అది కరోనా చావు కాదు.. వైద్య నిర్లక్ష్యమే

0
282

తప్పు చేసినవారిపై చర్య తీసుకోవాల్సిందే
ఛాతీ ఆసుపత్రిలో వైద్యం అందక వ్యక్తి మృతి చెందడంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: ఛాతీ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక రవికుమార్‌ అనే యువకుడు మృతిచెందిన సంఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అది కరోనా వల్ల వచ్చిన మరణం కాదని, వైద్యుల నిర్లక్ష్యంతోనే జరిగిందని పేర్కొంది. ఇలా తప్పు చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. వారిపై కేసులు నమోదు చేసి అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సి ఉందని పేర్కొంది. యువకుడి మృతికి కారకులైన వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధితుడి కుటుంబానికి పరిహారం ఇప్పించాలని కోరుతూ బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్గం యశ్‌పాల్‌గౌడ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రియాంక చౌదరి వాదనలు వినిపిస్తూ.. సకాలంలో వైద్యం అందక రవికుమార్‌ మృతి చెందారన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారానికి సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌కు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక నిజాయితీగా ఉండాలని స్పష్టం చేసింది. పూర్తి నివేదికను ఈ నెల 20లోగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.

Courtesy Eenadu

Leave a Reply