ఇది ఎవరి ప్రభుత్వం?

0
261
ఎ. కృష్ణారావు

కొవిడ్-19కు గురై మరణించిన వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించడం కష్టమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న ఆర్థిక వనరులు సరిపోవని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో పేర్కొంది. ఇప్పటికే పన్ను ఆదాయాలు తగ్గిపోయిన రీత్యా నష్టపరిహారం చెల్లిస్తే ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతుందని, ఇతర ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలకు వ్యయం తగ్గిపోతుందని కేంద్రం స్పష్టంగా తెలిపింది. కొవిడ్ మరణాలను వరదలు, తుఫాన్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురై మరణించడంతో పోల్చలేమని చెప్పింది. అవును. కరోనా మహమ్మారికి గురై రోజుకు వందలమంది మరణించడం, ఒకే రోజు దాదాపు అయిదు వేల మంది కూడా మరణించడం, మరణమే తప్ప మరో వార్త కనపడకపోవడం వైపరీత్యం కానే కాదు కాబోలు! ఒకటా, రెండా, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3.90 లక్షల మంది మరణించారు. కుటుంబాలకు కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయాయి. శ్మశానాలలో కూడా రోజుల తరబడి శవదహనాలకు స్థలం లభించలేదు. గంగానదిలో శవాలను పడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందరు అనాథలయ్యారో, ఎందరి ఇళ్లు ఖాళీ అయ్యాయో తెలియదు. అయినా ఇది వైపరీత్యాల చట్టం పరిధిలోకి రాదు కనుక నష్టపరిహారం చెల్లించడం కేంద్ర ప్రభుత్వానికి తలకు మించిన భారమే అవుతుంది.

ఆర్థిక వ్యవస్థ ఈ నష్టపరిహారం బాధను భరించగల స్థితిలో లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. నిజమే. 2025 నాటికి 5లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను సాధించగలమని రెండేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం ఎంతో విశ్వాసంతో పార్లమెంట్‌లో ప్రకటించింది. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో అందులో సగం కూడా సాధిస్తామో లేదో అన్న సందేహాలు ఏర్పడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అంతర్జాతీయ చమురు ధరలు నింగిని తాకుతున్నాయి. నిరుద్యోగం గత 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. గత ఏడాది నిరుద్యోగ రేటు 9.84 శాతం ఉండగా అది 24.08 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) సంస్థ అంచనా వేసింది. మోదీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసిన మేక్ ఇన్ ఇండియా ప్రకారం భారతదేశం ఒక అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా మారి ఉండాలి. కాని ఎగుమతులు స్తంభించిపోగా, ఉత్పాదక రంగంలో కూడా స్తబ్దత ఏర్పడిందని సెంటర్ ఫర్ ఎకనమిక్ డేటా వంటి సంస్థలు చెబుతున్నాయి. కార్పొరేట్ పన్నుతో సహా పన్ను ఆదాయాలు, రిటర్నులు పడిపోయాయని, మొత్తం మీద దేశంలో ఆదాయాలు పడిపోయాయని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పైనాన్స్ అండ్ పాలసీ(ఎన్ఐపిఎఫ్‌పి) నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. 2020-–21లో వివిధ రాష్ట్రాల స్వంత పన్ను ఆదాయం పడిపోవడం మాత్రమే కాదు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా కూడా పడిపోయింది, అందుకు కారణం కేంద్ర పన్నుల సేకరణ తగ్గిపోవడం. ఒక్క వ్యవసాయం తప్ప సరుకులు, ప్రయాణికుల రవాణాతో పాటు అన్ని కార్యకలాపాలు దెబ్బతినడంతో జీడీపీ అభివృద్ధి రేటు కూడా పడిపోయింది. జీడీపీ పడిపోయిందంటే ఆదాయాలు పడిపోవడమే. దీని ప్రభావం వ్యయాలపై తదనుగుణంగా ఉండక తప్పదు. 97 శాతం భారతీయ కుటుంబాల వాస్తవ ఆదాయం పడిపోయిందని సిఎంఇఐ తెలిపింది. 2021–-22 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటు 18.5 లక్షల కోట్లు. రాష్ట్రాల అదనపు లోటుతో కలిసి ఇది 25.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని, అది జీడీపీలో 13.5 శాతంగా ఉంటుందని ఎన్ఐపిఎఫ్‌పి అంచనా. మొత్తం అప్పులే 2020-–21 జీడీపీలో 90 శాతం ఉంటాయని, కరోనా మహమ్మారి ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్‌బిఎం) చట్టాన్ని అర్థరహితంగా మార్చిందని అది స్పష్టం చేసింది. దేశంలో అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు అనేక రేటింగ్ ఏజెన్సీలు కూడా దేశ ఆర్థిక వ్యవస్థ విషయంలో తమ అభివృద్ధి రేటు అంచనాలను తగ్గించాయి. తలసరి అదాయంలో బంగ్లాదేశ్ కూడా భారత్‌ను అధిగమించింది. ఆరోగ్య, ఆర్థిక అత్యవసర పరిస్థితుల మూలంగా ప్రజలు ఇతరత్రా వినియోగ సరుకులపై ఖర్చుపెట్టే పరిస్థితుల్లో లేరు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోవడంతో మార్కెట్‌లో ఇతరవస్తువుల డిమాండ్ పడిపోయింది. అంతటా ఆర్థిక అస్థిరత్వం తాండవిస్తోంది. మరో వైపు బ్యాంకు రుణాల ఎగవేతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, భవిష్యత్‌లో ఇది మరింత పెరిగిపోవచ్చునని బ్యాంకర్ల డేటాను బట్టి తెలుస్తున్నది. భారతదేశంలో ఇప్పుడు అత్యంత వేగంగా జరుగుతున్న పని ఏమైనా ఉన్నదంటే బ్యాంకులు భారీ ఎత్తున రుణాలను రద్దు చేయడం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి అంతానికి 15 శాతం అధికంగా బ్యాంకులు రుణాలను రద్దు చేశాయి. తమ నిరర్థక ఆస్తులను తగ్గించి చూపడమే వాటి ఉద్దేశం కాని ఆ రుణాలను తిరిగి వసూలు చేయగల శక్తి బ్యాంకులకు లేకుండా పోయింది. ప్రదానంగా బడా ఎగవేతదారుల నుంచి ఏ మాత్రం రుణాలను వసూలు చేయగల ధైర్యం వాటికి లేదు. ఎగవేతదారులతో లాలూచీ కూడా ఇందుకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి బ్యాలెన్స్ షీట్ (ఆస్తి అప్పుల పట్టిక)లో రద్దయిన రుణాలకు స్థానం లేకుండా పోయిన తర్వాత వాటి గురించి ఎవరూ పట్టించుకోరు. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే గత ఎనిమిదేళ్లలో రూ.123లక్షల కోట్ల మొండి రుణాలను రద్దు చేయగా, కేవలం రూ.8,969 కోట్లను మాత్రమే వసూలు చేయగలిగింది.

మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రతి ఏటా దాదాపు రూ.2లక్షల కోట్లకు పైగా రుణాలను రద్దు చేస్తున్నా మొండిబాకీలు పెరిగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం ఈ మొండిబాకీలు 2021 సెప్టెంబర్ నాటికి 7.5 శాతం నుంచి 15 శాతం పెరిగిపోవచ్చని తేలుతోంది. 2020 డిసెంబర్ నాటికి గత పదేళ్లలో రూ.8,83,168 కోట్ల మేరకు బ్యాంకులు రుణాలను రద్దు చేశాయి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ రుణాల రద్దు విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా బ్యాంకు రుణాలు రద్దయిన కంపెనీల జాబితాలో విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీ కంపెనీ గీతాంజలి జెమ్స్ ప్రథమ స్థానంలో ఉన్నది. ఆ సంస్థకు చెందిన రూ.5492 కోట్ల రుణాన్ని రద్దు చేశారు. చోక్సీకి చెందిన ఇతర సంస్థలు గిలి ఇండియా, నక్షత్ర బాండ్స్ రుణాలను కూడా రూ.2500 కోట్ల మేరకు రద్దు చేశారు. రుణాలు ఎగవేసిన వారిలో తొమ్మిదవ స్థానంలో ఉన్న విజయ్ మాల్యాకు చెందిన రూ.1943 కోట్లను రద్దు చేశారు. దేశంలో అగ్రస్థానంలో ఉన్న పదిమంది ఎగవేతదారులు ప్రభుత్వ బ్యాంకులకు రూ.17,005 కోట్లను చెల్లించాల్సి ఉంది. విజయ్ మాల్యా అయితే బ్యాంకులకు ఎగవేసి పారిపోయారు కాని మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విదేశాలలో కూడా భారత్ బ్యాంకుల నుంచి డబ్బులు పిండుకున్నారు.

మరో విచిత్రమైన విషయం ఏమంటే ఖాయిలా, దివాళా కోడ్ వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా సెటిల్‌మెంట్లు చేసి బ్యాంకులను వేల కోట్ల మేరకు ముంచుతున్నారు. ఈ సెటిల్‌మెంట్లు అస్మదీయులకు ఒకరకంగా, ఇతరులకు మరో రకంగా ఉంటున్నాయి. ఉదాహరణకు శివా ఇండస్ట్రీస్ అనే సంస్థ వివిధ బ్యాంకులకు రూ.4863 కోట్ల మేరకు బాకీ ఉన్నది. ఈ కంపెనీ దివాలా ప్రకటించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు వెళ్లి, బాకీల సమస్యను ఇరువర్గాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంది. తాను చెల్లించాల్సిన రూ.4863 కోట్లకు బదులు కేవలం రూ.323 కోట్లు చెల్లిస్తామని, వెంటనే రూ.5 కోట్లు చెల్లించి మిగతా మొత్తాన్ని ఆరునెలల్లో కడతామని చెప్పింది. వచ్చిందే మహా ఎక్కువ అనుకున్న రుణదాతల (బ్యాంకుల) కమిటీ అందుకు సంతోషంగా ఒప్పుకుంది. అంటే తామిచ్చిన మొత్తంలో 94 శాతం కోల్పోవడానికి సిద్ధపడిందన్నమాట. ఎంతటి మహత్తర అవకాశం! కాని అన్ని సంస్థలకూ ఇలాంటి గొప్ప అవకాశాలు లభించవు. వీడియోకాన్ గ్రూప్ తాము చెల్లించాల్సిన రూ.62 వేల కోట్లకు బదులు రూ.40 కోట్లు చెల్లిస్తామని, ఏడాదికి రూ. 2వేల కోట్ల చొప్పున కట్టగలమని పేర్కొంది. అందుకు రుణదాతల కమిటీ అంగీకరించలేదు. పైగా ఆ కంపెనీని వేదాంత గ్రూప్‌కు చెందిన మరో కంపెనీకి రూ.3వేల కోట్లకు విక్రయించుకుంది. మిగతా రూ.59 వేల కోట్లు మునిగిపోవడానికి బ్యాంకులు తమంతట తాము సిద్ధపడడం వెనుక ఏ రహస్య హస్తం పనిచేసింది? దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ సంస్థ రూ.లక్ష కోట్లు చెల్లించాల్సి ఉంటే, దాన్ని ప్రసిద్ధి చెందిన పిరమల్ గ్రూప్ రూ. 37.5వేల కోట్లకు కొనుగోలు చేసేందుకు బ్యాంకర్లు వీలు కల్పించారు. ఇదే విధంగా రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ రుచి సోయా అనే సంస్థను కొనుగోలు చేసేందుకు బ్యాంకులు రూ. 3200 కోట్లు రుణాలు ఇచ్చాయి. ఆ తర్వాత ఆ రుచి సోయా చెల్లించాల్సిన రూ.2212 కోట్లను బ్యాంకులు రద్దు చేశాయి.

దేశంలో లక్షల కోట్ల మేరకు బ్యాంకులు నష్టపోతుంటే, బ్యాంకులను ముంచే విధంగా ఎన్‌సిఎల్‌టి, దివాళా కోడ్‌ల పేరిట లావాదేవీలు జరుగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తోంది? ఆలోచించాల్సిన విషయమిది. ఇదంతా ప్రజాధనం అని పాలకులకు తెలియదా? నేను తినను, తిననివ్వను, చౌకీదారును అన్న నినాదాలు ఇస్తే సరిపోతుందా? కరోనా వాతపడిన కుటుంబాలు రోడ్డున పడితే నష్టపరిహారం ఇవ్వలేమని, రైతుల రుణాలపై వడ్డీని రద్దు చేయలేమని సుప్రీంకోర్టుకు చెప్పడానికి మాత్రం ఆర్థిక సమస్యలు అడ్డు వస్తాయా? ఇంతకీ ఇది ఎవరి ప్రభుత్వం?

Courtesy Andhrajyothi

Leave a Reply