– కార్మికులకు కాంట్రాక్టర్ల వేధింపులు
– సమ్మె నోటీసు ఇచ్చినందుకు యూనియన్ జనరల్ సెక్రెటరీ తొలగింపు
గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను కాంట్రాక్టర్లు వేధింపులకు గురి చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తే టార్గెట్ చేస్తున్నారు. ప్రశ్నిస్తే చాలు.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే విధుల నుంచి తొలగిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపడతామని నోటీసు ఇచ్చినందుకు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రెటరీని విధుల నుంచి తొలగించారు.
సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో జీజేఆర్, ఎస్‌ఎస్‌వీ క్రియేషన్స్, ఏజిల్ అనే సంస్థల పరిధిలో దాదాపు 1200 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. జీజేఆర్ సంస్థ పరిధిలో 220 మంది ఔట్‌సోర్సింగ్, 110 మంది స్టాఫ్ నర్సులు ఉన్నారు. ఎస్‌ఎస్‌వీ క్రియేషన్స్ పరిధిలో 244 మంది కొవిడ్-19 స్టాఫ్ నర్సులు, 110 మంది ఔటుసోరింగ్, 100 మంది వరకు ఆరోగ్యశ్రీలో ఉన్నారు. ఏజిల్ సంస్థ పరిధిలో 100 మంది సెక్యూరిటీ సిబ్బంది, 200మంది శానిటేషన్, 15మంది సూపర్‌వైజర్లు, 100మంది పేషెంట్ కేర్ విభాగంలో పనిచేస్తున్నారు. గాంధీని పూర్తిగా కొవిడ్ సెంటర్‌గా మార్చిన నాటి నుంచి నేటి వరకు వీరందరూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులకు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్, నాన్ కొవిడ్ రోగులకు సైతం సేవలందిస్తున్నారు. ఇంత పని చేస్తున్నా వారి సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. సమస్యలను లేవనెత్తితే కాంట్రాక్టర్లు వేధింపులకు గురిచేస్తున్నారు. సరైన సమయంలో జీతాలివ్వడం లేదు. ఈఎస్‌ఐ, పీఎఫ్ జమ చేయడం లేదు. డ్రెస్స్‌లు, షూస్, శాలరీ పే స్లిప్స్, ఐడెంటి కార్డులు ఇవ్వడం లేదు. అంతేగాక ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సెలవు తీసుకుంటే విధుల నుంచి తొల గిస్తున్నారు. ఆ తర్వాత 4, 5 రోజులు కాంట్రాక్టర్ వెంటి తిరిగి బతిమిలాడితే మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కాం ట్రాక్టువ్యవస్థను రద్దుచేయాలనీ, నేరుగా ప్రభుత్వమేజీతాలివ్వాలని కోరుతున్నారు.
అసలేం జరిగిందంటే..
నాలుగో తరగతి ఔట్ సోర్సింగ్, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది జీతాలు పెంచాలని గతంలో డిమాండ్ చేస్తే పెంచుతామని ఆస్పత్రి సూపరింటెండెంట్ జులై 17వ తేదీన డీఎంఈ సమక్షంలో రాతపూర్వకంగా హామీనిచ్చారు. కానీ నేటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. జీఓ 68 ప్రకారం నాలుగో తరగతి సిబ్బందికి రూ.11,952 జీతం ఇవ్వాల్సి ఉండగా.. రూ.8,400 మాత్రమే చెల్లిస్తున్నారు. కరోనా కాలంలో రోజుకు రూ.300 ఇన్‌సెంటీవ్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇలాంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఈనెల 19వ తేదీన సూపరింటెండెంట్‌కు సమ్మె నోటీసు అందజేశారు. జనవరి 1వ తేదీలోపు తమ సమస్యలు పరిష్కరించకపోతే రెండు నుంచి సమ్మెకు దిగుతామని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ (సీఐటీయూ) యూనియన్ ఆధ్వర్యంలో నోటీసు ఇచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఎస్‌ఎస్‌వీ కాంట్రాక్టు సంస్థ, ఆస్పత్రి హెల్త్ ఇన్‌స్పెక్టర్లు యూనియన్ గాంధీ ఆస్పత్రి జనరల్ సెక్రెటరీ పి.లక్ష్మీపతిని 20వ తేదీన విధుల నుంచి తొలగించారు. రిలీవింగ్ లెటర్ తీసుకెళ్లాలని హుకుం జారీ చేయడంతో ఆయన తీసుకోలేదు. విధుల నుంచి తొలగించినట్టు సంబంధిత కాంట్రాక్టర్ సూపరింటెండెంట్‌కు లెటర్ ఇవ్వడంతోనే తాను తొలగించినట్టు హెల్త్ ఇన్‌స్పెక్టర్ సమాధానం ఇచ్చారు.
ఇది అన్యాయం : పి.లక్ష్మీపతి- యూనియన్ జనరల్ సెక్రెటరీ
సమస్యలు పరిష్కరించాలని లేదంటే సమ్మెలోకి వెళ్తామని సమ్మె నోటీసు ఇవ్వడంతో నాపై కక్షగట్టారు. ఆస్పత్రిలో సమస్యలపై ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తున్నారు. యూనియన్‌ను విచ్ఛిన్నం చేయడానికి కుట్ర జరుగుతోంది. నన్ను తొలగించి మూడు రోజులైంది. ఈ విషయమపై లేబర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తా. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా మాకు జీతాలివ్వాలి.
Courtesy Nava Telangana