ఢిల్లీలోనూ ఒమైక్రాన్‌ కేసులు?

0
71

అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో 12 మంది.. వారిలో 10 మందికి కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రిలో.. 12 మంది కొవిడ్‌ లక్షణాలున్న పేషెంట్లు చేరారు. వారంతా విదేశాల నుంచి వచ్చినవారే. వారిలో 10 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. మిగతా ఇద్దరికీ టెస్టులు చేయాల్సి ఉంది. ఈ పన్నెండు మందిలో ఎనిమిది మంది గురువారం చేరగా.. నలుగురు శుక్రవారం అడ్మిట్‌ అయ్యారు. కొత్తగా చేరిన నలుగురిలో ఇద్దరు యూకే నుంచి వచ్చినవారు కాగా, ఒకరు ఫ్రాన్స్‌ నుంచి, మరొకరు నెదర్లాండ్స్‌ నుంచి వచ్చారు. వీరికి సోకింది ఒమైక్రాన్‌ వేరియంటా కాదా తెలుసుకునేందుకుగాను వారి నమూనాలను జీన్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఫలితాలు ఐదారురోజుల్లో వస్తాయని ఆయన చెప్పారు. కాగా.. సింగపూర్‌, యూకే దేశాల నుంచి తమిళనాడుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారిలో యూకే నుంచి తన కుటుంబంతో వచ్చిన ఒక చిన్నారి కూడా ఉన్నట్టు తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్‌ తెలిపారు. ఇద్దరూ ఒమైక్రాన్‌ బాధితులంటూ వచ్చిన సోషల్‌ మీడియాలో వచ్చిన వదంతులను ఆయన కొట్టిపారేశారు. వారి నమూనాలను జన్యుసీక్వెన్సింగ్‌కు పంపినట్టు తెలిపారు. జైపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కుటుంబసభ్యులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. వారిలో నలుగురు ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నేపథ్యంలో.. అందరి నమూనాలనూ జన్యు పరీక్షకు పంపారు.

ఆ పది మందీ ఎక్కడ?
ఇప్పటికే రెండు ఒమైక్రాన్‌ కేసులు బయటపడడంతో ఆందోళన చెందుతున్న కర్ణాటక ఆరోగ్యశాఖ.. బెంగళూరులో 10 మంది దక్షిణాఫ్రికా జాతీయులు కనిపించకుండా పోవడంతో తీవ్రంగా కలత చెందుతోంది. వారంతా బెంగళూరుకు నవంబరు 12 నుంచి 22 నడుమ వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. వారు బెంగళూరులో దిగినప్పుడు.. అ క్కడ తాము ఉండబోయే చిరునామాలను అధికారులకు ఇచ్చారు. ఒమైక్రాన్‌ కేసులు రెండు బయటపడిన నేపథ్యంలో వారికి మళ్లీ పరీక్షలు చేయడానికి ఆయా చిరునామాలకు వెళ్లగా.. వారు అక్కడ లేనట్టు తెలిపింది. అంతేకాదు.. వారి మొబైల్‌ఫోన్లు కూడా స్విచాఫ్‌ అయిపోవడం గమనార్హం. దీంతో వారి ఆచూకీ కోసం కర్ణాటక ఆరోగ్యశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, బెంగళూరులో ఒమైక్రాన్‌ పాజిటివ్‌గా తేలిన ఇద్దరు వ్యక్తులకు సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల సంఖ్య దాదాపు 500గా తేలింది. వారందరినీ గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించారు. వారి లో ఐదుగురికి పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. వారందరినీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉం చారు. మరోవైపు, దేశంలోని 18 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు(అంటే ఒక వారంలో నమోదయ్యే కేసుల సంఖ్య) 5ు నుంచి 10ు మేర పెరిగిందని కేంద్రం ప్రకటించింది. వాటిలో 9 జిల్లాలు కేరళకు చెందినవే కావడం గమనార్హం.

Courtesy Andhrajyothi

Leave a Reply