హక్కులు హాంఫట్‌!

0
469

మ్యుటేషన్‌ కాని స్థలాలపైనే దళారుల కన్ను
భూ విక్రయాల మాటున ఘరానా మోసం
అబ్దుల్లాపూర్‌మెట్‌ సహా పలు ప్రాంతాల్లో ఇదే దుస్థితి
హైదరాబాద్‌- ‘అవుటర్‌రింగ్‌ రోడ్డును ఆనుకుని ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాచారం రెవెన్యూ పరిధిలో ఒక సర్వే నంబరులోని ఎకరా సాగు భూమిని ఓ దళారీ ఇద్దరు వ్యక్తులకు విక్రయించాడు. రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయి. ఆ సర్వే నంబరును రెవెన్యూ శాఖ వివాదాస్పద భూముల జాబితా పార్ట్‌-బిలో చేర్చడంతో ఆన్‌లైన్‌లోనూ వివరాలు లేవు. పాసుపుస్తకం జారీ చేయాలంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పుడు మోసం తెలుసుకుని కొనుగోలుదారులు కంగుతిన్నారు. ఈ గందరగోళానికి కారణం భూ యాజమాన్య హక్కులు (మ్యుటేషన్‌) బదిలీకాకపోవడమే.

మ్యుటేషన్‌ విధానంలో లోపాలే శాపం
* నగర శివారుల్లో ఎక్కడో ఒక చోట ప్లాటు ఉండాలి.. కుటుంబ భవిష్యత్తు అవసరాలకు రెండు ఎకరాలైనా కొనుగోలు చేయాలనే సగటు మనిషి ఆశను ఆసరాగా చేసుకుని దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. మరోపక్క ధరలు అమాంతం పెరుగుతుండటంతో అందరి దృష్టి భూమిపైనే.. దీంతో నగరం చుట్టూ  భూ లావాదేవీలు పెరిగాయి. తీరా భూములు కొనుగోలు చేశాక దస్త్రాలు స్పష్టంగా లేవని తెలిసి కొనుగోలుదారులు గతుక్కుమంటున్నారు. భూ యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత లేకపోవడమే దీనికి కారణం. ఈ అస్పష్టతతోనే నేరాలు, వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో చోటుచేసుకున్న తాజా వివాదానికి కారణం ఈ అస్పష్టతే. వ్యవస్థలోని లోపాల వల్లే దస్త్రాలేవీ స్పష్టంగా లేకున్నా క్రయవిక్రయాలు చోటుచేసుకుంటున్నాయి.

* భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్న యజమాని సంబంధిత తహసీల్దారు కార్యాలయంలోని మాతృ దస్త్రం (1బి)లో పాత యజమాని పేరు వద్ద తన పేరును నమోదు చేయించుకోవాలి. ఈ హక్కుల బదిలీని మ్యుటేషన్‌గా వ్యవహరిస్తారు.
* రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక ఆ దస్త్రాలతో పాటు పాసుపుస్తకాన్ని జోడించి తహసీల్దారుకు దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో రెవెన్యూ సిబ్బంది ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. గతంలో ఈ వ్యవధి 45 రోజులుగా ఉండేది.
* ఈ ప్రక్రియ పూర్తి చేసుకుంటే ఇతరులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉండదు. విదేశాలకు వెళ్లిన వారు, ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉన్న వారు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదు. మరో పక్క మ్యుటేషన్లకు దరఖాస్తు చేసుకున్నవారినుంచి దిగువ స్థాయి అధికారులు డబ్బులకు డిమాండ్‌ చేస్తుండటంతో రిజిస్ట్రేషన్‌ స్థాయిలో మ్యుటేషన్లు కావడం లేదు.

ఇక్కడ యజమానులు మారరు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాచారం రెవెన్యూ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్ల అనంతరం మ్యుటేషన్లు చాలా వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. గౌరెల్లి గ్రామానికి చెందిన రైతుల పేరుపై భూ యాజమాన్య హక్కు (ఆర్‌ఓఆర్‌) పట్టాలుండగా. వారిలో కొంతమంది విక్రయిస్తున్నారు. మరోవైపు ఈ భూములను కొందరు రక్షిత కౌలుదారులు (పూర్వ కాలంలో) కూడా అమ్ముతున్నారు. ఎకరా భూమి విలువ రూ.కోట్లు పలుకుతున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇదే తీరులో అనేక మండలాల్లో యాజమాన్య హక్కులు బదిలీ కాకుండా క్రయవిక్రయాలు పూర్తయి గందరగోళ పరిస్థితులున్నాయి. ఈ జిల్లాలో ఏటా దాదాపు అరవై వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మ్యుటేషన్లు ఆ స్థాయిలో ఉండటం లేదు.

గజం చొప్పున అమ్మేస్తున్నారు
మరోపక్క స్టాంపులు రిజిస్ట్రేషన్ల చట్టంలోని లొసుగులను దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. సాగు భూములను గజాల చొప్పున రిజిస్ట్రేషన్‌ చేయించి దొడ్డి దారిన విక్రయిస్తున్నారు. దీనివల్ల భూ యజమాని మారకపోయినప్పటికీ (మ్యుటేషన్‌ లేకపోయినప్పటికీ) భూ లావాదేవీలు పూర్తవుతున్నాయి. వివాదాలకు కారణమవుతున్నాయి. నగర శివారుల్లో వ్యవసాయ భూములను ఇదే విధంగా అమ్మేస్తున్నారు. దీంతో వివాదాలు కొనసాగుతున్నాయి.

ధరణి అధికారికంగా అమల్లోకి వస్తేనే
రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల వివరాలను ఒక్కచోట పరిశీలించే సాంకేతికత ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇది కూడా లావాదేవీల్లో మోసానికి కారణమవుతోంది. 2017 నుంచి 2018 మధ్య రాష్ట్రంలో చోటుచేసుకున్న రిజిస్ట్రేషన్లకు సంబంధించిన మ్యుటేషన్లు చాలా జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సమాచారం లేని పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న కొందరు వివాదాస్పద భూములకు కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఒకే భూమికి రెండు మూడు రిజిస్ట్రేషన్లు జరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయని ఓ రెవెన్యూ అధికారి పేర్కొన్నారు. ఒకే చోట రెండు సేవలను అందించేందుకు ఏర్పాటు చేస్తున్న ధరణి పోర్టల్‌ అమలు ఆలస్యమవుతోంది.

మ్యుటేషన్‌ చేసుకోకపోతే నష్టపోతారు
మ్యుటేషన్ల అంశంపై రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ హరీశ్‌ వద్ద ‘ఈనాడు’ ప్రస్తావించగా పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు పరిశీలించాకే భూ కొనుగోలు చేస్తే మేలని ఆయన చెబుతున్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు మ్యుటేషన్‌ చేసుకోకపోతే నష్టపోతారని పేర్కొన్నారు.

Courtesy Eenadu..

Leave a Reply