జీఎస్‌టీ జోర్దార్‌

0
281
  • రూ.లక్ష కోట్లు దాటిన వసూళ్లు
  • ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలిసారి

దిల్లీ: దేశ ఆదాయ పరిస్థితులు ఆశాజనకంగా మారాయి. కొవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటాయి. వరుసగా రెండోనెల గత ఏడాదికంటే అధిక వసూళ్లు నమోదయ్యాయి. సెప్టెంబరులో 5% ప్లస్‌లో ఉన్న రాష్ట్రాల ఆదాయం ఇప్పుడు 11% ప్లస్‌కు చేరింది. గత ఏడాది ఏప్రిల్‌-అక్టోబరు మాసాల మధ్య రూ.7.01 లక్షల కోట్ల ఆదాయం రాగా, ఈసారి అది రూ.5.59 లక్షల కోట్లకు పరిమితమైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ 7 నెలల్లో 20.22% ఆదాయం తగ్గింది. రెండునెలల క్రితం వరకు 30.18%మేర ఉన్న ఆదాయ వ్యత్యాసం ఇప్పుడు 20.22%కి పడిపోవడం సానుకూలాంశం. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో క్రితంసారి కంటే 7.12% అధిక ఆదాయం ఖజానాకు చేరింది. గత ఏడాది నెలకు సగటున రూ.లక్ష కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటివరకు అది రూ.79వేల కోట్లకు పరిమితమైంది. గత రెండునెలల్లో మాత్రం సగటున రూ.లక్ష కోట్లు వసూలైంది.

దేశంలో క్రమంగా ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయనడానికి ఈ అంకెలు అద్దం పడుతున్నాయి. అక్టోబరులో వచ్చిన రూ.1.05 లక్షల కోట్ల ఆదాయంలో సీజీఎస్‌టీ రూ.19,193 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.25,411 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.52,540 కోట్లు (దిగుమతి చేసుకున్న వస్తువుల ద్వారా రూ.23,375 కోట్ల వసూలు), సెస్‌ రూ.8,011 కోట్లు ఉంది. అక్టోబరు 31వరకు 80 లక్షలమంది జీఎస్‌టీ రిటర్న్స్‌ దాఖలుచేశారు. కేంద్ర ప్రభుత్వం తనకు వచ్చిన ఐజీఎస్‌టీ ఆదాయం సీజీఎస్‌టీ కింద రూ.25,091 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ కింద రూ.19,427 కోట్లు సెటిల్‌ చేసింది. దీంతో అక్టోబరులో సీజీఎస్‌టీ కింద కేంద్రానికి రూ.44,285 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ కింద రాష్ట్రాలకు రూ.44,839 కోట్ల ఆదాయం వచ్చినట్లైంది.

రాష్ట్రాల పరిస్థితీ మెరుగు
రాష్ట్ర ప్రభుత్వాలకూ జీఎస్‌టీ వసూళ్లు పెరిగాయి. సెప్టెంబరు నెలలో రాష్ట్రాలకు క్రితం ఏడాదికంటే 5% అధిక వసూళ్లు రాగా, అక్టోబరు నాటికి ఆ పెరుగుదల 11%కి చేరింది. సెప్టెంబరులో 15 రాష్ట్రాలు మైనస్‌లో ఉండగా, అక్టోబరు నాటికి ఆ సంఖ్య 7కి తగ్గింది. గత ఏడాది సెప్టెంబరుతోపోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్‌కి 8% అధిక ఆదాయం రాగా, అక్టోబరులో అది 26%కి పెరిగింది. సెప్టెంబరులో -2%లో ఉన్న తెలంగాణ ఆదాయం అక్టోబరులో +5%కి చేరింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ కలిపి గత ఏడాది అక్టోబరులో జీఎస్‌టీ కింద రూ.73,159 కోట్ల ఆదాయం రాగా ఈసారి అది రూ.80,848 కోట్లకు చేరింది.

Courtesy Eenadu

Leave a Reply