ఐదు నెలలుగా జీతాల్లేవ్…

0
256

– పీఎం కేర్స్‌కు విరాళం
– అలహాబాద్‌ వర్సిటీ తీరుపై పరిశోధక విద్యార్థుల అసంతృప్తి
– అప్పులు చేస్తూ బతుకుతున్నామని ఆవేదన

లక్నో : అలహాబాద్‌ యూనివర్సిటీ యాజమాన్యం తీరుపై పరిశోధక విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలలుగా తమకు జీతాలు చెల్లించడానికి యాజమాన్యం నిరాకరిస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎం కేర్స్‌కు వర్సిటీ యాజమాన్యం విరాళమివ్వడంపై స్కాలర్లు స్పందించారు. విరాళం ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదనీ, అయితే ఐదు నెలలుగా తమకు జీతాలు చెల్లించడానికి నిరాకరిస్తున్న యాజమాన్యం విరాళమెలా ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు. పీఎం కేర్స్‌కు అలహాబాద్‌ వర్సిటీ సుమారు రూ. 45 లక్షల విరాళమిచ్చినట్టు సమాచారం.

ఇదే విషయమై పలువురు స్కాలర్లు స్పందిస్తూ… ‘ఇది ప్రభుత్వ సంస్థ, ఉద్యోగులు ఎవరికైనా విరాళమివ్వొచ్చు. దానిపై మాకు ఎలాంటి అభ్యంతరాలూ లేవు. కానీ వర్సిటీ యాజమాన్యం మా గురించి కూడా ఆలోచించాలి. ఈ విపత్కర పరిస్థితుల్లో మేం ఎలా బతుకుతాం..? గతేడాది డిసెంబర్‌ నుంచి మాకు జీతాల్లేవ్‌. లాక్‌డౌన్‌ ప్రారంభమయ్యాక దాని గురించి ఎవరిని అడగాలో తెలియడం లేదు. వర్సిటీ జీతాలు చెల్లించకపోవడంతో చిన్న ఖర్చులకు కూడా బయట అప్పులు తీసుకుని బతకాల్సి వస్తున్నది’ అంటూ వాపోయారు.

స్కాలర్ల పరిస్థితి ఇలా ఉంటే గెస్ట్‌ ఫ్యాకల్టీల వెతలు మరో విధంగా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి వారి కాంట్రాక్ట్‌ ముగిసింది. మళ్లీ వారి కాంట్రాక్టును పునరుద్దరించే విషయంపై ఇంతవరకూ వర్సిటీ అధికారులు గానీ, ప్రభుత్వం గానీ ఏ విధమైన వివరణా ఇవ్వలేదని వారు చెబుతున్నారు. దీనిపై స్పందించాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖకు లేఖలు రాసినా ఇంతవరకు వారికి సమాధానం రాలేదు. వీరికి కూడా జనవరి నుంచి వేతనాలు చెల్లించలేదని ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు.

ఇదిలాఉంటే ఇదే విషయమై వర్సిటీ ఆర్థిక వ్యవహారాలు చూసే ఫైనాన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సునీల్‌ కాంత్‌ మిశ్రా మాట్లాడుతూ… ‘ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ లాక్‌డౌన్‌ ముందువరకు వేతనాలు చెల్లించాం. పీహెచ్‌డీ స్కాలర్లకు మాత్రం చెల్లించలేదు. వారి పరిశోధనలకు సంబంధించిన పత్రాలను సంబంధింత ప్రొఫెసర్లకు సమర్పించవలసి ఉంది. వాటిని పరిశీలించిన తర్వాతే ఆ విద్యార్థుల వేతనాలు చెల్లించవలసి ఉంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా వర్సిటీకి సెలవులు ప్రకటించడంతో మేం ఏం చేయలేకపోతున్నాం’ అని ఆయన తెలిపారు. దీనిపై ఒక విద్యార్థి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ ఉన్న విషయం తాము అర్థం చేసుకోగలమనీ, కానీ ఐదునెలలుగా తమకు జీతాలులేవనీ, కొంత మొత్తమైనా జీతాలు చెల్లించి తమను ఆదుకోవాలని కోరారు.

Courtesy Nava Telangana

Leave a Reply