంది. ‘ముందు కాలేజీలు, స్కూళ్లు ప్రారంభం కావాలి.
ఈ వ్యవహారం తేలేదాకా హిజాబ్, కాషాయ కండువా వేసుకుంటామని విద్యార్థులు అనకూడదు’ అని పేర్కొంది. అయితే దీనిని అమలు చేస్తే రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రకారం తన కక్షిదారుల రాజ్యాంగ హక్కులను సస్పెండ్ చేయడమే అవుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది దేవదత్ కామత్ పేర్కొన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ.. ఇది కొద్ది రోజులు మాత్రమేనని, రోజువారీ విచారణ జరుపుతామని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదావేశారు. కాగా విద్యాలయాల్లో యథాతథ స్థితిని కొనసాగిస్తూ.. శుక్రవారం నుంచి వాటిని తిరిగి తెరవాలన్న కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. హిజాబ్, కాషాయ కండువాలను స్కూళ్లు, కాలేజీల్లోకి అనుమతించరాదన్న త్రిసభ్య బెంచ్ మధ్యంతర ఆదేశాల అమలుపై ముఖ్యమంత్రి బొమ్మై గురువారం అధికారులు, మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. దీంతో సోమవారం నుంచి పదోతరగతి వరకు అనుమతించాలని, ఆ పై పీయూ (ప్రీ యూనివర్సిటీ)తరగతులపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
Courtesy Andhrajyothi