విశాఖ ల్యాండ్‌ పూ(ఫూ)లింగ్‌!

0
307
విశాఖ ల్యాండ్‌ పూ(ఫూ)లింగ్‌!

 కె.లోకనాథం

విశాఖ జిల్లాలో ఆనందపురం, భీమిలి, పద్మనాభం, సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పెదగంట్యాడ, విశాఖ రూరల్‌, పరవాడ, అనకాపల్లి మండలాల పరిధి లోని 55 గ్రామాల్లో పేదలు సాగు చేసుకుంటున్న 6,116 ఎకరాల భూమిని గుంజుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జిఒ 72, నోటిఫికేషన్‌ జారీ చేసింది. పేదలకు ఇళ్ల స్థలాల కోసం పేదల భూమిని సమీకరిస్తామంటోంది. జనవరి 29 నుండి ఫిబ్రవరి 8 వరకు అధికార యంత్రాంగం గ్రామ సభలు నిర్వహిస్తోంది. ఈ గ్రామ సభల్లో డి ఫారం భూముల సాగుదార్లకు ఎలాంటి హక్కులుండవని, ఆ భూములు ఎప్పుడైనా ప్రభుత్వం తీసుకోవచ్చని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. ప్రజావసరాల కోసం ప్రభుత్వం భూములు తీసుకోదలిస్తే పేదలు సాగు చేసుకుంటున్న డి పట్టా భూములకు జిరాయితీ భూములతో సమానంగా పరిహారం చెల్లించాలని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విస్తృత ధర్మాసనం 2004లోనే స్పష్టమైన తీర్పునిచ్చింది. (మేకల పాండు కేసులో ఎస్సైన్డ్‌ భూములపై హైకోర్టు 2004 మార్చి 9వ తేదీన రిట్‌ అప్పీల్‌ డబ్ల్యు 190/2002 కేసులో ఏడుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు) అన్ని విధాలా వారు సమాన హక్కులు కలిగి వుంటారని పేర్కొంది. అయినా ప్రభుత్వాధికారులు గ్రామాల్లోకి వచ్చి పేదలను బెదిరిస్తున్నారు. ఇప్పడు రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద 10 రోజుల్లో 6,116 ఎకరాల భూమి ల్యాండ్‌ పూలింగ్‌కు పూనుకుంటోంది. స్వచ్ఛందంగా భూములు ఇవ్వకపోతే బలవంతంగానైనా తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

విశాఖపట్నం మెట్రో పాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వి.ఎం.ఆర్‌.డి.ఎ)కి భూములు ఇస్తే అభివృద్ధి చేస్తామని అధికారులు మాట్లాడుతున్నారు. రైతుకు అభివృద్ధి అంటే వ్యవసాయంపై పెడుతున్న పెట్టుబడి ప్రోత్సాహం, పండించిన పంటకు గిట్టుబాటు ధర, మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తే అభివృద్ధి చెందుతారు. కాని తమ జీవనాధారమైన భూములను కొల్లగొట్టి ప్లాట్‌లుగా అభివృద్ధి చేసి వ్యాపారం చేస్తే ఏ రైతు అయినా అభివృద్ధి చెందుతాడా? ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న ల్యాండ్‌ పూలింగ్‌ రైతులకు, కూలీలకు జీవన్మరణ సమస్యగా తయారైంది. కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు పేదలు సాగు చేసుకున్న భూములను బలవంతంగా తీసుకొని వి.ఎం.ఆర్‌.డి.ఎకి అప్పగించడం అన్యాయం. ఇప్పటికే వి.ఎం.ఆర్‌.డి.ఎను రియల్‌ఎస్టేట్‌ సంస్థగా మార్చేశారు. ఈ భూములతో వ్యాపారం మరింత విస్తరిస్తుందన్నమాట!

పేదల సాగులోని భూములు తీసుకొని, తిరిగి పేదలకే ఇళ్ల స్థలాలు ఇస్తామనే కొత్త సిద్ధాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. తరాతరాలుగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు ఈ భూములను సాగు చేకుంటున్నారు. వరి, చోళ్లు (రాగులు), గంటెలు (సజ్జలు)పండించుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతాల నుండి విశాఖ నగరంలోని రైతు బజార్లకు, మార్కెట్లకు కూరగాయలు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు ఆ భూములను బలవంతంగా తీసుకోవాలని ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోంది. ‘డి-ఫారం’ భూములు, ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న పేదలను బెదిరించి ల్యాండ్‌ పూలింగ్‌కు ఇవ్వాల్సిందేనని బెదిరిస్తున్నారు. దీంతో పేదలు తీవ్ర ఒత్తిడికి లోనౌతున్నారు. సాగు చేసుకుంటున్న భూములకు హక్కుదారుడిగా గుర్తించి పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని లేదా కనీసం డి పట్టాలైనా మంజూరు చేయాలని అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ‘అర్బన్‌ ఎగ్లామిరేషన్‌’ పేరుతో 25 ఏళ్ల నుంచి పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వమే తాత్సారం చేసింది. నేడు ఆ పేద సాగుదార్లను భూ ఆక్రమణదారులుగా చిత్రీకరించి అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తోంది.

తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో చేపట్టిన ల్యాండ్‌ పూలింగ్‌ను వ్యతిరేకించిన వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక విశాఖలో ఏకపక్షంగా ల్యాండ్‌ పూలింగ్‌కు పాల్పడుతున్నారు. పేదల జీవనాధారమైన భూముల నుంచి వారిని తరిమేయడానికి సిద్ధపడుతున్నారు. తెలుగుదేశం బాటలోనే ముఖ్యమంత్రి జగన్‌ కూడా పయనిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చిన తరువాత వేరొక మాట మాట్లాడడం అధినేతలకు తగదు.

రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణకు సంబంధించిన పాత జి.ఓలను రద్దు చేసి 21-11-2019న జి.ఓ.నెం.294ను జారీ చేసింది. దీని ఆధారంగానే ల్యాండ్‌ పూలింగ్‌ చేయాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. జి.ఓ.నెం.72 కూడా జి.ఓ.నెం.294 అనుగుణంగానే ల్యాండ్‌ పూలింగ్‌ చేయాలని ఉత్తర్వుల్లో ఇచ్చింది. అందులో 10వ పాయింట్‌లో ఈ క్రింది భూములు తీసుకోవద్దని స్పష్టంగా పేర్కొన్నది.
– డి- ఫారం పట్టాలు చేతులు మార్పిడి. రెండు పార్టీల మధ్య వివాదంగా ఉన్నవి (పి.ఒ.టి చట్టం 1977).
– ప్రభుత్వ భూముల్లో పేదలు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నవి.
– కోర్టులో వున్న వివాదస్పదమైన భూములు
– దేవాదాయ, ధర్మదాయ భూములు
– కాలువ, చెరువులు ఉన్న భూములు తీసుకోవద్దని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ విశాఖలో ఇలాంటి భూముల మీదే కేంద్రీకరించి ప్రభుత్వ యాంత్రాంగం ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తోంది. చట్టాన్ని, జిఒలను కూడా అతిక్రమించి భూ సమీకరణ చేయాలని చూస్తోంది.

ప్రధానంగా విశాఖ నగర వాసులకు ఇళ్లు అని భ్రమలు పెడుతున్నారు. విశాఖ నగరంలో 1 లక్షా 50 వేల మంది ఇళ్ళు లేని పేదలకు నవరత్నాల పేరుతో స్థలాలు సేకరిస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ నగరం నుండి పద్మనాభం మండలం రెడ్డిపల్లి 50 కి||మీలు. విశాఖ నుండి అనకాపల్లి చివర ప్రాంతాలకు వెళ్ళాలంటే లబ్ధిదారులు 65 కి||మీల దూరం వెళ్లాల్సి వస్తోంది. ఇది ఆచరణకు సాధ్యమైన పనేనా? ఇది ప్రజలను వంచించడం కాదా? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తప్ప మరొకటి కాదు.
విశాఖ జిల్లాలో వేలాది ఎకరాల భూములు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు ఆక్రమించుకున్నారని, గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సిట్‌, నేడు వై.ఎస్‌.ఆర్‌ పార్టీ అధికారంలోకి రాగానే మరో సిట్‌ వేశారు. ఇటీవల కాలంలో అధికారులు మధ్యంతర నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. రెండు సిట్‌ల నివేదికలను ఇంతవరకు ఎందుకు బహిర్గతం చేయలేదు? కబ్జాదారులను రక్షించడానికే ఈ నివేదికలను బహిర్గతం చేయడం లేదని ప్రజానీకం భావిస్తున్నారు. పేదలందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న లక్ష్యం వుంటే ధనవంతులు కబ్జా చేసిన భూములు వెనక్కి తీసుకొని ఇవ్వాలి. అలా ఎందుకు ఇవ్వలేకపోతోంది? గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం తన అనుచరులను కాపాడుకుంటే నేడు వై.ఎస్‌.ఆర్‌ ప్రభుత్వం కూడా తన అనుయాయులను కాపాడుకునే పనిలో వుంది తప్ప ప్రభుత్వ భూములను కాపాడే పనిలో లేదు. పెద్దల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకొని వుంటే పేదల సాగులోని భూములు తీసుకొనే అవసరమే లేదు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే సంక్పలం ప్రభుత్వానికి వుంటే జిరాయితీ భూములను కొనుగోలు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు కావల్సివస్తే 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి భూసేకరణ చేయాలి. అలా కాకుండా ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భూములు బలవంతంగా తీసుకోవడం చట్ట విరుద్ధం. అలాగే రైతుల నష్టపరిహారం గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆ భూమిపై ఆధారపడి ఆయా గ్రామాల్లో బతుకుతున్న వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులు, చిరు వ్యాపారుల కోసం కనీస ప్రస్తావన లేదు.

ప్రభుత్వం బక్కచిక్కిన రైతు దగ్గర ఒక ఎకరా భూమి తీసుకుంటే అందులో 18.5 సెంట్ల భూమి రైతు వాటా గాను, 15 సెంట్లు వి.ఎం.ఆర్‌.డి.ఎ వాటా గాను, 40 సెంట్లు భూమిలో రోడ్లు, డ్రైనేజీలు, మిగిలిన 26.5 సెంట్లు భూమి పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయిస్తామని నమ్మబలుకుతున్నారు. రైతులకు జీవనాధరమైన భూములు తీసుకొని ప్రభుత్వం ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా రైతులు సాగు చేసుకుంటున్న భూములు ఇతరులకు పంపిణీ చేయటానికి అధికారం ఎవరిచ్చారు? దళితులు, పేదల ప్రభుత్వమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారి భూములనే ఎందుకు తీసుకుంటోంది? దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి పక్షాన ఉన్నదో అర్థమౌతుంది. ల్యాండ్‌ పూలింగ్‌పై గ్రామ సభల్లో అనేక చోట్ల ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. అలా చేయకపోతే వారి బతుకులు బజారున పడతాయి. ప్రభుత్వ జులుంను అడ్డుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి ల్యాండ్‌ పూలింగ్‌లు మరింత పెరిగే ప్రమాదం వుంది. తస్మాత్‌ జాగ్రత్త!

(వ్యాసకర్త సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి )

Courtesy Prajashakti

Leave a Reply