మసిపూసి ‘మాఫీ’ చేశారు..!

0
133
  • రుణమాఫీకి బడ్జెట్‌లో ఉత్తుత్తి కేటాయింపులే
  • నాలుగేళ్లలో రూ.20,164 కోట్లే కేటాయింపు
  • ఇప్పటి వరకు రైతులకిచ్చింది 1,098 కోట్లే..!

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులకు, నిధుల విడుదలకు పొంతనే ఉండడం లేదు! సర్కారీ కేటాయింపులకు అనుగుణంగా.. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో నిధులు విడుదల చేయడం లేదు! ఇందుకు ‘రుణమాఫీ’ పథకమే నిదర్శనం. రాష్ట్రప్రభుత్వం నాలుగేళ్లలో రుణమాఫీ కోసం ఏకంగా రూ.20,164 కోట్లు కేటాయించింది. కానీ, రైతులకు చెల్లించింది మాత్రం రూ.1098 కోట్లు! అంటే ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్‌లో సర్కారు కేవలం 5.45% నిధులు మాత్రమే విడుదల చేసిందన్నమాట!రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కారు రెండోసారి కొలువుదీరిన తర్వాత రైతులకు రూ.లక్ష రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది. 2018 డిసెంబరు 11ను కటాఫ్‌ తేదీగా ప్రకటించింది. ఆ తేదీ నాటికి 40.66 లక్షల మంది రైతులకు రూ.25,936 కోట్ల బకాయిలు ఉన్నట్లు బ్యాంకులు తేల్చాయి. కానీ, ఒక్కో రైతుకు కాకుండా ఒక్కో కుటుంబానికి రూ.లక్ష పరిమితి విధించడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను విస్మరించి.. 4 లక్షల మంది రైతులను డిఫాల్టర్లుగా తేల్చింది. 36.6 లక్షల మంది రైతులకు రూ.19,198 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ ప్రకటించింది. కానీ, 5.66 లక్షల మందికే రుణమాఫీ అయింది.

కేటాయింపులు మాత్రమే..
రుణమాఫీ పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు ఘనంగా ఉంటున్నాయి. 2019-20లో రూ.6 వేల కోట్లు, 2020-21లో రూ.6 వేల కోట్లు, 2021-22లో రూ.5,225 కోట్లు, తాజా బడ్జెట్‌ (2022-23)లో రూ.2939.20 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఇప్పటికే రుణమాఫీ పూర్తికావాలి. కానీ, రెండు విడతలు కూడా సరిగా చేయలేదు. 2020లో రూ.1,200 కోట్లకు బీఆర్వో ఇచ్చిరూ.800 కోట్లు తిరిగి తీసుకుంది.  2021లో రూ.1,850 కోట్లకు బీఆర్వో ఇచ్చి.. రూ.690 కోట్లే విడుదల చేసింది. నాలుగేళ్లలో 5.66 లక్షల మందికి రుణమాఫీ పూర్తవగా, 31.02 లక్షల మందికి రూ.18,100 కోట్ల బకాయిలు ఉన్నాయి.

16 లక్షలమంది డిఫాల్టర్లు
బ్యాంకులు, సహకార సంఘాల్లో తీసుకున్న పంట రుణాలకు ఏడాది వరకు 7 శాతం, ఆ తర్వాత 11.5-14 శాతం వరకు వడ్డీ పడుతుంది. బ్యాంకర్లు వడ్డీని ఏడాదికి రెండుసార్లు రివైజ్‌ చేస్తే అసలుకు వడ్డీ, వడ్డీకి చక్ర వడ్డీ పడుతుంది. ఇలా వడ్డీ భారం 2 వేల కోట్ల వరకు ఉంటుంది. అయితే 2018 డిసెంబరు 11 నాటికి ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మాఫీ డబ్బులు ఇచ్చేలోపు రైతులే రుణాలు రెన్యువల్‌ చేసుకోవాలని, ప్రభుత్వం విడతలవారీగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తుందని చెప్పారు. కానీ, రైతులు ప్రభుత్వం మాఫీ చేసినప్పుడే చూద్దామంటూ వదిలేశారు. దీంతో 16 లక్షల మంది బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారారు.

Courtesy Andhrajyothi

Leave a Reply