రగులుతున్న పాతబస్తీ

0
163
  • రాజాసింగ్‌కు బెయిల్‌ రావడంపై ఆగ్రహం
  • నిరసనలు, ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత
  • అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై అల్లరిమూకల రాళ్ల దాడి.. వారిపై లాఠీచార్జి
  • నిరసనలకు అనుమతులు లేవు: డీసీపీ 
  • సింగ్‌కు మహేశ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ సత్కారం
  • పార్టీకి వివరణ ఇచ్చా.. తిరిగి చేర్చుకుంటారని నమ్మకం ఉంది: రాజాసింగ్‌

మంగళ్‌హాట్‌/చార్మినార్‌ : బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యలతో చెలరేగిన నిరసనల హోరు పాత నగరంలో ఇంకా కొనసాగుతోంది! ముఖ్యంగా.. అరెస్టయిన రాజాసింగ్‌ అంతలోనే బెయిల్‌పై బయటకు రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంగళవారం ఉదయం రాజాసింగ్‌ అరెస్టుతో కాస్త శాంతించిన పరిస్థితి.. మంగళవారం రాత్రి నుంచి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువకులు మంగళవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు.  రాజాసింగ్‌కు, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ… నల్ల జెండాలతో ర్యాలీలు నిర్వహించారు.

మూసాబౌలి నుంచి సిటీ కాలేజీ వైపు వెళ్తున్న పలువురిపై కొంతమంది అల్లరిమూకలు దాడులకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 2-3 గంటల ప్రాంతంలో చార్మినార్‌ వద్ద అల్లరిమూకలు పోలీసులపై, మీడియా ప్రతినిధులపై రాళ్లతో దాడులు చేయడంతో.. పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ దాడుల్లో ఓ పోలీసు పెట్రోలింగ్‌ వాహనంతో పాటు ప్రైవేట్‌ వాహనం అద్దాలు దెబ్బతిన్నాయి. పదేపదే తమ మతాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాజాసింగ్‌కు బెయిల్‌ ఇవ్వడాన్ని ముస్లింలు తప్పుబట్టారు.

తమ మనోభావాలను దెబ్బతీసేలా రాజాసింగ్‌ వ్యవహరిస్తున్నా.. పోలీసులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. సౌత్‌జోన్‌ డీసీపీ సాయిచైతన్య అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. వివాదస్పద వ్యాఖ్యలతో మనోభావాలను కించపరిచిన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. డీసీపీ హామీతో నిరసనకారులు వెనుదిరిగినప్పటికీ పోలీసులు మాత్రం అర్థరాత్రి నుంచి అప్రమత్తంగానే ఉన్నారు. అయితే.. బుధవారం ఉదయాన్నే నిరసనకారులు మళ్లీ పాతబస్తీ రోడ్లపైకి వచ్చారు. షాపులు తెరవకుండా నిరసనలు వ్యక్తం చేస్తూ కూడళ్లు, వీధుల్లో నల్లజెండాలు పాతారు. రాజాసింగ్‌ దిష్టిబొమ్మలు దహనం చేస్తూ.. ఆయనకు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉదయం నుంచి మళ్లీ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. శాలిబండ, హిమ్మత్‌పురా ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మళ్లీ అధికారులు వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత పత్తర్‌గట్టి కార్పొరేటర్‌ సోహైల్‌ ఖాద్రీ ఆధ్వర్యంలో శాలిబండ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయనతో పాటు మరో 30మందిని ఆరెస్టు చేసి కంచన్‌ బాగ్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. బుధవారం కూడా పాతబస్తీలోని ప్రధాన మార్కెట్లలో బంద్‌ పాటించారు. నిరసనల నేపథ్యంలో పాతనగరంలోని ప్రతి బస్తీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సౌత్‌జోన్‌ డీసీపీ సాయిచైతన్య తెలిపారు. సున్నిత, అతి సున్నిత ప్రాంతాల్లో పారామిలటరీ, ర్యాపిడ్‌ యాక్షన్‌ బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply