ఆ కంపెనీ పోషణకే?

0
53
  • కేసీఆర్‌ పౌష్టికాహార కిట్ల టెండర్లలో గోల్‌మాల్‌!
  • 1200 కోట్లతో పథకం
  • భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపణ
  • అనుకున్నవారికి కట్టబెట్టేలా నిబంధనలు
  • పౌడర్‌ సరఫరా మార్కెట్లో 15 ఏళ్ల అనుభవం, 35 శాతం వాటా
  • దీంతో ఒక్క కంపెనీకే చాన్స్‌..
  • నాలుగు కంపెనీలకే సప్లయ్‌ ఆథరైజేషన్‌
  • ఫలితంగా మిగతావారు టెండర్లకు దూరం
  • ఆధారాలతో సహా కేంద్రానికి ఓ సామాజిక సంస్థ ఫిర్యాదు
  • రాజకీయ నేతలు, అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారని ఆరోపణ

హైదరాబాద్‌ : కేసీఆర్‌ న్యూట్రియంట్‌ కిట్ల కొనుగోలు టెండర్లలో గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తాము అనుకున్న వారికే ఆ టెండరు దక్కాలనే ముందస్తు ప్రణాళికలో భాగంగా ప్రభుత్వంలోని పెద్దలు నియమనిబంధనలు రూపొందించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో రాజకీయ నేతలు, అఽధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు రూ.1200 కోట్లతోరూపొందించిన ఈ పథకానికి సంబంధించి భారీ కుంభకోణానికి తెరలేపారంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఓ సామాజిక సంస్థ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలను కూడా దర్యాప్తు సంస్థలకు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గర్భిణులు, చిన్నారులు పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వేలో కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు మహిళా ఐఏఎస్‌ ఉన్నతాధికారులను పంపి అధ్యయనం చేయించింది. తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఆ బృందం ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల కోసం న్యూట్రియంట్‌ కిట్‌ ఇవ్వాలని సూచించింది. ఆ మేరకు తొలుత తొమ్మిది జిల్లాల్లో 2.5 లక్షల మంది గర్భిణులకు ఈ కిట్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.

ఆ బాధ్యతలను రాష్ట్రవైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌కు అప్పగించింది. కిట్ల సేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ(టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ)కు కమిషనర్‌ లేఖ రాశారు. కిట్లలో ఏమేం ఉండాలి? టెండరు నిబంధనలు ఏమిటి? అనేవి లేఖలో స్పష్టం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో బాగా పలుకుబడిగల కొందరు రంగంలోకి దిగి, టెండరు నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకున్నారన్న, ఒకే కంపెనీకి అనుకూలంగా నిబంధనలను తయారయ్యేలా చక్రం తిప్పారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్‌ న్యూట్రియంట్‌ కిట్‌కు న్యూట్రియంట్‌ పౌడర్‌ సరఫరా చేసే సంస్థ మార్కెట్లో 15 ఏళ్లుగా ఉండి ఉండాలని, అలాగే మొత్తం మార్కెట్లో 35 శాతం వాటా ఉండాలన్న నిబంధనను టెండర్‌లో ఉంచారు. ప్రతి 100 గ్రాముల న్యూట్రియంట్‌ పౌడర్‌లో ఎంతమేర పౌషక విలువలు ఉండాలనే  విషయంలోనూ ఆ ఒక్క కంపెనీకి అనుకూలంగా టెండరు నిబంధనల్లో మార్పులు చేశారు. ఫలితంగా వారు అనుకున్న ఆ కంపెనీకే  న్యూట్రియంట్‌ పౌడర్‌ను సరఫరా చేసే అవకాశం దక్కుతుందనేది విమర్శకుల మాట. కాగా సదరు టెండరు నిబంధనలను మార్చాలంటూ పలువురు సరఫరాదారులు కొద్ది రోజుల కిందట కమిషనర్‌ శ్వేతా మహాంతిని కలిసి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ పెద్దల ఒత్తిడి కారణంగా ఆ నిబంధన అలాగే ఉండిపోయింది. దాన్ని మార్చలేదు.

ఇక టెండరు నిబంధనల మేరకు అర్హత దేశంలో ఒకే ఒక కంపెనీకి ఉంది. సదరు ఆ ఒకే ఒక కంపెనీ కూడా కేవలం నాలుగు కంపెనీలకే పంపిణీకి సంబంధించి అథరైజేషన్‌ లెటర్‌ ఇచ్చింది. వాస్తవానికి సదరు కంపెనీకి దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు ఉన్నప్పటికీ ఆ నాలుగు కంపెనీలకే అథరైజేషన్‌ ఇవ్వడంపై మిగతా సరఫరాదారులంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా… సదరు అథరైజేషన్‌ ఉన్న సరఫరాదారులు మాత్రమే కేసీఆర్‌ న్యూట్రియంట్స్‌ కిట్స్‌ టెండర్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. మిగతవారు కనీసం పాల్గొనే అవకాశం కూడా లేదు. కాగా ఇలాంటి న్యూట్రియంట్‌ కిట్‌నే సదరు నాలుగు కంపెనీల పంపిణీదారులే తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్నారు. తమిళనాడులో ఆ పంపిణీదారులపై అక్కడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సైతం పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  కాగా ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఓ సామాజిక సంస్థ తన ఫిర్యాదులో కోరింది.

Leave a Reply