వరికి రూ.72 పెంపు

0
19

మద్దతు ధరలు ప్రకటించిన కేంద్రం
రైతులకు ఉచితంగా కంది, పెసర, మినుము విత్తనాలు
కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

దిల్లీ: వరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.72 పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. దాంతో మద్దతు ధర రూ.1,868 నుంచి రూ.1,940కు పెరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం సమావేశంలో 2021-22 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో నువ్వుల ధరను గరిష్ఠంగా రూ.452 మేర, కనిష్ఠంగా సోయాబిన్‌ (పసుపుపచ్చ) ధరను రూ.70 మేర పెంచారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న ఉద్దేశంతో అన్ని పంటలపై పెట్టిన పెట్టుబడికి 50% అదనపు రాబడి వచ్చేలా ధరలు నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పప్పుదినుసుల ఉత్పత్తిలో స్వావలంబన సాధన కోసం 2021 ఖరీఫ్‌ సీజన్‌కు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు కేంద్రం పేర్కొంది. కంది, పెసర, మినుము సాగు విస్తీర్ణంతోపాటు ఉత్పాదకత పెంచడం దీని లక్ష్యం. ఇందులో భాగంగా గరిష్ఠ దిగుబడులు ఇచ్చే విత్తన రకాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. దిగుబడుల పెంపు కోసం అంతర పంటల విధానాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపింది.

నూనె గింజల వంగడాల మినీ కిట్లు…
నూనె గింజల దిగుబడులను పెంచడానికీ ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అధిక దిగబడులు ఇచ్చే వంగడాలను మినీ కిట్ల రూపంలో పంపిణీ చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్రత్యేక ప్రణాళిక ద్వారా నూనెగింజల సాగు విస్తీర్ణాన్ని 6.37 లక్షల హెక్టార్ల మేర విస్తరించనున్నట్లు తెలిపింది. దీనివల్ల 120.26 లక్షల క్వింటాళ్ల నూనె గింజల దిగుబడి అదనంగా వస్తుందని పేర్కొంది. ఫలితంగా వంట నూనెల ఉత్పత్తి 24.36 లక్షల క్వింటాళ్ల మేర పెరగనుంది. ప్రస్తుత ధరల పెంపుతో పెట్టుబడులపై సజ్జ రైతులకు 85%, మినుము రైతులకు 65%, కంది రైతులకు 62% అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొంది.

రైల్వేకు స్పెక్ట్రం కేటాయింపు
రైల్వేకు 5 మెగా హెర్ట్జ్‌ స్పెక్ట్రంను కేంద్రం కేటాయించింది. మొత్తం 700 ఎంహెచ్‌జడ్‌ సామర్థ్యంగల స్పెక్ట్రంలో రైల్వేల సిగ్నళ్లు, కమ్యూనికేషన్ల నిమిత్తం 5 ఎంహెచ్‌జడ్‌లను ఇచ్చింది. ఇంతవరకు ఆప్టికల్‌ ఫైబర్‌ విధానం ద్వారా సిగ్నలింగ్‌, ఇతర వ్యవస్థలను నిర్వహిస్తుండగా, ఇకపై అత్యంత వేగంగల రేడియో తరంగాల ద్వారా వీటిని నడుపుతారు. ఇందుకోసం రానున్న అయిదేళ్లలో రూ.25వేల కోట్లు వ్యయం చేస్తారు. రైల్వే నిర్వహణలో ఇది కీలక మార్పు కానుంది. లైవ్‌ వీడియో ద్వారా రైలు కదలికలను గుర్తించడానికి వీలు కలుగుతుంది.

రైతుకు ఒరిగేది అరకొరే
వరి, సోయా, పత్తి ఇతర పంటలకూ దక్కని గిట్టుబాటు ధర

హైదరాబాద్‌: పంటలకు కేంద్రం ప్రకటించిన కొత్త మద్దతు ధరలు సాగు ఖర్చులకు అనుగుణంగా లేవు. రాష్ట్రంలో క్వింటా వరి ధాన్యం ఉత్పత్తికి రైతు పెడుతున్న ఖర్చు సగటున రూ. 2,758 కాగా కేంద్రం బుధవారం పెంచిన మద్దతు ధర క్వింటాకు రూ.72 మాత్రమే. కూలీల భారం, డీజిల్‌, పురుగుమందులు, విత్తనాల ధరల పెరుగుదలతో పోలిస్తే పెంచిన మద్దతు ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దేశవ్యాప్తంగా పంట సాగు వ్యయాన్ని లెక్కవేసి సగటు తీసుకుని, దానికి 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధర ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

రాష్ట్రం సిఫారసులు బుట్టదాఖలు
రాష్ట్రంలో పంట సాగుకు రైతులు పెడుతున్న పెట్టుబడి ఖర్చులపై వ్యవసాయశాఖ గతేడాది అధ్యయనం చేసి ‘భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌’(సీఏసీపీ)కి నివేదికను గత ఫిబ్రవరిలో పంపింది. పంటల సాగు ఖర్చులు బాగా పెరిగాయని, వాటికి అదనంగా 50 శాతం కలిపి స్వామినాథన్‌ సిఫారసుల ప్రకారం మద్దతు ధరలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఉదాహరణకు రాష్ట్రంలో పత్తి క్వింటా ఉత్పత్తికి రైతు రూ.9954 పెట్టుబడి పెడుతున్నారని, దీనికి అదనంగా 50 శాతం కలిపి రూ.14,931 చొప్పున మద్దతు ధర ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సీఏసీపీని కోరింది. కానీ కేంద్రం రూ.6025 మాత్రమే ప్రకటించింది. స్వామినాథన్‌ సిఫారసుల ప్రకారం మద్దతు ధరలు ప్రకటించామని కేంద్రం బుధవారం తెలిపినా ఏ ఒక్క పంటకూ ఇవి సరిపోవన్నది స్పష్టం.

పెరిగిందెంత? పెంచేదెంత?
* ఏడాది కాలంగా కరోనా విపత్తు కారణంగా అనేక ఇబ్బందులు పడుతూ రైతులు పంటలను సాగుచేస్తున్నారు. వ్యవసాయానికి అవసరమైన  సామగ్రి ధరలన్నీ పెరిగాయి.

* డీజిల్‌ ధర గతేడాది జూన్‌ నెలలో లీటరు రూ.68 ఉంటే ఇప్పుడు రూ.94కు చేరింది. ఎకరా వరి పంట సాగుకు 50 లీటర్ల డీజిల్‌ అవసరమవుతుందని అంచనా. ఈ లెక్కన రైతు డీజిల్‌ కోసం ఎకరాకు రూ.1300 అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. వరి కోత యంత్రం కిరాయి గతేడాదికన్నా రూ.200 నుంచి 300 దాకా పెరిగింది. దుక్కులు, ట్రాక్టర్ల కిరాయి అన్నీ పెరిగాయి.  కూలీల కొరత తీవ్రంగా ఉంది. వరి నాట్లు వేయడానికి ఒక్కో కూలీకి రోజుకు రూ.500 ఇస్తామన్నా దొరకడం లేదని రైతులు చెబుతున్నారు. కూలీరేట్లు ఏటా డిమాండును బట్టి పెంచుతున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే క్వింటా వరిధాన్యం ఉత్పత్తికి రైతు రూ.2,758 ఖర్చు పెడుతున్నాడని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి మద్దతు ధర సిఫారసు చేసింది. జాతీయ స్థాయిలో సగటున ఈ ఖర్చు రూ.1293 మాత్రమేనని తేల్చిన కేంద్రం 50 శాతం అదనంగా కలిపి మొత్తం రూ.1940ని మద్దతుధరగా ప్రకటించింది. జాతీయ సగటు వ్యయానికి, తెలంగాణలో ఖర్చులకు చాలా వ్యత్యాసమున్నందున కొత్త మద్దతు ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

* ఎకరా సోయా పంట వేయడానికి 30 కిలోల విత్తనాలు అవసరం. వాటిని గతేడాది రూ.1,718కి వ్యవసాయశాఖ అమ్మగా ఇప్పుడు వాటి ధర రూ.3360కి చేరింది. సోయా పంట మద్దతు ధరను క్వింటాకు రూ.3880 నుంచి రూ.3950కి పెంచారు. అంటే పెరుగుదల రూ.70 మాత్రమే. ఎకరాకు 8 క్వింటాళ్ల సోయా దిగుబడి వస్తుందని అంచనా వేస్తే పెరిగిన మద్దతు ధర ప్రకారం రూ.560 మాత్రమే అదనంగా వస్తుంది. ఇక డీజిల్‌, కూలీలు, ఇతర రేట్ల పెరుగుదల భారం అదనం.

* రాష్ట్రంలో 75 లక్షల ఎకరాల్లో పత్తి వేస్తారు. మద్దతు ధర రూ.5825 నుంచి రూ.6025కి పెంచారు. అదనపు పెరుగుదల రూ.200 మాత్రమే. ఎకరానికి సగటున 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటే మద్దతు ధర వల్ల అదనంగా వచ్చే వెయ్యి రూపాయలు పెరిగిన డీజిల్‌ ధర పాటి కూడా లేదు.

Courtesy Eenadu

Leave a Reply