తెదేపానా?.. అయితే రోడ్డిచ్చేది లేదయ్యా!

0
53

మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్య

రాజుపాలెం : తెదేపా సానుభూతిపరులైతే, వారి ఇళ్లకు రోడ్డు వేసేది లేదంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా రాజుపాలెంలో సోమవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా పర్యటించిన మంత్రి ఓ ఇంటి గుమ్మం ముందున్న వ్యక్తినుద్దేశించి తన పక్కనున్న వారిని ‘మనోడేనా’ అని ప్రశ్నించారు. వారు ‘కాదండి టీడీపీ’ అని చెప్పారు. ‘టీడీపీ అయితే రోడ్డు ఇచ్చేది లేదయ్యా’ అంటూ రాంబాబు ముందుకు వెళ్లిపోయారు. ‘ఇవ్వకండి, బాధ లేదండి’ అంటూ ఆ వ్యక్తి సఖినాల ధర్మారావు స్పందించారు. అంతకుముందు గ్రామంలో పలువురి నుంచి మంత్రికి నిరసన సెగ తగిలింది. సంక్షేమ పథకాల లబ్ధిని తెలియజేసే కరదీపిక అందిస్తుండగా దివ్యాంగురాలైన జలపాటి సరోజిని తన పింఛను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. మంత్రి బదులివ్వకుండా వెళ్లిపోవడంతో ఆమె మండిపడ్డారు. సరోజిని పేరిట నాలుగు విద్యుత్తు మీటర్లు ఉన్నందున పింఛను రద్దు చేశామని ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. గ్రామస్థుడు చొక్కా వెంకటేశ్వర్లు (బుల్లబ్బాయి).. ట్రాక్టర్‌ మట్టి కావాలంటే రూ.1500 ఇవ్వాల్సి వస్తోంది. మా ఇంటి దగ్గర కాల్వ బాగు చేయలేదు. మాజీ స్పీకర్‌ కోడెల హయాంలో వేసిన సిమెంట్‌ రోడ్డు తప్ప వైకాపా మూడేళ్ల పాలనలో ఏమీ చేయలేద’ంటూ ఆక్షేపించారు. ఈ పర్యటన కవరేజీకి వెళ్లిన విలేకరులపై మంత్రి అసహనం వ్యక్తంచేశారు. ‘ఇంటింటికీ వెళ్లినప్పుడు ప్రజలు పూలతో స్వాగతిస్తూ బ్రహ్మరథం పడుతున్న విషయం మీకు కనిపించదా’ అని ప్రశ్నించారు.

Leave a Reply