రోగులకు నరకం!

0
181
  • జోనల్‌ పేరిట జిల్లాలకు నర్సుల కేటాయింపు..
  • ప్రధాన ఆస్పత్రుల నుంచి వెళ్లింది వందల్లో..
  • తిరిగి చేరింది పదుల సంఖ్యలోనే
  • నర్సులపై పెరిగిన పనిభారం
  • బోధన అనుబంధ ఆస్పత్రుల్లో మరీ దారుణం
  • వైద్య సేవలపై తీవ్ర ప్రభావం

హైదరాబాద్‌ : సర్కారీ ఆస్పత్రుల్లో రోగులకు నరకం కనిపిస్తోంది. నర్సుల కొరత కారణంగా ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో ఆపరేషన్‌ థియేటర్లనే మూసేస్తున్నారు. జోనల్‌ వ్యవస్థ కారణంగా సర్కారీ దవాఖానాల్లో నర్సుల కొరత ఏర్పడింది. 317 జీవో వల్ల ప్రధాన ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న నర్సులంతా జిల్లాలకు వెళ్లిపోయారు. జిల్లాలకు మంజూరు చేసిన కొత్త మెడికల్‌ కాలేజీల కోసం ప్రధాన ఆస్పత్రుల్లోని వందలాది స్టాఫ్‌నర్స్‌లను అక్కడికి పంపారు. ఈవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆస్పత్రుల నుంచి నర్సుల పోకడే జరిగింది తప్ప.. అదే స్థాయిలో రాకడ జరగలేదు. దీంతో వీటిలో పనిచేస్తున్న కొద్దిపాటి వైద్య సిబ్బందిపై పని భారం పెరిగింది. సర్కారు ఏకపక్ష నిర్ణయం రోగులకు శాపంగా మారింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఆస్పత్రుల్లో వైద్యులు సర్జరీలు చేసినా… సేవలందించే నర్సులు కరువయ్యారు. ఉన్నవారేమో పదుల సంఖ్యలో రోగుల్ని చూసుకోవాల్సి వస్తోంది.

దీంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. కరోనా మూడోవేవ్‌ నేపథ్యంలో ఆస్పత్రుల్లో చేరికలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రధాన ఆస్పత్రుల్లో నర్సుల సంఖ్యను పెంచాలి. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. పనిభారం పెరిగి, కనీసం సెలవులు తీసుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో పలువురు నర్సులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. మరోవైపు ఉన్న వైద్య సిబ్బందిలో 50 శాతానికిపైగా కరోనా బారినపడ్డారు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చాలామంది సీనియర్‌ నర్సులు.. వారి సీనియారిటీ మేరకు ప్రధాన ఆస్పత్రుల్లోనే ఉండిపోయారు. వారిని జిల్లాలకు కేటాయించలేదు. సీనియర్‌ నర్సులకు తరుచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతుండటంతో వైద్య సేవలు నెమ్మదిస్తున్నాయి. బోధన అనుబంధ ఆస్పత్రుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

అమలుకు నోచుకోని ఐఎన్‌సీ నిబంధనలు
ఆస్పత్రుల్లో నర్సుల సంఖ్య ఎంత ఉండాలనే దానిపై ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ (ఐఎన్‌సీ) నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. వాటి ప్రకారం.. ‘ఐసీయూ’ విభాగంలో ఒక రోగికి ఒక నర్స్‌ను కేటాయించాలి. ‘మీడియం కేర్‌’లో (ఆపరేషన్‌ గది, జనరల్‌) మాత్రం ముగ్గురు రోగులకు ఒక నర్సు ఉండాలి. పూర్తిగా మెడికల్‌, సర్జికల్‌ జనరల్‌ వార్డుకు మాత్రం ప్రతి ఐదుగురు రోగులకు ఒక నర్స్‌ ఉండాలి. కానీ మనదగ్గర ఈ నిష్పత్తిలో నర్సులను కేటాయించడం లేదు. ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ (ఐపీహెచ్‌ఎస్‌) ప్రకారం.. ప్రతి 100 పడకలకు 45 మంది నర్సులు ఉండాలి. ఇందులో 30 శాతం మంది రిజర్వ్‌లో ఉండాలని ఐపీహెచ్‌ఎస్‌ నిర్దేశిస్తోంది. ఈ నిబంధనలను సర్కారు పాటించడం లేదు. తాజా జోనల్‌ విధానం వల్ల.. ప్రధాన ఆస్పత్రుల్లో ఒక్కో నర్సు సగటున 30 నుంచి 35 మంది రోగులను పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. రోజురోజుకు ఐపీ, ఓపీ కేసులు కూడా పెరుగుతున్నాయి. అయితే అందుకు తగ్గట్లుగా నర్సుల సంఖ్య ఉండటం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 27వేల పడకలున్నాయి. తెలంగాణ విభజన తర్వాత మంజూరు చేసిన నర్సుల పోస్టులు 9270. ఇందులో ప్రస్తుతం పనిచేస్తున్నది 6వేల మందేనని నర్సింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ప్రస్తుతం 3 వేల మంది నర్సుల కొరత ఉంది.

హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో..
హైదరాబాద్‌లోని ప్రధాన ఆస్పత్రుల నుంచి ఎక్కువ మంది నర్సులను జిల్లాలకు కేటాయించారు. వారి స్థానాల్లో కొత్తవారు అతి స్వల్పంగా వచ్చి చేరారు. కొత్తగా నియామకాలు చేపడితే తప్ప ఆ స్థానాలు భర్తీ కావు. హైదరాబాద్‌లో ఎక్కువగా ప్రసవాలు జరిగే పేట్ల బురుజు ఆస్పత్రిలో 500 పడకలున్నాయి. అక్కడ దాదాపు 700 మంది ఇన్‌పేషెంట్లుగా ఉంటారు. ప్రతిరోజు ఓపీకి మరో 2 వేల మంది వస్తుంటారు. కానీ ఇక్కడ మూడు షిప్టులు కలిపి ప్రస్తుతం 50 మంది నర్సులే విధులు నిర్వహిస్తున్నారు. గతంలో 138 మంది నర్సులు ఉండేవారు. 317 జీవో పోస్టింగ్‌లలో 73 మంది రిలీవ్‌ అయ్యారు. కానీ ఒక కొత్త ఉద్యోగే ఇక్కడికి వచ్చి చేరారు.

ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌లలో..
ఉస్మానియా ఆస్పత్రిలో 1400 పడకలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇటీవల 140 మంది నర్సులు రిలీవ్‌ అయ్యారు. కానీ ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే ఆ స్థానాల్లో భర్తీ అయ్యారు. గాంధీ ఆస్పత్రి నుంచి 146 మంది జిల్లాలకు వెళ్లారు. ఇప్పటి వరకు కేవలం ఒక్కరే ఇక్కడికి వచ్చారు. నీలోఫర్‌ ఆస్పత్రిలో 1200 పడకలు ఉన్నాయి. 130 మంది నర్సులను జిల్లాలకు కేటాయించడంతో ఇటీవల వారు వెళ్లిపోయారు. కానీ ఇక్కడికి వచ్చింది మాత్రం ఇద్దరే. ఇక్కడ నాలుగు పీడియాట్రిక్‌ ఆపరేషన్‌ థియేటర్లు ఉండగా.. నర్సుల కొరత కారణంగా ప్రస్తుతం రెండే ఆపరేషన్‌ థియేటర్లు నడుస్తున్నాయి.

వరంగల్‌ ఎంజీఎంలో..
వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో 408 మంది స్టాఫ్‌నర్సులు పనిచేస్తున్నారు. 317 జీవో వచ్చిన తర్వాత 72 మంది వివిధ ప్రాంతాలకు వెళ్లారు. ఆ తర్వాత పది మంది మాత్రమే చేరారు. ఓపీకి వచ్చే వారి సంఖ్య దాదాపు 1200, ఇన్‌ పేషెంట్ల సంఖ్య ఇంచుమించు 750 వరకు ఉంటుంది. ఎంజీఎంలో వేయు పడకలు ఉన్నాయి. ప్రస్తుతం తగిన సంఖ్యలో నర్సుల్లేరు. పనిచేస్తున్న వారిలో 50 శాతం మందికి కొవిడ్‌ సోకింది. దీంతో విధుల్లో ఉన్న నర్సులపై పనిభారం పెరిగింది.

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో..
నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో 250 మంది నర్సులు ఉన్నారు. వారిలో 75 మంది రెగ్యులర్‌ నర్సులున్నారు. కొత్తగా 15 మంది వచ్చారు. వెళ్లిపోయింది ఏడుగురేనని అక్కడి వైద్యవర్గాలు వెల్లడించాయి. మిగిలిన నర్సులంతా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసే వారేనని తెలిపాయి. ప్రస్తుతం ఇక్కడ నర్సింగ్‌ స్టాఫ్‌కు కొరత ఉన్నట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. రిమ్స్‌తో సహా పలు ప్రధాన ఆస్పత్రుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని నర్సులు చెబుతున్నారు.

తాత్కాలిక పద్ధతిలోనైనా నియామకాలు చేపట్టాలి
‘‘జోనల్‌ వ్యవస్థలో భాగంగా ఉద్యోగుల కేటాయింపులు జరిగాయి. ఇందులో భాగంగా ప్రధాన ఆస్పత్రుల నుంచి నర్సులు జిల్లాలకు వెళ్లిపోయారు. వారి స్థానంలో ఇతర ప్రాంతాల నుంచి నర్సులు రాలేదు. దీంతో ఉన్నవారిపై తీవ్రమైన పనిభారం పడుతోంది. అవసరం ఉన్నచోటనే నర్సుల సేవలను వినియోగించుకుంటే బాగుంటుంది. కొవిడ్‌ సమయంలో ఇలా చేయడం సరికాదు. చాలామంది నర్సులు అవస్థలు పడుతున్నారు. నర్సుల కొరత అన్ని ప్రధాన ఆస్పత్రుల్లోనూ ఉంది. కనీసం తాత్కాలిక పద్ధతిలోనైనా నియామకాలు చేపట్టాలి.’’
సుజాత, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, ఉస్మానియా ఆస్పత్రి, హైదరాబాద్‌

Courtesy Andhrajyothi

Leave a Reply