రాష్ట్రంలో నర్సుల కొరత

0
167

కనీసం లక్ష మంది అవసరం
రిజిస్టర్‌ అయింది 32 వేల మందే
పదేండ్లుగా పడకేసిన నర్సింగ్‌ విద్య

హైదరాబాద్‌ : ఏండ్ల తరబడి ప్రభుత్వం నర్సింగ్‌ విద్య పట్ల వహించిన నిర్లక్ష్యం రాష్ట్రానికి శాపంగా మారింది. ప్రజారోగ్య పరిరక్షణలో నర్సుల అవసరాన్ని పదే పదే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ (ఐఎన్‌సీ) గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టిన ఫలితంగా రాష్ట్రంలో నర్సుల కొరత వెంటాడుతున్నది. దశాబ్దాల క్రితం అప్పటి జనాభాకు సరిపడేలా నర్సింగ్‌ స్కూళ్లు, కాలేజీలను స్థాపించారు. అనంతరం పెరిగిన జనాభా, రోగులకు సరిపడేలా వాటిని పెంచకపోవటంతోఏటా అందుబాటులోకి వచ్చే నర్సుల సంఖ్య డిమాండ్‌ ను తీర్చటం లేదు. కేరళ లాంటి రాష్ట్రాలు ఏ ఏడాదికి ఆ ఏడాది నర్సింగ్‌ విద్యకు ప్రాధాన్యమిస్తూ విద్యాలయాల సంఖ్య పెంచితే అందుకు భిన్నంగా రాష్ట్రంలో మాత్రం వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారైంది. రాష్ట్ర జనాభాకు అనుగుణంగా తక్కువలో తక్కువగా లక్ష మంది నర్సులు అవసరముండగా ఏఎన్‌ఎంలు 3,372 మంది, స్టాఫ్‌ నర్సులు 14,495 మంది మాత్రమే రిజిస్టర్‌ అయి ఉండటం గమనార్హం. తాజాగా రాష్ట్రంలో వీరి సంఖ్య 32 వేలకు పెరిగినట్టు సమాచారం. ఇటీవల నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన 2019-2020 వార్షిక నివేదిక వెల్లడించిన గణాంకాలు సైతం నర్సింగ్‌ విద్య, భవిష్యత్‌ అవసరాలను పసిగట్టడంలో రాష్ట్రం వెనుకబాటుతనాన్ని ఎత్తి చూపించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో కలిపి ఏఎన్‌ఎం నర్సింగ్‌ విద్యాసంస్థలు 17, జీఎన్‌ఎం స్కూళ్లు 88, బీ.యస్సీ (నర్సింగ్‌) కాలేజీలు 86, ఎం.ఎస్సీ (నర్సింగ్‌) కళాశాలలు 23 ఉన్నాయి. వీటి నుంచి ప్రతి ఏటా 495 మంది ఏఎన్‌ఎంలు, 3,992 మంది జీఎన్‌ఎం, 4,940 మంది బీయస్సీ (నర్సింగ్‌), 463 మంది ఎం.ఎస్సీ నర్సింగ్‌ విద్యను పూర్తి చేసి బయటకు వస్తున్నారు. తద్వారా మొత్తం 10,320 మంది అందుబాటులోకి వస్తున్నారు. నర్సింగ్‌ విద్యాలయాల్లో సింహభాగం ప్రయివేటులోనే ఉండటం, ఎక్కువగా ఇతర రాష్ట్రాల వారే ఇక్కడ చదివేందుకు వస్తుండటంతో విద్యాభ్యాసం తర్వాత వారు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఏటా 10 వేల మందికి పైగా నర్సులు ప్రతి ఏడాది బయటికి వస్తున్నా అందులో సగం వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారని నర్సింగ్‌ సంఘాల నాయకులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రానికి చెందిన నర్సులు ప్రతి ఏటా 5000 వరకు మాత్రమే ఉంటున్నారనీ, ఇది మెరుగైన ప్రజారోగ్య నిర్మాణానికి ప్రజలకు నర్సులను అందుబాటులోకి తేవాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలకు భిన్నమైన పరిస్థితని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకిలా?
జనాభా పెరిగితే అందుకు సరిపడ విద్యాసంస్థలు పెరగాలి. తద్వారా ప్రస్తుత, భవిష్యత్‌ అసరాలకు తగ్గట్టు నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయి. అయితే రాష్ట్రానికి సంబంధించి 2018 నుంచి 2020 వరకు మూడేండ్ల గణాంకాలను పరిశీలిస్తే ఒక్క బి.యస్సీ (నర్సింగ్‌) కళాశాలలు 85 నుంచి 86కు పెరగటం తప్ప మిగిలిన విద్యాసంస్థలు పెరగకపోగా తగ్గాయి. 2018లో ఎం.ఎస్సీ (నర్సింగ్‌) కళాశాలలు 24 ఉండగా 2020 నాటికి వాటి సంఖ్య 23కు తగ్గింది. జీఎన్‌ఎం స్కూళ్లు 91 నుంచి 88కి తగ్గాయి. ఇక ఏఎన్‌ఎం స్కూళ్లు 2018లో 17 ఉండగా 2020 నాటికి కూడా 17 దగ్గరే ఆగిపోయాయి. జనాభా, ఆస్పత్రుల బెడ్లు తదితర వాటిని పరిగణనలోకి తీసుకుని సీట్లు పెరిగేలా మరిన్ని నర్సింగ్‌ స్కూళ్లను, కాలేజీలను అందుబాటులోకి తేవాల్సిన అవసరముందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply