- ఓ దళిత వృద్ధుని దుర్భర జీవితం
- ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు
ఏన్కూరు : ఆ వృద్ధునికి నా అనే నాథుడు లేడు.. తలదాచుకునేందుకు నిలువ నీడ కూడా లేదు. దళిత సామాజికవర్గానికి చెందిన అతనిని విధి ఒంటరిని చేస్తే.. ప్రకృతి గూడు లేకుండా చేసింది. భారీ వర్షాలకు ఆ వృద్ధుని పూరి గుడిసె నేలమట్టమవ్వగా.. మరుగుదొడ్డే ప్రస్తుతం అతని ఆవాసమైంది. అత్యంత దుర్భర జీవనం గడుపుతున్న ఆ వృద్ధుడు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ ఎస్సీ కాలనీకి చెందిన చిలుకూరి అబ్రహం(60)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. వాళ్లందరికీ వివాహాలవ్వగా.. వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్నారు. అబ్రహం భార్య నాగరత్నం అనారోగ్యం వల్ల ఐదేళ్ల క్రితం మరణించారు. అప్పట్నించి తనకు చెందిన పూరి గుడిసెలో అబ్రహం ఒంటరిగా ఉంటున్నారు. భారీ వర్షాల దెబ్బకు మూడు నెలల క్రితం ఆ గుడిసె కూడా కూలిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అబ్రహం మరుగుదొడ్డినే తన నివాసంగా మార్చుకున్నారు. దళితుడైన అబ్రహంకు ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సాయం అందలేదు. ఆసరా పింఛను కోసం పలుమార్లు దరఖాస్తు చేయగా.. రికార్డుల ప్రకారం వయస్సు సరిపోలేదని వాటిని తిరస్కరించారు. అయినవారి ఆదరణ లేక, కూడు, గూడు కోసం అవస్థలు పడుతున్న తనను ప్రభుత్వమే ఆదుకోవాలని అబ్రహం వేడుకుంటున్నారు. తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తోపాటు ఆసరా పింఛను కేటాయించాలని కోరుతున్నారు. అంతేకాక దళితు బంధు సాయాన్ని మంజూరు చేసి చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు. కాగా, ఎస్సీ కాలనీలో గురువారం పర్యటించిన సీపీఎం వైరా నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా వీరభద్రం.. అబ్రహం పరిస్థితిని తెలుసుకుని చలించిపోయారు. అబ్రహంను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ లేఖ కూడా రాశారు.