- 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం
- కాంస్యం గెలిచిన పురుషుల జట్టు
ఓ మేజర్ ధ్యాన్‌చంద్..ఓ బల్బీర్ సింగ్…!
ఒక్కరా.. ఇద్దరా.. ఎందరో దిగ్గజాలు!
స్టిక్‌నే మంత్రదండంగా మార్చి
మైదానంలో మాయ చేస్తుంటే అభిమానులు ఉర్రూతలూగేవాళ్లు!
ప్రపంచ హాకీని శాసిస్తూ… అగ్రరాజ్యాలకు ఈర్ష్య కలిగిస్తూ మన ఖాతాలో ఏకంగా ఎనిమిది స్వర్ణాలు..
హాకీ అంటే భారతావనికి ఓ ఆట కాదు
.. అది ఓ ఎమోషన్!
కానీ ఇన్నాళ్లు ఎక్కడుంది! పడిపోయిన ప్రమాణాలతో, దూరమైన విజయాలతో, క్రికెట్ ఆధిపత్యంతో ఎక్కడో జ్ఞాపకాల్లో ఘనీభవించింది. కానీ టోక్యో సాక్షిగా.. భారత హాకీ శిధిలాల నుంచి బయటికొచ్చిన వేళ దశాబ్దాలుగా గూడుకట్టుకున్న ఉద్వేగం మళ్లీ ఉప్పొంగింది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు ఒలింపిక్ కాంస్యం చేజిక్కించుకుంది. శ్రీజేశ్ గోడలా నిలిచిన వేళ…ఉత్కంఠ పోరులో పటిష్టమైన జర్మనీని మట్టికరిపిస్తూ.. పూర్వ వైభవం దిశగా ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది.
అది కేవలం కంచు కాదు.. అంతకు మించి!
క్రికెట్‌కు ‘83’ ప్రపంచకప్‌లా.. ఈ కంచుతోనే భారత హాకీలో మరో సువర్ణాధ్యాయం మొదలవుతుందేమో!
మన్‌ప్రీత్‌కు మోదీ ఫోన్
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. ఆయన మన్‌ప్రీత్‌కు ఫోన్ చేశారు. ‘‘మన్‌ప్రీత్ జీ.. శుభాభినందనలు. మీరు, మీ సహచరులు గొప్ప ప్రదర్శన చేశారు. ఈ విజయంతో మొత్తం దేశం ఊగిపోతోంది. మీ కష్టానికి ఫలితం దక్కింది. ఆటగాళ్లందరికీ అభినందనలు. మీరు రాగానే కలుద్దాం. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది’’ అని మన్‌ప్రీత్‌తో ప్రధాని అన్నారు.
భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. గత వైభవపు మధుర స్మృతులను గుర్తు చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. గురువారం ఆఖరి క్షణం వరకు హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులో భారత్.. ఒత్తిడిని తట్టుకుంటూ 5-4తో జర్మనీని ఓడించింది. గోల్‌కీపర్ శ్రీజేశ్ తన అసమాన పోరాటంతో భారత్‌కు హీరోగా నిలిచాడు. ముఖ్యంగా చివరి సెకన్లలో అతడి పట్టుదల అందరినీ ఆకట్టుకుంది. భారత్ తరఫున సిమ్రన్‌జీత్ సింగ్ (17వ, 34వ) రెండు గోల్స్ కొట్టగా.. హార్దిక్ సింగ్ (27వ), హర్మన్‌ప్రీత్ సింగ్ (29వ), రూపిందర్‌పాల్ సింగ్ (31) తలో గోల్ సాధించారు. తిముర్ ఒరుజ్ (2వ), నిక్లాస్ వెలెన్ (24వ), బెనెడిక్ట్ ఫర్క్ (25వ), లుకాస్ విండ్‌ఫెడర్ (48వ) జర్మనీకి గోల్స్ అందించారు.
లబ్ డబ్ లబ్ డబ్: భారత్ ఆధిక్యం 5-4. ఉత్కంఠభరిత మ్యాచ్ ముగింపునకు వస్తోంది. దాదాపు గెలిచినట్లే! పతకం కళ్ల ముందు కదలాడుతోంది. కానీ అప్పటిదాకా అద్భుతంగా పోరాడిన భారత్‌కు ఆఖర్లో ఆందోళన తప్పలేదు. ఎందుకంటే మరో ఆరు సెకన్లలో విజిల్ మోగుతుందనగా జర్మనీ పెనాల్టీ కార్నర్ దక్కించుకుంది. అంతే సంబరాలకు సిద్ధమవుతున్న అభిమానుల్లో కంగారు. ఒకవేళ జర్మనీ గోల్ కొట్టుంటే మ్యాచ్ షూటౌట్‌కు దారితీసేది. అక్కడ ఏం జరిగేదో తెలియదు. కానీ మ్యాచ్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న గోల్‌కీపర్ శ్రీజేశ్ అలాంటి పరిస్థితిని తలెత్తనివ్వలేదు. అందరి ఆశలను నిలబెడుతూ జర్మనీ ఆటగాడు విండ్‌ఫెడర్ ప్రయత్నాన్ని సమర్థంగా అడ్డుకున్నాడు. అంతే.. జట్టంతా సంబరాల్లో మునిగిపోయింది.
1-3: ఆట అలా మొదలైందో లేదో జర్మనీ గోల్ కొట్టేసింది. భారత్‌కు షాకిస్తూ ఒరుజ్ రెండో నిమిషంలో జర్మనీ ఖాతా తెరిచాడు. అయిదో నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా వృథా అయింది. జర్మనీ వరుస ప్రయత్నాలతో భారత డిఫెన్స్‌పై ఒత్తిడిని కొనసాగించింది. తొలి క్వార్టర్ ముగియడానికి సెకన్ల ముందు నాలుగు పెనాల్టీ కార్నర్‌లను సంపాదించింది. భారత్ అన్నింటినీ కాచుకుంది. మన్‌ప్రీత్ బృందం రెండో క్వార్టర్‌లో కాస్త వేగాన్ని పెంచింది. నీలకంఠ శర్మ నుంచి బంతిని అందుకున్న సిమ్రన్‌జీత్ రివర్స్ హిట్‌తో అద్భుతమైన గోల్ సాధించాడు. అయితే జర్మనీ ఎటాకింగ్ గేమ్‌ను కొనసాగించింది. రెండు నిమిషాల తర్వాత ఫ్లొరియన్ ఫుచ్స్ రివర్స్ హిట్‌ను శ్రీజేశ్ సేవ్ చేశాడు. అయితే భారత రక్షణశ్రేణి వైఫల్యాన్ని జర్మనీ సొమ్ము చేసుకుంది. చకచకా రెండు గోల్స్ కొట్టి 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. షాక్‌కు గురైనా భారత్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. బలంగా పుంజుకుని, మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టి 3-3తో స్కోరును సమం చేసింది. 27వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హార్దిక్ సద్వినియోగం చేశాడు. రెండు నిమిషాల తర్వాత లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ వృథా కానివ్వలేదు.
5-3: స్కోరు సమం చేయడంతో భారత్ రెట్టించిన ఉత్సాహంతో కదిలింది. మూడో క్వార్టర్స్‌లో బాగా దూకుడును ప్రదర్శించింది. వలయం లోపల మన్‌దీప్ సింగ్‌ను ప్రత్యర్థి తోసేయడంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. అవకాశాన్ని రూపిందర్ రెండు చేతులా అందిపుచ్చుకోవడంతో భారత్ మ్యాచ్‌లో తొలిసారి ఆధిక్యం (4-3)లోకి దూసుకెళ్లింది. మూడు నిమిషాల తర్వాత గోల్‌తో ఆధిక్యాన్ని సిమ్రన్‌జీత్ మరింత పెంచాడు. జర్మనీ కూడా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కానీ గోడలాంటి భారత రక్షణశ్రేణిని ఆ జట్టు ఛేదించలేకపోయింది. రెండు గోల్స్‌తో వెనుకబడ్డ జర్మనీ.. ఊహించినట్లుగానే చివరి క్వార్టర్‌లో ధాటిగా ఆడింది. క్వార్టర్ ఆరంభమైన మూడు నిమిషాలకే పెనాల్టీ కార్నర్‌ను సాధించింది. ఈసారి విండ్‌ఫెడర్ సద్వినియోగం చేశాడు. అదే ఊపుతో స్కోరు సమం చేయడానికి తీవ్రంగా యత్నించిన జర్మనీ.. చివరి నిమిషాల్లో భారత డిఫెన్స్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. కానీ ఎంతో పట్టుదలను ప్రదర్శించిన శ్రీజేశ్ నేతృత్వంలోని భారత బ్యాక్‌లైన్‌ను ఛేదించలేకపోయింది.
Courtesy Eenadu