నిర్బంధం నుంచి ఒమర్ అబ్దుల్లా విడుదల

0
223

-ఎనిమిది నెలల అనంతరం విముక్తి

న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో నిర్బంధంలో ఉన్న జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) నాయకులు ఒమర్‌ అబ్దుల్లా మంగళవారం విడుదలయ్యారు. దాదాపు ఎనిమిది నెలల నిర్బంధం నుంచి ఆయనకు విముక్తి లభించినట్టయ్యింది. ” ఈరోజు ప్రపంచం చాలా భిన్నంగా ఉన్నది” అంటూ ఒమర్‌ తన తొలి ట్వీట్‌ చేశారు. ” 232 రోజుల నా నిర్బంధం తర్వాత చివరకు నేను హరి నివాస్‌ను విడిచిపెట్టాను. 2019 ఆగస్టు 5న ఉన్నదాని కంటే ప్రపంచం ఇప్పుడు చాలా భిన్నంగా ఉన్నది” అని తన ట్వీట్‌లో ఒమర్‌ పేర్కొన్నారు. మెహబూబా ముప్తీతో పాటు నిర్బంధంలో ఉన్న మిగతా నాయకులను సైతం విడుదల చేయాలని ఈ సందర్భంగా ఒమర్‌ అభ్యర్థించారు. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలను మనం తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. ఎనిమిది నెలల అనంతరం తన తల్లిదండ్రులను కలిసి లంచ్‌ చేశానని తన ఆనందాన్ని మరో ట్వీట్‌లో ఒమర్‌ వెలిబుచ్చారు. తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ఆయన పోస్ట్‌ చేశారు. గతేడాది ఆగస్టు 5న కేంద్రం జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370రద్దుకు ముందు ఒమర్‌తో పాటు ఆయన తండ్రి, ఎన్‌సీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీతో పాటు పలువరు రాజకీయ నాయకులను మోడీ సర్కారు నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఫరూక్‌ అబ్దుల్లా ఈ మధ్యే నిర్బంధం నుంచి విడుదల కాగా, ముఫ్తీ ఇప్పటికీ నిర్బంధంలోనే ఉన్నారు. ఒమర్‌ విడుదల పట్ల ముఫ్తీ ఆనందం వ్యక్తం చేశారు.

Courtesy Nava Telangana

Leave a Reply