రాష్ట్రాన్ని చుట్టేసింది!

0
280
  • ఇప్పటికి 111 మంది బాధితులు
  • ఒక్కరోజులోనే 67 పాజిటివ్‌ కేసులు
  • అత్యధికంగా గుంటూరు జిల్లాలో 20 మంది
  • కడప, ప్రకాశం, కృష్ణాల్లో 15 మంది చొప్పున
  • ‘పశ్చిమ’లో 14, విశాఖలో 11 మందికి నిర్ధారణ
  • తూర్పులో 9, చిత్తూరులో ఆరుగురికి వైరస్‌
  • బాధితుల్లో అత్యధికులు ఢిల్లీ వెళ్లొచ్చినవారే
  • అసోం సందర్శనకు వెళ్లిన ముగ్గురికీ పాజిటివ్‌

కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని చుట్టేస్తోంది. ప్రమాద ఘంటికలు మోగిస్తూ అన్ని జిల్లాలకూ విస్తరిస్తోంది. బుధవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 67 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా బాధితులు 111కు పెరిగారు. కేసుల సంఖ్యలో పొరుగున ఉన్న తెలంగాణ(105)ను ఏపీ మించిపోయినట్లయింది. కేవలం 24గంటల వ్యవధిలోనే 88 కొత్త కేసులు నమోదవగా, వీరిలో ఢిల్లీ సమావేశాలకు వెళ్లి వచ్చినవారు, వారితో దగ్గరి సంబంధాలు ఉన్నవారే అధికంగా ఉన్నారు. కొత్తగా నమోదైన 11 కేసులతో కలిపి గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20పాజిటివ్‌లు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో కేసుల సంఖ్య 15కు పెరిగింది. వీరంతా విజయవాడ నగరానికి చెందినవారే. ఇక మంగళవారం వరకూ ఒక్క కేసు కూడా లేని కడప జిల్లాలో ఒక్కసారిగా 15కేసులు, పశ్చిమగోదావరిలో 14కేసులు (మంగళవారం అర్ధరాత్రి ప్రకటించిన 12తో కలిపి) వెలుగు చూశాయి.

కడపలో కరోనా నిర్ధారణ అయిన 15మందిలో 14మంది ఢిల్లీ సమావేశాలకు వెళ్లి వచ్చినవారు కాగా.. మరొకరు వారితో సన్నిహితంగా తిరిగిన వ్యక్తి. పశ్చిమగోదావరి జిల్లాలో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా 14మందికి పాజిటివ్‌ వచ్చింది. తూర్పుగోదావరిలో కొత్తగా 5కేసులు నమోదవడంతో జిల్లాలో మొత్తం కేసులు తొమ్మిదికి చేరాయి. చిత్తూరు జిల్లాలో ఢిల్లీ వెళ్లివచ్చిన శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాలకు చెందిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. అసోంలోని గోల్‌భర్‌ ప్రాంతానికి వెళ్లి వచ్చిన పలమనేరు వాసులు ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన వ్యక్తికి, బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన మరొకరికి కరోనా సోకింది. వీరిద్దరూ ఢిల్లీ సమావేశాలకు హాజరయ్యారు. బుధవారం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఒకటి, ఒంగోలులో 3పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీ లింకుతో హడల్‌
విదేశాల నుంచి రాష్ట్రానికి సుమారు 30వేల మంది వచ్చారని గుర్తించగా వీరిలో 16మందికి పాజిటివ్‌ వచ్చింది. వారితో కొంత ముప్పు తగ్గిందని అధికారులు ఊపిరి పీల్చుకునేలోపే ఢిల్లీ సమావేశాలు పెద్ద బాంబ్‌ పేల్చాయి. రాష్ట్రంనుంచి సుమారు 1,500మంది ఢిల్లీ వెళ్లి వచ్చారని అంచనా కాగా ఇప్పటివరకూ 1,085 మందిని క్వారంటైన్‌కు తరలించారు. మరి కొంతమంది కోసం అధికారులు గాలిస్తున్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply