కార్మికులకు 5 వరకే డెడ్‌లైన్‌!

0
218

సోదరుడిగా చెప్తున్నా.. ఆలోగా చేరితే కొలువుకు రక్షణ: కేసీఆర్‌

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి మరో అవకాశం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఈ నెల అయిదో తేదీ అర్ధరాత్రిలోగా విధుల్లో చేరిపోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ రూట్లలో సగం ప్రైవేటుకు ఇవ్వాలన్న కీలక నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘‘49 వేల మంది కార్మికులున్నారు. వాళ్ల పొట్ట గొట్టాలని మాకు లేదు. ఆర్టీసీ కార్మికులూ మా బిడ్డలే. యూనియన్ల మాయలో పడి మోసపోవద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ నాయకుడిగా, సోదరుడిగా, రాష్ట్ర అధినేతగా చెప్తున్నా. కార్మికుల కుటుంబాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. యూనియన్ల మాయలో పడి భవిష్యత్తు చెడగొట్టుకోవద్దు’’ అన్నారు. ‘‘సమ్మెను కఠినంగా అణచి వేయాలనే ఉద్ధేశం మాకు లేదు. మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. నవంబరు 6 తేదీలోగా బేషరతుగా డ్యూటీలో చేరితే రక్షణ ఉంటుంది. అన్నిరకాలుగా భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు. ‘‘మేం చెడగొట్టుకుంటాం. అలాగే పోతాం’ అంటే ప్రభుత్వం కూడా చేయగలిగిందేమీ లేదని చెప్పారు. కార్మికులు పునరాలోచన చేసుకుని వస్తే రక్షణ కల్పిస్తామన్నారు. ‘‘కార్మికులను సమ్మెకు వెళ్లొద్దని చెప్పాం. ప్రభుత్వం ఓ కమిటీని నియమించి చర్చలు జరపాలని చెప్పింది. చట్టవిరుద్ధమైన సమ్మె అని లేబర్‌ కమిషనర్‌ ప్రకటించారు. ఒకసారి ప్రకటించాక.. కార్మికుడు, యాజమాన్యానికి సంబంధాలు కట్‌. ఆ తర్వాత సంస్థ ఏ నిర్ణయమైనా తీసుకుని ముందుకుపోవచ్చు’’అని సీఎం స్పష్టం చేశారు.

జీహెచ్‌ఎంసీ 14 రూపాయలు కూడా ఇవ్వదు
హైదరాబాద్‌లో నష్టం ఎక్కువగా వస్తుందని.. భరించాలని జీహెచ్‌ఎంసీని కోరామని, దీంతో జీహెచ్‌ఎంసీ మొదటి ఏడాది రూ.310 కోట్లు ఇచ్చిందని సీఎం చెప్పారు. మళ్లీ రెండో ఏడాది రూ.480 కోట్లు అడిగారని, వారు అంత ఇవ్వలేమని ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. ‘ఇక వారు రూ.1400 కోట్లు కాదుకదా.. రూ.14 కూడా ఇవ్వరు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్లలో 711 కోట్లు విడుదల చేస్తే.. తాము ఏడాదికి రూ.900 కోట్ల చొప్పున 4250 కోట్లు ఇచ్చామని, ఇది ఆడిట్‌ కూడా అయిందని అన్నారు.

అవకాశాన్ని సద్వినియోం చేసుకోండి
‘‘ఫైనల్‌గా కార్మికులకు ఒక అప్పీల్‌ చేస్తున్నా. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబాలను బజారున వేయద్దు. నవంబరు 5వతేదీ అర్ధరాత్రి వరకు విధుల్లో చేరకపోతే మిగతా 5వేల రూట్లు కూడా ప్రైవేటుకే ఇస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ 50-50 లెవల్‌ ప్లే విధానాన్ని తెచ్చాం. కేంద్ర చట్టం ప్రకారమే పర్మిట్లు ఇచ్చాం. ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోం’’ అన్నారు.

కార్మికుల కడుపు నింపాం..
‘‘4760 మంది ఔట్‌సోర్సింగు ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించాం. కార్మికుల కడుపు నింపాము తప్ప… కడుపులు కొట్టలేదు. అందరూ గౌరవప్రదంగా బతకాలనే ప్రయత్నం చేశాం. తప్ప, ఎక్కడా ఇబ్బంది కలిగించలేదు’’ అని వివరించారు. ‘‘కార్మికులు తమ కుటుంబాలను రోడ్డున వేసుకోవద్దు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది జరగదు. ఒకవేళ జరిగితే అది అంతటితో ఆగదు. చిన్నవి పెద్దవి కలిపి.. 91 కార్పొరేషన్లు ఉన్నాయి. వాళ్లందరినీ విలీనం చేయాలంటారు. కోర్టులకెళితే.. ‘ఆర్టీసీని ఎందుకు చేశారు?. వీళ్లనెందుకు చేయరు? అని ప్రశ్నిస్తాయి. అందుకే అది జరిగే పనికాదు. విలీనాన్ని కేబినెట్‌ తోసి పుచ్చింది. ఆ నిర్ణయాన్ని ముఖ్యమంత్రిగా నేను కూడా మార్చలేను. పర్మిట్ల విషయంలో ఎలాంటి మార్పు లేదు. కార్మికులు విధుల్లో చేరితే ఆ రూట్లు ఉంటాయి. చేరకపోతే మీపైనే భారం ఉంటుంది’’ అని అన్నారు.

కార్మికులవి పనికిమాలిన డిమాండ్లు!
‘‘కార్మికుల నోట్లో మట్టి పడే పరిస్థితి, వాళ్లంతా రోడ్డున పడి ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షాల మాటలు, పిచ్చి ఆలోచనలతో ఇంకో తొమ్మిది రోజులో, ఆరు రోజులో కార్యాచరణ ప్రకటించారు. అది కూడా అర్థరహితమైంది. పనికివచ్చేది కాదు. కార్మికుల శ్రేయస్సు, సంస్థ మనుగడను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న పనికాదు. అసలే కుదేలై ఉన్న సంస్థ. పండగ సందర్భంలో రావాల్సిన అదనపు లాభాన్ని కోల్పోయి. దేశంలో ఎక్కడా జరగని పనికిమాలిన డిమాండ్లు పెట్టుకున్నారు.’’అని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీతో మాకేం సంబంధం?
ఏపీలో ఆర్టీసీ విలీనం గురించి విలేకరుల ప్రశ్నకు సీఎం కేసీఆర్‌ బదులిస్తూ, ‘ఆయన (ఏపీ సీఎం జగన్‌) అన్నడో, లేదో నాకు తెలియదు. ఏపీతో మాకేం సంబంధం? రైతు భరోసాకు ఏపీ ప్రభుత్వం రూ.12,500 ఇస్తున్నది. కానీ ఇక్కడ రైతుబంధుకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నాం. రైతు బీమా ఇస్తున్నాం. ట్రాఫిక్‌ పోలీసులకు అలవెన్స్‌ ఇస్తున్నాం. ఏపీలో లేదు కదా!’ అని అన్నారు.

Courtesy Andhra Jyothy..

Leave a Reply