యురేనియం సర్వే కోసం వచ్చిన జియాలజిస్టుల అడ్డగింత

0
257

గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేసిన విద్యావంతుల వేదిక, జేఏసీ నేతలు

  • తిరిగి వెళ్లిన అధికారులు
  • లాడ్జి ఎదుట పోలీసుల బందోబస్తు

దేవరకొండ, సెప్టెంబరు 10: నల్లమలతోపాటు దేవరకొండ డివిజన్‌లో యురేనియం తవ్వకాల నమూనాల సేకరణ, అటవీ ప్రాంతంలో బోరుపాయింట్లను గుర్తించడానికి సర్వే కోసం వచ్చిన జియాలజిస్టుల బృందాన్ని దేవరకొండలో మంగళవారం విద్యావంతులవేదిక, విద్యార్థి జేఏసీ నేతలు అడ్డుకొని తీవ్రంగా వ్యతిరేకించి వెనక్కు పంపారు. దేవరకొండ డివిజన్‌లోని పీఏపల్లి మండలం నంభాపురం, పెద్దగట్టు, చందంపేట మండలం చిత్రియాలలో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో యూసీఐఎల్‌ అధికారులు రంగంలోకిదిగారు. జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 30 మంది జియాలజిస్టులతో బృందం హైదరాబాద్‌ నుంచి సోమవారం రాత్రి దేవరకొండకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు పీఏపల్లి మండలంలోని నంభాపురం అటవీ ప్రాంతాల్లో బోరుపాయింట్లను గుర్తించడానికి బయలు దేరిన జియాలజిస్టుల బృందాన్ని దేవరకొండ నియోజకవర్గ విద్యావంతుల వేదిక విద్యార్థి జేఏసీ నేతలు వారిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకే దేవరకొండలోని విష్ణుప్రియ లాడ్జి వద్దకు చేరుకున్న తెలంగాణ నేతలు కృష్ణజాంబవ్‌, కొర్ర రాంసింగ్‌, ఆంజనేయులు ఆధ్వర్యంలో బృందం సభ్యులు అధికారులు గోబ్యాక్‌ అంటు నినాదాలు చేశారు.

బస్సుకు అడ్డంగా కూర్చొని యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్వేకోసం వచ్చిన జియాలజిస్టు అధికారి తాము సర్వేకోసం వచ్చామని యురేనియంతో సంబంధంలేదని నచ్చజెప్పడానికి ప్రయత్నించినా నేతలు వినలేదు. యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని గ్రామాలకు వెళ్లనివ్వమని జియాలజిస్టు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అప్పటికే లాడ్జి వద్దకు దేవరకొండ ఎస్‌ఐ వెంకటయ్య ఆధ్వర్యంలో పోలీ్‌సబలగాలు చేరుకున్నాయి. విద్యార్థి జేఏసీ నేతలు అడ్డుకొని రోడ్డుపైన ధర్నా నిర్వహించి, గోబ్యాంక్‌ అంటు నినాదాలు ఇవ్వడంతో గత్యంతరంలేక జియాలజిస్టులు బృందం వారు వచ్చిన బస్సులో తిరిగి హైదరాబాద్‌ వెళ్లారు. ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక జేఏసీ నేతలు మాట్లాడుతూ యురేనియం తవ్వకాలను ఎట్టి పరిస్థితిలోను అడ్డుకుంటామన్నారు.

కేంద్ర ప్రభుత్వం యురేనియం అనుమతులను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల గ్రామస్తులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ, విద్యావంతుల వేదిక నాయకులు ఎర్ర నగేష్‌, ప్రభు, లక్ష్మన్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Courtesy Andhrajyothi…

Leave a Reply