ఇల్లు ఇరకాటం.. నీటితో చెలగాటం

0
208

66 శాతం గృహాల్లోనే దంపతులకు గదులు
సొంత ఇళ్లు లేని వారు దాదాపు మూడో వంతు!
తాగునీటి నిల్వకు ప్లాస్టిక్‌ పాత్రల వాడకం 27 శాతం
మురికివాడల్లో సర్కారు లబ్ధి అందని వారు 41 శాతం
జాతీయ నమూనా సర్వేలో వెల్లడి

ఇరుకిరుకు ఇళ్లు… వంటకు, స్నానానికి చాలని సదుపాయాలు… చెత్త వేసే తావు లేదు… మురుగు కాలువలు అంతంతమాత్రం. తాగునీటిని శుద్ధి చేయకుండానే తాగేస్తున్నారు… నీటినిల్వకు ప్లాస్టిక్‌ వినియోగం… సగానికి పైగా ఇళ్లలో ఈగలు, దోమల దాడి… రోగాల పీడ. జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌)లో వెల్లడైన అంశాలివి. 2017 జులై నుంచి 2018 డిసెంబరు వరకు దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై వివరాలను సేకరించి.. వాటి సారాంశాన్ని సర్వే తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం… చాలా విషయాల్లో తెలంగాణ గణాంకాలు జాతీయస్థాయి కంటే మెరుగ్గా ఉన్నాయి. కొన్ని విషయాల్లో దేశ సగటు కంటే రాష్ట్రం దిగువన ఉంది.

తెలంగాణలో గ్రామాల్లో 64 శాతం, పట్టణాల్లో 69 శాతం గృహాల్లో మాత్రమే దంపతులకు ప్రత్యేక గదులు ఉన్నట్టు నమూనా సర్వేలో తేలింది. రెండు ప్రాంతాల్లోనూ కలిపితే ఇది 66 శాతం. జాతీయ స్థాయి (68.3)తో పోలిస్తే తెలంగాణ కాస్త దిగువనే ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 28 శాతం మంది అపార్టుమెంట్లలో నివసిస్తున్నారు. జాతీయస్థాయి (12.9 శాతం) కంటే ఇక్కడ ఫ్లాట్లలో నివసిస్తున్న వారి శాతం రెట్టింపు కంటే ఎక్కువ.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 66 శాతం మంది తాగునీటిని శుద్ధి చేయకుండా నేరుగా తాగేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇది 65.3 శాతం. అయితే నీటిని కాచి తాగేవారు జాతీయ స్థాయిలో 5.8 శాతం ఎక్కువ.
సొంత ఇళ్లు లేని వారు తెలంగాణలో 29 శాతం. జాతీయ సగటు (16) కంటే ఇది 13 శాతం ఎక్కువ. పక్కా ఇళ్లు లేని వారు తెలంగాణ కంటే జాతీయ స్థాయిలో 8 శాతం ఎక్కువ.
పల్లెల్లో విద్యుత్తు సదుపాయం లేని ఇళ్లు అర శాతం కంటే తక్కువ. జాతీయస్థాయిలో మాత్రం అది 6 శాతం కంటే ఎక్కువ.
గ్రామాల్లో వంటకు ఎల్పీజీ సదుపాయం లేని వారు 10 శాతమే. దేశవ్యాప్తంగా చూస్తే 52 శాతం మందికి ఈ సౌకర్యం లేదు.
పట్టణ మురికివాడల్లో ప్రభుత్వం నుంచి ఏ లబ్ధీ అందని వారు తెలంగాణ కంటే దేశస్థాయిలో సుమారు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. ఇల్లో, స్థలమో పొందిన వారు రాష్ట్రంతో పోలిస్తే జాతీయ సగటులో 33 శాతం తక్కువ.
ఏడాది వ్యవధిలో గ్రామాలు, పట్టణాల్లో కలిపి ఈగలు, దోమల వల్ల 51 శాతం గృహాల వారు తీవ్రంగాను, 46 శాతం మంది ఒక మాదిరిగాను ఇబ్బంది పడ్డారు.

Courtesy Eenadu….

Leave a Reply