సర్కారు వాహనాలకు మహిళా సారథులు

0
51

కేరళ లెఫ్ట్‌ సర్కార్‌ నిర్ణయం 

తిరువనంతపురం : కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు పురుషులు మాత్రమే ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలకు డ్రైవర్లుగా ఉన్నారు. తాజాగా మహిళలను కూడా ఆ విధుల్లో నియమించాలని పినరయి సర్కార్‌ నిర్ణయించింది. ఇక ప్రభుత్వ వాహనాలకు సారధులుగా మహిళలు నూతన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ‘అన్ని ప్రభుత్వశాఖలు, ప్రభుత్వరంగ సంస్థలకూ ఆదేశాలు జారీచేశాం. లింగసమానత్వంపై రాష్ట్ర ప్రభుత్వ విధానానిక నుగుణంగా ఈ పోస్టుల్లో మహిళలనూ నియమించాలని నిర్ణయించాం.

ఇది చాలామంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నాం. ఇందుకు సంబంధించి నియామక నిబంధనలను సవరించనున్నాం’ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కేరళలోని రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్‌ను మినహా… మరే ఇతర విభాగంల్లోనూ ఇప్పటివరకూ డ్రైవర్‌ పోస్టులకు మహిళలను అనుమతించరు. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని ఐద్వా, మహిళా కాంగ్రెస్‌ సహా ఇతర మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో పినరయి సర్కార్‌ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయం పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. మరికొద్దిరోజుల్లో కేరళ సర్కారు వాహనాల సారథులుగా మహిళలు కనిపించనున్నారు.

 

(Courtacy Nava Telangana)

Leave a Reply