ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!

0
240
ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
Image result for Telangana police irresponsible" యువతి అదృశ్యంపై సకాలంలో స్పందించని తుకారంగేట్‌ పోలీసులు
 గత నెల 22న తల్లి ఫిర్యాదు.. ఇద్దరు యువకులపై అనుమానం
 విచారణ కూడా జరపని పోలీసులు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే, అడ్డగుట్ట: పోలీసులు సత్వరమే స్పందించి ఉంటే ‘దిశ’ విషయంలో ఇంత ఘోరం జరిగి ఉండేది కాదేమో.. దేశవ్యాప్తంగా ఎంతోమందిలో మెదిలిన అనుమానమిది. ఆ విషయాన్ని మరచిపోకముందే పోలీసుల నిర్లక్ష్యానికి మరో యువతి శవం సాక్ష్యంగా నిలుస్తోంది. తన కుమార్తె కనిపించడం లేదంటూ ఓ విద్యార్థిని తల్లి గతనెల 22న తుకారాంగేట్‌ పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఇద్దరు యువకులపై అనుమానం ఉందంటూ ఆందోళన చెందింది. కానీ చాలా మామూలుగానే పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. ఆమె రోజూ పోలీస్‌ ఠాణా చుట్టూ తిరుగుతున్నా స్పందించలేదు. 18 రోజుల తర్వాత గాంధీ ఆసుపత్రిలో గుర్తుతెలియని శవం ఉంది.. మీ అమ్మాయిదేనేమోనంటూ ‘చావు’కబురు చల్లగా చెప్పారు. దీంతో అక్కడకు వెళ్లిన తల్లి విగతజీవిగా ఉన్న బిడ్డను చూసి భోరుమంది.. పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తుకారంగేట్‌ పోలీస్‌ ఠాణా ఎదుట బంధువులు ధర్నా నిర్వహించారు.
ఏం జరిగింది…?
హైదరాబాద్‌ బుద్ధానగర్‌లో ఓ దళిత యువతి తల్లి, ఇద్దరు సోదరులతో కలసి ఉంటోంది. తండ్రి కొద్దికాలం క్రితమే చనిపోయాడు. తల్లి కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతుంటుంది. ఆ యువతి ఇంటర్‌ చదువుతోంది. అదే ప్రాంతంలో ఉంటున్న భాగ్యరాజ్‌, కమల్‌ అనే ఇద్దరు యువకులు ఆమెతో అప్పుడప్పుడూ మాట్లాడేవారు. నవంబరు 21న కళాశాలకని వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. తల్లి, బంధువులు రాత్రంతా గాలించారు. ఆచూకీ లేకపోవడంతో నవంబరు 22న తుకారాంగేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాగ్యరాజ్‌, కమల్‌ అనే యువకులు తన కుమార్తెతో తరచూ మాట్లాడేవారని, వారిపైనే తమకు అనుమానం ఉందని చెప్పారు. పోలీసులు వెతికిపెడతామని చెప్పి పంపేశారు.
ఇదీ నిలువెత్తు నిర్లక్ష్యం..
యువతి అదృశ్యం గురించి పోలీసులు కొంచెం కూడా పట్టించుకోలేదు. బాధితులు అనుమానం వ్యక్తం చేసిన యువకులను పిలిపించి ప్రశ్నించలేదు. సమీప పోలీస్‌ ఠాణాలకు సమాచారం ఇవ్వలేదు. రైల్వేస్టేషన్లు, హుస్సేన్‌సాగర్‌ వద్ద పరిశీలించలేదు.
* నవంబరు 23 తెల్లవారుజామున లేక్‌ పోలీసులు గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని హుస్సేన్‌సాగర్‌లో గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని కూడా తుకారాంగేట్‌ పోలీసులు తెలుసుకోలేదు.
* మృతదేహం దుర్వాసన వచ్చే అవకాశాలుండడంతో గాంధీ ఆసుపత్రి వైద్యులు నవంబరు 28న ఆ యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పోలీసులకు సమాచారం అందించారు.
* ఆమె చనిపోయిన 17 రోజులకు (ఈనెల 8న) తుకారాంగేట్‌ పోలీసులు గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. గుర్తు తెలియని శవం, అదృశ్యమైన యువతి ఒకే వయసు ఉండడంతో వివరాలు రాసుకుని ఠాణాకు వచ్చారు.
* ఈనెల 9న ఆ యువతి తల్లిని పిలిచి గాంధీ ఆసుపత్రిలో ఒక మృతదేహం ఉందని చూడమని చెప్పారు. దుస్తులు చూసి అది తమ కుమార్తెదేనని తల్లి గుర్తించింది.
* బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేసరికి.. గతనెల 22న ఆ యువతి ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో తిరిగినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డయిందని పోలీసులు గుర్తించారు. మరి మొదట్లోనే సీసీ కెమెరాలను ఎందుకు చూడలేదని ప్రశ్నిస్తే సమాధానం లేదు.
ఆ యువకులే చంపారేమో?
ఆ యువతిని  భాగ్యరాజ్‌, కమల్‌ అనే యువకులే చంపిఉంటారని అడ్డగుట్ట వ్యవస్థాపక సభ్యుడు యాదగిరి, మహిళా సంఘం ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేశారు. భాగ్యరాజ్‌, కమల్‌పై అనుమానం చెప్పినా పోలీసులు ఎందుకు స్పందించలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు అన్యాయం జరిగితే పోలీసులు ఏ మాత్రం స్పందించరంటూ నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
(Courtesy Eenadu)

Leave a Reply