‘ప్రత్యామ్నాయం’ వేటలో ప్రతిపక్షాలు

0
129
ఎ. కృష్ణారావు

యూపీఏ నా, అది ఎక్కడుంది? బిజెపిని ఓడించేందుకు మేము వ్యూహాన్ని రూపొందించాల్సి ఉన్నది’ అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత వారం ముంబైలో ఎన్‌సిపి నేత శరద్‌పవార్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అన్నారు. శరద్‌పవార్‌ కూడా అదే మాట అన్నారు. కాంగ్రెస్ లేకుండా ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి మమతా బెనర్జీ సన్నద్ధమవుతున్నట్లు శివసేన ఎంపీ సంజయ్ రావత్ శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’లో రాసిన వ్యాసంలో చెప్పారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను కూడా కలుసుకుంటానని, ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని మమతా బెనర్జీ ఢిల్లీలో తెలిపారు. అఖిలేశ్‌ ఇప్పటికే ఉధృతప్రచారం ప్రారంభించగా, ఆయన ప్రజాయాత్రలకు జనం పెద్ద ఎత్తున హాజరు కావడం విస్మరించదగిన పరిణామం కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ను కూడా మమతా బెనర్జీ విశ్వాసంలోకి తీసుకున్నట్లు, ప్రశాంత్ కిషోర్ టీమ్ సభ్యుడు ఒకరు బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంపై కేసీఆర్‌తో చర్చించినట్లు టిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని మమతా బెనర్జీ గత మార్చిలో కేసీఆర్‌కు లేఖ రాశారు. నిజానికి 2018 మార్చిలోనే కేసీఆర్ పశ్చిమబెంగాల్ వెళ్లి దేశంలో బిజెపియేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పడినప్పుడే రాజకీయాల్లో గుణాత్మక మార్పు వస్తుందని ప్రకటించారు. అయితే 2019 ఎన్నికల్లో ప్రాంతీయపార్టీలు దాదాపు 190 సీట్లు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ చతికిలపడిపోవడంతో దేశ రాజకీయాలు మారిపోయాయి.

వాస్తవమేమంటే 1984 నుంచి 2014 వరకు పరిశీలిస్తే ప్రాంతీయపార్టీలు 43 శాతం నుంచి 52 శాతం ఓట్లను సంపాదిస్తూ వచ్చాయి. 2014లో కూడా ఆ పార్టీలు 49 శాతం ఓట్లు సాధించాయి. ప్రధానంగా కాంగ్రెస్‌ను దెబ్బతీయడం ద్వారానే బిజెపి 2014లో అధికారంలోకి రాగలిగింది.

లోక్‌సభ ఎన్నికలు జరగడానికి ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ప్రత్యామ్నాయం రూపొందించేందుకు సన్నాహాలు మొదలయ్యాయని ప్రతిపక్షాల శిబిరంలో జరుగుతున్న కదలికలను బట్టి అర్థమవుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి దెబ్బతింటుందని ప్రతిపక్ష నేతలు పలువురు నమ్మకంతో ఉన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ఓడించడానికి ఇప్పటికే ప్రతిపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ఒక అవగాహనతో పనిచేస్తున్నట్లు కనబడుతోంది.

2019 ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి సన్నాహాలే ప్రారంభమైనప్పటికీ అవి కొంచెం ఆలస్యంగా, పెద్దగా ప్రణాళిక లేకుండా జరిగాయి. ఆ ఎన్నికలకు ముందు 2018లో కర్ణాటకలో కాంగ్రెస్ జనతాదళ్ (సెక్యులర్)తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ బిజెపిని ఓడించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. దీనితో తాము పుంజుకుంటున్నామని భావించిన కాంగ్రెస్‌ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పొత్తుల గురించి సీరియస్‌గా ప్రయత్నించలేదు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలలో మిత్రపక్షాలను ఏర్పర్చుకోలేకపోయింది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేశాయి, ఉత్తరప్రదేశ్‌లో బిజెపి–అప్నాదళ్ కూటమికి వ్యతిరేకంగా సమాజ్‌వాది పార్టీ, బహుజనసమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కలిసికట్టుగా మహాఘట్ బంధన్ పేరుతో పోటీ చేస్తే కాంగ్రెస్ ఒంటరి పక్షిలా మిగిలిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి కూటమి 51.19 శాతం ఓట్లతో మొత్తం 80 సీట్లలో 62 సీట్లు గెలుచుకోవడంతో పాటు అనేక రాష్ట్రాల్లో బిజెపి అత్యధిక సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. పశ్చిమబెంగాల్‌లో కూడా బిజెపి 17 సీట్లు సాధించడం, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలలో దాదాపు అన్ని సీట్లు గెలుచుకోవడంతో పాటు మధ్యప్రదేశ్‌లో 29 సీట్లకు 28 సీట్లు దక్కించుకోవడం ఒక అనూహ్య పరిణామం. 437 సీట్లకు పోటీ చేసి 303 సీట్లు గెలుచుకోవడం బ్రహ్మ రహస్యమే కాదు, ఎన్నికల చరిత్రలో అద్భుతం. ఈ ఎన్నికలలో గెలిచిన తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలను బిజెపి పడగొట్టి కాంగ్రెస్‌ను మరింత బలహీనపరిచింది. ఆ ఎన్నికల ఫలితాలు అధ్యయనం చేసిన వారెవరికైనా కాంగ్రెస్‌ను ఓడించడం బిజెపికి పెద్ద కష్టం కాదని, ప్రాంతీయ పార్టీలతోనే అది సంఘర్షించాల్సి ఉంటుందని అర్థమవుతోంది.

విచిత్రమేమంటే చింతచచ్చినా పులుపు చావనట్లు దేశంలో తానే పెద్ద పార్టీనని కాంగ్రెస్ అహంకరిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు తన గొడుగు క్రిందకు రావాలని అది ఆశిస్తోంది. నెహ్రూ–గాంధీ కుటుంబ వారసుడికి మాత్రమే ప్రధానమంత్రి పదవి అనుభవించే జీవిత హక్కు ఉంటుందని కాంగ్రెస్ ఇప్పటికీ విశ్వసిస్తోంది. రాహుల్ గాంధీ ఎందుకు నాయకత్వ ప్రతిభను ప్రదర్శించలేకపోతున్నారో సమీక్షించుకుని ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. దేశంలో రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవడంలో విఫలమైనందువల్లే కాంగ్రెస్‌ను ఇవాళ మెజారిటీ మిత్రపక్షాలు విస్మరించే పరిస్థితి ఏర్పడింది అంతమాత్రాన కాంగ్రెస్‌ను పూర్తిగా కొట్టి వేయలేం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాల్లోని 140 సీట్లలో భారతీయ జనతాపార్టీకి, కాంగ్రెస్‌కు ముఖాముఖి పోటీ ఉన్నది. ఇవి కాక, పంజాబ్, అస్సాం, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు, తెలంగాణ, ఈశాన్యరాష్ట్రాలు తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ కనీసం 50 నుంచి 60 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఇంకా ఉన్నాయి. ఈ 200 సీట్లలో కాంగ్రెస్ కనీసం వంద సీట్లు గెలుచుకున్నా ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించగలుగుతుంది. అయితే అందుకు తగ్గ వ్యూహం కాంగ్రెస్ వద్ద ఉన్నట్లు కనపడడం లేదు.

కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమనేది ఆ పార్టీయేతర ప్రతిపక్షాలకు తెలియని విషయం కాదు. అదే సమయంలో ప్రతిపక్షాలను చేరదీసి మోదీకి వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పాటు చేయగలిగిన శక్తి, విశ్వసనీయత కాంగ్రెస్ కోల్పోయిందనీ తెలుసు. కనీసం ఆ పార్టీని దాని మానాన దాన్ని వదిలేస్తే వాస్తవ పరిస్థితులు తెలుసుకుని అత్యధిక సీట్లు సాధించేందుకు తగిన ప్రయత్నం చేసే అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారు.

నిజానికి కాంగ్రెసేతర ప్రతిపక్షాలకు కూడా మోదీకి ప్రత్యామ్నాయం రూపొందించడం సులభం కాదని తెలియకపోలేదు. కాంగ్రెస్‌ను చావు దెబ్బతీసిన తర్వాత బిజెపి తన దృష్టి ప్రాంతీయ పార్టీలపై ప్రసరించింది. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీకి ముచ్చెమటలు పట్టించింది. సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ బిజెపి దెబ్బకు తట్టుకోలేకపోయాయి. ఒడిషాలో ఆ పార్టీ చొచ్చుకుపోయింది. తెలంగాణలో ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవడం ప్రారంభించింది. 2019లో మొదటిసారి ప్రాంతీయ పార్టీల ఓట్ల శాతం 44కు పడిపోయింది. అయినప్పటికీ బిజెపి సాధించిన 37.5 శాతం కంటే ప్రాంతీయ పార్టీల ఓట్ల శాతం ఎక్కువే. కాంగ్రెస్ మాత్రం గత రెండు సార్వత్రక ఎన్నికల్లో 19.5 శాతం ఓట్లతో కునారిల్లుతోంది. ఒకప్పుడు కింగ్‌మేకర్ పాత్ర పోషించిన వామపక్షాలు ఇప్పుడు పూర్తిగా అస్తిత్వ సంక్షోభంలో ఉన్నాయి.

బిజెపిని ఆయా రాష్ట్రాల్లో ఓడించేందుకు ప్రతిపక్షాలు వ్యూహరచన ప్రారంభించలేదని చెప్పలేము. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు పశ్చిమబెంగాల్‌లో ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆ తరువాత బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అవి కలిసి పోటీ చేశాయి. తాము విజయం సాధించడం కన్నా బిజెపిని ఓడించడమే ప్రధానమని కాంగ్రెస్, వామపక్షాలు భావించాయి. అందువల్ల అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పెద్దగా ఇబ్బంది లేకుండా అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్షాలు వ్యూహం మార్చి వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. సమాజ్‌వాది పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్‌తో పాటు చిన్నా చితక పార్టీలతో చేతులు కలపడం, అగ్రవర్ణాల ఓట్లను చీల్చేందుకు ప్రియాంకాగాంధీ ఉధృత ప్రచారం చేయడం, బిఎస్‌పి ఒంటరిగా పోటీ చేయడం ఈ పరిణామంలో భాగం. ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చెప్పలేము.

బిజెపి మూలంగా తమ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని గమనించినందువల్లే ప్రాంతీయపార్టీలు జాతీయస్థాయిలో ఏకమయ్యేందుకు పూనుకున్నాయని అర్థమవుతోంది. అయితే ఇంటగెలిచిన తర్వాతే రచ్చగెలవడం సాధ్యమని ఆయా పార్టీలకు తెలియనిది కాదు. పలు ప్రాంతీయపార్టీలు తమ స్వంత రాష్ట్రంలో భంగపడి, జాతీయ రాజకీయాల్లో పాత్ర కోల్పోయిన ఉదంతాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. గతంలో నేషనల్‌ఫ్రంట్ చైర్మన్ ఎన్టీఆర్‌కే ఈ పరిస్థితి తటస్థించింది. రెండవది, తమ రాష్ట్రాల్లో అన్నిసీట్లూ గెలవడం అసాధ్యమైతే, జాతీయస్థాయిలో కూడా ప్రతిసారీ 200సీట్లు గెలవడం ప్రాంతీయ పార్టీలకు అంత సులభం కాదు. ఒకవేళ గెలిచినా తమ మధ్య వైరుధ్యాల మూలంగా జాతీయస్థాయిలో అవి ఏకంకాలేవు. తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకే; ఏపీలో టీడీపి, వైసీపీ మాదిరి ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు పరస్పరం తలపడుతున్న దృష్టాంతాలు కూడా ఉన్నాయి. మూడవది, అధికారంలో ఉన్న ప్రాంతీ య పార్టీలు ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తే కాని, బిజెపిని కానీ, మరో ప్రత్యర్థి పార్టీని కానీ ఢీకొనడం సాధ్యం కాదు.

దేశ రాజకీయాల్లో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు సంధి దశ. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలోకి రావడానికి వ్యూహాలు అల్లడం సహజమైతే, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇప్పటికే అగ్నిపరీక్ష ప్రారంభమైందని చెప్పవచ్చు. లేకపోతే సాగుచట్టాలను ఉపసంహరించుకోవడం జరిగేది కాదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఆయన నాయకత్వానికి, వ్యూహరచనా పటిమకు ఒక సవాలు వంటివి. ఈ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల తీరుతెన్నులపై మరింత స్పష్టత ఏర్పడుతుంది.

Courtesy Andhrajyothi

Leave a Reply