బ్యాంకులపై ఆర్‌బీఐ ఆంక్షలు… ఖాతాదారులపై ప్రభావమెంత?

0
199

ఈ మధ్య కాలంలో చాలా బ్యాంకులు భారీ కుంభకోణాల్లో చిక్కుకోవడం, డిపాజిటర్లకు సరైన సమయంలో వడ్డీలు, కాలపరిమితి గడిచిపోయిన డిపాజిట్లు, ఎన్‌సీడీల్లోని సొమ్ము చెల్లించలేకపోవడం వంటి సంఘటనలు జరిగాయి. ఇందుకు తాజా ఉదాహరణ పీఎంసీ బ్యాంక్‌ (పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌). ఇలాంటి పరిస్థితి మాకు కూడా ఏర్పడితే ఏంటి అనే భయం చాలా మంది సగటు డిపాజిటర్లలో పట్టుకుంది. అయితే బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో నిపుణులు డిపాజిట్ల విషయంలో మాత్రం ఎవరూ భయపడాల్సిన పని లేదని భరోసా ఇస్తున్నారు. అందుకు కారణం బ్యాంకులు సేకరించే ప్రతి ఒక్క డిపాజిట్‌ను డీఐసీజీసీ (డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌) వద్ద ఇన్సూర్‌ చేయించడం తప్పనిసరి. ఆ రకంగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రిటైల్‌ ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించింది.

ఆర్‌బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి? : ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు తాము సేకరించిన డిపాజిట్లన్నింటినీ డీఐసీజీసీ వద్ద ఇన్సూర్‌ చేసి తీరాలి. ఒక్క ప్రాథమిక సహకార సంఘాలకు మాత్రమే ఈ డీఐసీజీసీ బీమా నుంచి మినహాయింపు ఉంది.

ఎంత మొత్తానికైనా బీమా వర్తిస్తుందా? : ఏ డిపాజిట్‌లో అయినా అప్పటికి నిల్వ ఉన్న అసలు మొత్తం, దానిపై జమ అయిన వడ్డీ అన్నీ కలిపి గరిష్ఠంగా ఒక్కో డిపాజిట్‌కు లక్ష రూపాయలకే బీమా ఉంటుందని ఆర్‌బీఐ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అంటే బ్యాంకు లిక్విడేషన్‌కు వెళ్లినా, ఆర్‌బీఐ సొమ్ము విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలు విధించినా ఎవరెంత సొమ్ము డిపాజిట్‌ చేశారనే దానితో సంబంధం లేకుండా ఒక్కో డిపాజిట్‌ పైన లక్ష రూపాయల గరిష్ఠ పరిమితికి లోబడి డీఐసీజీసీ చెల్లింపులు చేస్తుంది. అంటే మీరు రూ.10 లక్షలు డిపాజిట్‌ చేసినా దానిపై జమ అయిన వడ్డీతో కలిపి మీకు చేతికందేది గరిష్ఠంగా లక్ష రూపాయలేనన్న మాట. అలాగే ఒకే వ్యక్తి అదే బ్యాంకులో ఒకటి కన్నా ఎక్కువ డిపాజిట్లు లేదా ఖాతాలు కలిగి ఉన్నా అన్నింటిలో ఉన్న సొమ్ము, వాటిపై వడ్డీలు కలిపి డీఐసీజీసీ బీమా వర్తించేది అదే లక్షకు మాత్రమే.

వేర్వేరు శాఖల్లో బీమా వేరుగా ఉంటుందా? : ఒక వ్యక్తి ఒకే బ్యాంకుకు చెందిన వేర్వేరు శాఖల్లో ఖాతాలు కలిగి ఉన్నా అన్నింటికీ కలిపి వర్తించే గరిష్ఠ బీమా రక్షణ లక్ష రూపాయలే. అంటే ఒక వ్యక్తి ఒకే బ్యాంకుకు చెందిన వివిధ శాఖల్లోని వేర్వేరు ఖాతాల్లో రూ.10 లక్షల మేరకు దాచుకున్నా అన్నింటిలోనూ ఉన్న ఆ అసలు సొమ్ము, వాటన్నింటిపై జమ అయిన వడ్డీ అన్నింటికీ కలిపి లక్ష రూపాయల పరిహారమే చెల్లిస్తారు.

జాయింట్‌ ఖాతాల పరిస్థితి? : ఒకే బ్యాంకులో ఒక కుటుంబంలోని వేర్వేరు వ్యక్తులు వేర్వేరు ఖాతాలు కలిగి ఉంటే మాత్రం ప్రతి ఒక్క ఖాతా మీద రూ.లక్ష గరిష్ఠ పరిమితికి లోబడి పరిహారం అందుతుంది. ఒక వ్యక్తి తన పేరు మీద ఒక ఖాతా, కుటుంబ సభ్యుల్లో ఇంకొకరితో కలిసి జాయింట్‌ ఖాతా వేర్వేరుగా కలిగి ఉన్నట్టయితే అలాంటి ఖాతాలకు వేర్వేరుగా పరిహారం అందుతుంది.

ఇంకా వేటికి :
విదేశీ ప్రభుత్వాల డిపాజిట్లు
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు
ఇంటర్‌ బ్యాంక్‌ డిపాజిట్లు
రాష్ట్ర సహకార బ్యాంకుల్లో సంబంధిత రాష్ట్రంలోని లాండ్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంకులు చేసిన డిపాజిట్లు
విదేశాల్లో ఇన్వెస్ట్‌ చేసిన డిపాజిట్ల నుంచి రావలసిన మొత్తాలు

వేర్వేరు బ్యాంకుల్లో అయితే : ఒకే వ్యక్తి విభిన్న బ్యాంకుల్లో సొమ్ము డిపాజిట్‌ చేసి ఉంటే మాత్రం ప్రతి ఒక్క ఖాతాకు డీఐసీజీసీ కవరేజి ఉంటుంది. ఉదాహరణకి మీకు ఐదు బ్యాంకుల్లో వివిధ ఖాతాల్లో ఐదు లక్షల రూపాయల డిపాజిట్లున్నాయనుకుంటే ఒక్కో ఖాతా మీద గరిష్ఠంగా లక్ష రూపాయల పరిమితికి లోబడి ఐదు ఖాతాల మీద ఐదు లక్షలూ మీకు పరిహారంగా లభిస్తుంది. అంటే వాటి మీద జమ అయిన వడ్డీ మినహా మీకు సొమ్మంతా చేతికందినట్టే అవుతుంది. 5 బ్యాంకులకు చెందిన 5 ఖాతాల్లో రూ.10 లక్షల విలువ గల డిపాజిట్లున్నాయంటే మాత్రం ఒక్కో ఖాతాలో ఉన్న సొమ్ముపై లక్ష రూపాయల వంతున మీకు పరిహారం అందుతుంది.

ఈసీఎస్‌ అనుమతులుంటే మార్చుకోవాల్సిందే.. : ఖాతాదారు ఆ ఖాతా నుంచి బీమా ప్రీమియం చెల్లింపులు, నెలసరి వాయిదాల చెల్లింపులకు ఈసీఎస్‌ (ఎలక్ర్టానిక్‌ క్లియరింగ్‌) అనుమతి ఇచ్చి ఉంటే మాత్రం ఇలాంటి ఆంక్షలు వచ్చిన క్షణం నుంచి ఆ చెల్లింపులు నిలిచిపోతాయి. అందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వేరే బ్యాంకు ఖాతాకు ఆ ఈసీఎస్‌ చెల్లింపులు చేసే అనుమతి ఇవ్వడం తప్పనిసరి.

కొసమెరుపు: మొత్తం సొమ్మును ఒకే ఫిక్స్‌డ్‌ (ఎఫ్‌డీ) డిపాజిట్‌ రూపంలో పెట్టడం లేదా ఒకే బ్యాంకులో వేర్వేరు ఎఫ్‌డీల్లో పెట్టడం మానుకోండి. వేర్వేరు బ్యాంకుల్లో రూ.లక్ష వంతున ఎఫ్‌డీలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

Courtesy Nava telangana…

Leave a Reply