ప్రపంచమంతటా ఒకే కనీస కార్పొరేట్ పన్నురేటు

0
19
ప్రభాత్‌ పట్నాయక్‌
ప్రభాత్‌ పట్నాయక్‌

కోవిడ్‌ నుంచి ఆదుకోడానికి మొదట ప్రకటించిన లక్షా తొంభై వేల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజి తర్వాత బైడెన్‌ ప్రభుత్వం మరో రెండు లక్షల ముప్ఫై వేల కోట్ల డాలర్ల మౌలిక రంగ ప్యాకేజిని మళ్ళీ ప్రకటించింది. మొదటి ప్యాకేజి ఒక్క నెలలోనే ఖర్చు చేశారు. కాని ఈ రెండో ప్యాకేజి ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో ఖర్చు పెట్టనున్నారు. దీని తర్వాత ఇంకొక ”మానవ మౌలిక వనరుల ప్యాకేజి”ని ప్రకటించబోతున్నారు. ఇదంతా కలిపితే ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద ఊపునిస్తుంది. ఈ మౌలిక రంగ ప్యాకేజికి అవసరమయ్యే ధనాన్ని కార్పొరేట్‌ పన్ను రేటును పెంచడం ద్వారా వసూలు చేయబోతున్నారు కాబట్టి ఇది పెద్ద ఎత్తున సంపద పున:పంపిణీకి కూడా దారి తీస్తుంది. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలో కార్పొరేట్‌ టాక్స్‌ను 35 నుంచి 21 శాతానికి తగ్గించాడు. ఇప్పుడు బైడెన్‌ దానిని 28 శాతానికి పెంచాలని కోరుకుంటున్నాడు. వెంటనే ఒక్కసారిగా కాకపోయినా క్రమంగా పెంచనున్నాడు.

దశాబ్దాల పాటు నయా ఉదారవాద విధానాలు అమలు జరిగాక మళ్ళీ ఒక సోషల్‌ డెమాక్రటిక్‌ ఎజెండా వైపుగా మళ్ళడాన్ని ఇది సూచిస్తోంది. ఇటువంటిది గత యాభై సంవత్సరాలలో ఎన్నడూ జరగలేదు. ప్రస్తుతం పెట్టుబడిదారీ దశ ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి సోషల్‌ డెమోక్రటిక్‌ ఎజెండా అమలు జరగడానికి ఎటువంటి ఆటంకాలు ఎదురౌతాయో చూడాలి మరి. ఒక పక్క సంపన్న పశ్చిమ దేశాలలో ఇటువంటి సోషల్‌ డెమోక్రటిక్‌ విధానాలను అమలు చేస్తూ, ఇంకోవైపు మూడవ ప్రపంచ దేశాలపై మాత్రం పొదుపు చర్యలనే రుద్దడం వలన ఎటువంటి పర్యవసానాలు ఎదురవనున్నాయో రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక్క విషయానికి మనం పరిమితం అవుదాం.
అమెరికా ఒక్క దేశమే ఇంకెవరినీ సరకు చేయకుండా తన దేశంలో కార్పొరేట్ల ఆదాయం మీద పన్ను పెంచెయ్యలేదు. ఆ విధంగా చేస్తే పెట్టుబడి అమెరికా నుంచి కార్పొరేట్‌ పన్నును పెంచకుండా ఉన్న దేశాలకు తరలిపోతుంది. పైగా, ఇప్పుడు కార్పొరేట్‌ కంపెనీలు పలు దేశాలలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నందున ఎక్కువ కార్పొరేట్‌ పన్ను ఉన్న చోట తమకు పెద్దగా లాభాలు రానట్టు, తక్కిన ప్రాంతాల కార్యకలాపాలనుండే లాభాలు చేకూరినట్టు చూపించగలవు. ఇప్పుడు అమలులో ఉన్న అకౌంటింగ్‌ విధానం వలన గాని, కొన్ని దేశాలు పన్నురహిత స్వర్గధామాలుగా ఉన్నందువలన గాని ఇది సాధ్యపడుతుంది. అప్పుడు అమెరికాలో పన్ను రేటు పెంచినా, ఈ కార్పొరేట్‌ కంపెనీలు అక్కడ పన్ను కట్టనవసరం లేదు. అందుచేత ఒక్క అమెరికాలో మాత్రమే కార్పొరేట్‌ ఆదాయం మీద పన్ను పెంచితే దానికి లాభం లేదు. ఇతర దేశాలు కూడా పెంచేలా చేయవలసిందే.

దీనికి సంబంధించి అమెరికా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి జేనెట్‌ యెల్లెన్‌ ఒక ప్రతిపాదన ముందుకు తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ కనీస కార్పొరేట్‌ పన్ను 21శాతం ఉండాలన్నదే ఆ ప్రతిపాదన. నిజానికి ఇప్పుడు ప్రపంచంలో అంతకంతకూ కార్పొరేట్‌ పన్నును తగ్గించుకుంటూ అలా అట్టడుగుకు పోతున్న ధోరణి ఉంది. నాలుగు దశాబ్దాల క్రితం 1980లో సగటు ప్రపంచ కార్పొరేట్‌ ఆదాయ పన్ను 40శాతం ఉండేది. అది క్రమంగా తగ్గుతూ 2020 నాటికి 24శాతానికి చేరింది. అందువలన ఆ పన్ను ద్వారా సమకూరే ఆదాయం బాగా తగ్గిపోయింది. అల్ప, మధ్య తరహా ఆదాయాలుండే దేశాలలో వాటి జీడీపీలతో పోల్చినప్పుడు వాళ్ళు నష్టపోయిన ఆదాయం ఎక్కువ. అదే సంపన్న దేశాలు నష్టపోయినది తక్కువ. ఎలా ఎందుకు జరిగింది? అల్పాదాయ, మధ్య తరహా ఆదాయ దేశాలలో మొత్తం పన్ను ఆదాయంలో కార్పొరేట్‌ పన్ను ద్వారా వచ్చే ఆదాయం శాతం ఎక్కువ. అదే సంపన్న దేశాలలో కార్పొరేట్‌ పన్ను ద్వారా వచ్చే ఆదాయం శాతం తక్కువ.

ఇలా కార్పొరేట్‌ పన్నును తగ్గించినందువలన కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకోడానికి మూడవ ప్రపంచ దేశాలు పరోక్ష పన్నులను పెంచడం, విద్య, వైద్యం వంటి రంగాలపై చేసే ఖర్చును తగ్గించడం చేస్తున్నారు. ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అంతే గాక ఇటువంటి చర్యల వలన ఆ దేశాలలో సంపద పేదల నుండి సంపన్నులకు పున:పంపిణీ అవుతుంది. అయితే కార్పొరేట్‌ ఆదాయాలపై పన్నులను తగ్గించడం ద్వారా ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడానికి వీలవుతుందని ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు మూడవ ప్రపంచ దేశాలకు ”సలహా” ఇస్తాయి. పేదరికాన్ని తగ్గించేందుకు నయా ఉదారవాదం సూచించే పరిష్కారం ఇది.

అయితే ఈ విధంగా కార్పొరేట్‌ ఆదాయాలపై పన్నులను తగ్గించినందు వలన పేద దేశాలలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అదనంగా వచ్చి పడిన దాఖలాలేమీ లేవు. ఆ దేశాలలో పెట్టుబడులు పెట్టడం యొక్క వేగం కూడా పెరిగిన దాఖలాలు లేవు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కార్పొరేట్‌ పన్నులను తగ్గించడానికి, పెట్టుబడులు పెరగడానికి మధ్య సంబంధం ఉందని చెప్పడానికి ఎటువంటి సైద్ధాంతిక ప్రాతిపదికా లేదు.

ఒక మూడవ ప్రపంచ దేశంలో ప్రయివేట్‌ కార్పొరేట్‌ రంగం పెట్టే పెట్టుబడులు ఆ దేశంలో డిమాండ్‌ (కొనుగోలు శక్తి) ఏ మేరకు పెరుగుతుంది అన్న అంచనా మీద ఆధారపడి ఉంటుంది. కార్పొరేట్‌ పన్ను తగ్గించడం వలన ఆ యా కంపెనీల లాభాలలో నికరంగా మిగిలేది పెరుగుతుందే తప్ప దేశీయ డిమాండ్‌ పెరగదు (నిజానికి కార్పొరేట్‌ పన్ను తగ్గించినందువలన ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గుతుంది. దాని వలన ప్రభుత్వ వ్యయం తగ్గుతుంది. అందువలన దేశీయ డిమాండ్‌ తగ్గుతుంది. అప్పుడు నిజానికి ప్రయివేట్‌ కార్పొరేట్‌లు పెట్టే పెట్టుబడి తగ్గుతుంది). అంటే కార్పొరేట్‌ పన్ను తగ్గించినందువలన ఆ కంపెనీల జేబుల్లో మిగిలే సొమ్ము పెరుగుతుందే తప్ప దేశీయ మార్కెట్‌లో పెట్టుబడులేమీ పెరగవు.
ఇక ప్రపంచ మార్కెట్‌లో పెట్టుబడులు కూడా ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుదలను బట్టే ఉంటాయి. అక్కడ కూడా కార్పొరేట్‌ ఆదాయ పన్నును తగ్గించడం బట్టి ఉండవు. కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తే మూడవ ప్రపంచ దేశాలలోకి పెట్టుబడులు సంపన్న దేశాల నుంచి స్థానం మార్పిడి (రీ లొకేషన్‌) చేసుకుంటాయన్న వాదన కూడా సరైనది కాదు. సంపన్న దేశాలలో వేతనాల స్థాయికి, మూడవ ప్రపంచ దేశాలలో వేతనాల స్థాయికి మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసమే పెట్టుబడులు మూడవ ప్రపంచదేశాలలోకి తమ స్థానాన్ని మార్పిడి చేసుకోడానికి ప్రధాన కారణం. ఆ వ్యత్యాసం వలన వారికి మిగిలే లాభం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలనే మూడవ ప్రపంచ దేశాలలోకి పెట్టుబడులు వస్తాయి. దీనితోబాటు ఆ దేశాలలో అందుబాటులో ఉండే మౌలిక వసతులు, విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యం గల ఉద్యోగుల లభ్యత కూడా అదనపు కారణాలు అవుతాయి. పన్ను రేట్ల ఎక్కువ, తక్కువల ప్రభావం నామమాత్రమే.

ఇక సంపన్న దేశాల నడుమ వేతనాల స్థాయిలలో వ్యత్యాసాలు పెద్దగా ఉండవు. మౌలిక వసతుల లభ్యతలో గాని, విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యం కల ఉద్యోగుల లభ్యతలో కాని వ్యత్యాసాలు చెప్పుకోదగ్గ మోతాదులో ఉండవు. అందువలన పన్ను రేట్లలో తేడాలు ఉంటే ఆ ప్రభావం పెట్టుబడుల ప్రవాహం మీద ఉండే అవకాశం ఉంది (అందువల్లనే అమెరికా ఏకపక్షంగా కార్పొరేట్‌ పన్ను విషయంలో నిర్ణయం తీసుకోవడం సాధ్యపడదు). సంపన్న దేశాలలో ఎంతో కొంత ప్రభావం చూపించిన విధంగా పన్ను రేట్ల లో తేడాలు మూడవ ప్రపంచ దేశాల లోకి వచ్చే పెట్టుబడుల మీద ప్రభావం చూపలేవు. అనుభవంలో చూసుకున్నా మూడవ ప్రపంచ దేశాలు కార్పొరేట్‌ పన్నులను తగ్గించినందువలన ఆ దేశాల లోకి వచ్చే విదేశీ పెట్టుబడులు పెరిగాయనడానికి ఎటువంటి ఆధారాలూ లేవు.

ప్రపంచంలో అనేక దేశాలు పోటీ పడి కార్పొరేట్‌ ఆదాయాలపై పన్నులను తగ్గిస్తున్నప్పుడు ఒక దేశంలో పన్ను తగ్గించడం వలన వచ్చే సానుకూలత తక్కిన దేశాల్లో కూడా తగ్గించగానే ఇక ఉండదు. భారత దేశంలో కూడా కార్పొరేట్‌ పన్నును క్రమంగా తగ్గిస్తూ రావడం మనకు కనిపిస్తుంది. ఏ ఇతర ప్రోత్సాహకాలనూ, మినహాయింపు లనూ ఉపయోగించుకోని కార్పొరేట్‌ కంపెనీల ఆదాయాలపై పన్నును 30 నుంచి 22 శాతానికి, కొత్తగా స్థాపించిన కంపెనీలకు 25 నుండి 15శాతానికి తగ్గించారు. ఇది 2019 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది.

నిజానికి ప్రపంచం అంతటా ఒకటే కార్పొరేట్‌ పన్ను రేటు ఉండాలన్న జేనెట్‌ యెల్లెన్‌ ప్రతిపాదన మన దేశానికి చాలా ఊరటనిచ్చే విషయంగా అనిపించి ఉండాలి. పరస్పరం పోటీలు పడి పన్ను రేటును అట్టడుగు స్థాయిదాకా దింపకుండా ఈ ప్రతిపాదన నిరోధిస్తుంది. కాని చాలా విచిత్రంగా భారతదేశం ఇంతవరకూ ఆ ప్రతిపాదనను సమర్థించకుండా బిగుసుకుని కూచుంది. దీనికి ఒకటే కారణం ఉండి ఉండాలి. బైడెన్‌ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమానికి కట్టుబడి ఉన్నట్టు మోడీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి లేదు. ఎటువంటి సోషల్‌ డెమోక్రటిక్‌ ఎజెండానూ చేపట్టేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగాలేదు. పన్ను రేట్లు తగ్గిస్తే పెట్టుబడులు పెరుగుతాయని, వృద్ధిరేటు పెరుగుతుందని చెప్పే బూటకపు వాదనకే అది కట్టుబడి ఉంది. ఆ వాదన ద్వారా తన ఆశ్రిత పెట్టుబడిదారులను మరింత సంపన్నులుగా పెంచడానికే అది కంకణం కట్టుకుని ఉంది.

అనేక అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో యెల్లెన్‌ ప్రతిపాదనకు సమర్థన వచ్చింది. కాని ఏ దేశాలైతే ఈ విషయం మీద నిర్ణయం చేయగల స్థానాల్లో ఉన్నాయో, వాటిలో ఇంకా ఆమోదం పొందలేదు. వలసవిధానం అంతమయ్యాక, రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక, అన్ని దేశాల స్వతంత్రతను, సార్వభౌమత్వాలను గుర్తించాక, ఇటువంటి సమస్యలపై ఐరాస ఆధ్వర్యంలో అన్ని దేశాలనూ భాగస్వాములుగా చేసి చర్చించడం, ఆ చర్చల ఆధారంగా ఒక నిర్ణయానికి రావడం సహేతుకమైన విధానం అవుతుంది. కాని అందుకు విరుద్ధంగా జి-20 దేశాలు, తేదా కొన్ని సంపన్న దేశాలు నిర్ణయించుకుని తక్కిన దేశాలన్నీ ఆ నిర్ణయాన్ని అనుసరించాల్సిందేనని చెప్పడం జరుగుతోంది.

ఆ పరిమితంగా ఉన్న దేశాల గ్రూపులో కూడా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత వస్తోంది. అందుచేత అమెరికా తన ప్రతిపాదనను సవరించుకుంటోంది. 21శాతం కనీస స్థాయి కార్పొరేట్‌ పన్ను అన్న ప్రతిపాదన కాస్తా ఇప్పుడు 15శాతానికి తగ్గింది. ఇక అంతిమంగా ఏం నిర్ణయం రానుందో వేచిచూడాలి. కాని మనం మాత్రం ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలోని నయా ఉదారవాద శకం ముగింపును చూస్తున్నాం.

Courtesy Nava Telangana

Leave a Reply