కెసిఆర్ కు కార్పొరేట్ల పొగడ్తలు

0
302

ఆర్టిసి సమ్మె అణిచివేతపై హర్షం • ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్ కథనంలో ప్రతిబింబం

హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసి కార్మికులు చేపట్టిన సమ్మె పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యవహరించిన తీరు అమోఘమని కార్పొరేట్ ప్రపంచం ప్రశంసిస్తోంది. రవాణా కార్యకలాపాలు పూర్తిగా స్తంభించినా, ఖజానాకు భారీ నష్టం వాటిల్లినా, ఆందోళనల్లో భాగంగా కొంతమంది ఆర్టీసి ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా కెసిఆర్ తన పట్టు విడవలేదని మెచ్చుకుంది. సమ్మె విషయంలో కార్మిక సంఘాలకు తలొగ్గకుండా కెసిఆర్ కఠినంగా వ్యహరించడాన్ని మెచ్చుకుంటూ పెట్టుబడిదారుల మానస పుత్రిక ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేక కథనం రాయడం గమనార్హం. ఈ పత్రిక కథనం ఇలా సాగింది…

కార్మిక సంఘాల డిమాండ్లు ముందుకు తీసుకొచ్చినప్పుడు సాధారణంగా ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు భిన్నంగా వ్యహరించలేదు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్ఓ) విషయంలో పిఎఫ్ లబ్దిదారులను జాతీయ ఫించను పథకం (ఎన్‌పిఎస్)లోకి మళ్లించే ప్రయత్నాలను ఉద్యోగులు గట్టిగా ప్రతిఘటించినప్పుడు కానీ, లేదా కమర్షియల్ మైనింగ్ లోకి ప్రయివేటు రంగ ప్రవేశాన్ని బొగ్గు గనులు ఉద్యోగులు అడ్డుకున్న విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం భిన్నంగా స్పందించలేకపోయింది. విధానపర నిర్ణయాలేవైనా తీసుకోవాల్చివచ్చినప్పుడు ప్రభుత్వాలు రాజకీయ, ఎన్నికల అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సివస్తుండటంతో కార్మిక సంఘాలు సంస్కరణల ప్రక్రియ వేగాన్ని తగ్గించగలుగుతున్నాయి. నష్టాల్లో ఉన్న ఆర్టిసిని ప్రభుత్వ రవాణా శాఖలో చేర్చి తమ వేతనాలు పెంచాలనే డిమాండ్ తో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు సమ్మె చేస్తే దానిని ఏమాత్రం లెక్కచేయకుండా వ్యవహరించి కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. కార్మికుల బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తలొగ్గదని తేల్చి చెప్పడమే గాక, నవంబర్ 5లోగా ఉద్యోగాల్లో చేరకపోతే డిస్మిస్ చేస్తామంటూ హెచ్చరికలు కూడా చేసింది. అంతేకాదు కార్మిక సంఘాలను బలహీనపర్చేందుకు కఠిన చర్యలు చేపట్టింది. పది వేల ఆర్టిసి బస్సుల్లో కొన్నింటిని మాత్రమే సమ్మె సమయంలో తిప్పగలిగినా, పండుగ సీజన్ అయినా కూడా విధుల్లో చేరని ఉద్యోగులను డిస్మిస్ చేసి కెసిఆర్ ప్రభుత్వం పట్టుబిగించింది. అంతేకాదు వీరి స్థానంలో తాత్కాలిక సిబ్బందిని నియమించడమే గాకుండా, ఆర్టీసి బస్సులను నడిపేందుకు ప్రయివేటు ఆపరేటర్లను కూడా ఏర్పాటు చేసుకుంది. వాస్తవానికి సమ్మె కారణంగా రవాణా కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. కొంతమంది ఆర్టీసి ఉద్యోగులు ఆత్మహత్యలు కూడా చేసుకు న్నారు. అయినా కూడా కెసిఆర్ ప్రభుత్వం తలొ గ్గలేదు.

గతంలో హోండా కంపెనీ ఉద్యోగుల సమ్మె కారణంగా 70 వేల యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి తలొగ్గని వైఖరి తప్పనిసరి. తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయంలో తప్పుబట్టడానికి ఏమీ లేదు. తెలంగాణ ఆర్టిసి నష్టాలన్నీ దాని స్వయం కృత్యమే. 2015-16లో రవాణా రాయితీల మొత్తం రూ.526 కోట్లకు చేరింది. అయిన ప్పటికీ టిఎస్ఆర్ టీసి కొన్ని ప్రత్యేక తరగతులు ప్రయాణికులకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. నష్టాలు పేరుకుపోవడంతో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైనే కార్పొరేషన్ దృష్టి సారించింది తప్ప ఇంకో మార్గం వెతుక్కోలేకపోయింది. 2015-16 నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల నివేదికలను పరిశీలిస్తే టిఎస్ఆర్టిసి అత్యుత్తమ పనితీరు కనబర్చే రవాణా సంస్థల్లో ఒకటిగా ఉంది. అయితే దాని ఆదాయంలో సగం ఉద్యోగులకే సరిపోతోంది. చాలా రాష్ట్రాలతో పోలిస్తే బస్సు ఉద్యోగుల నిష్పత్తి కూడా తక్కువగానే ఉంది. దీనిని బట్టి కూడా మిగిలిన చాలా రాష్ట్రాలతో పోలిస్తే టిఆర్ఆర్‌టిసి సిబ్బంది మంచి జీతాలు పొందుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ చేసింది చాలా మంచిపని. వ్యతిరేకించడానికి ఏమీ లేదు. ఆర్థికపరంగా బాధ్యత లేని నిర్ణయాలు తీసుకునేలా ఆర్టీసి ఉద్యోగులు తనపై ఒత్తిడి తీసుకొచ్చినా దానికి తలొగ్గకుండా గట్టిగా నిలబడ్డారు. ఛార్జీలు పెంచడం, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం వంటి విషయాల్లోనూ కాలానుగుణ నిర్ణయాలు తీసుకుంటే ఆయన ప్రభుత్వానికి ఇంకా మంచిది.” అని ఆ కథనం ముగించింది.

Courtesy Prajashakthi..

Leave a Reply