
- పారాలింపిక్స్‌లో భవినా, నిషద్, వినోద్ అద్భుత ప్రదర్శన
- భారత్ ఖాతాలో రెండు రజతాలు, ఓ కాంస్యం
టోక్యో: పారాలింపిక్స్‌లో ఒక పతకంతో మురుస్తున్న వేళ..ఏకంగా మరో రెండు పతకాలతో భారత అథ్లెట్లు ఆ ఆనందాన్ని ‘మూడిం’తలు చేశారు. టీటీ మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిన భవినాబెన్ పటేల్ తుది సమరంలో ఓటమితో రజతం అందుకుంది. 21 ఏళ్ల నిషద్ కుమార్ పురుషుల హైజం్‌పలో సరికొత్త ఆసియా రికార్డుతో రజతం చేజిక్కించుకొని అథ్లెటిక్స్‌లో పతకాల వేటకు శ్రీకారం చుట్టాడు. అనంతరం డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ కూడా ఆసియా రికార్డు ప్రదర్శనతో కాంస్య పతకంతో మెరిశాడు. దాంతో పారాలింపిక్స్‌లో భారత్‌కు సూపర్ సండే అయింది.
నిషద్ ఆసియా రికార్డు
పురుషుల హైజంప్ టీ-47 విభాగంలో 2.06 మీ. దుమికిన నిషద్ కుమార్ కొత్త ఆసియా రికార్డుతో రజత పతకం దక్కించుకున్నాడు. మొదటి ప్రయత్నంలో 2.02 మీ. దూకిన నిషద్ మూడో యత్నంలో 2.02 మీ. రికార్డు నమోదు చేశాడు. అమెరికాకు చెందిన డలాస్ వైజ్ కూడా 2.06 మీ. దూకడంతో అతడికి కూడా రజతం అందజేశారు. అమెరికాకే చెందిన రొడెరెక్ టౌన్‌సెండ్ 2.15 మీ. వరల్డ్ రికార్డుతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో తలపడిన మరో భారత అథ్లెట్ రామ్‌పాల్ 1.94 మీ. దుమికి ఐదో స్థానంలో నిలిచాడు. భుజం, మోచేయి, ముంజేయి పూర్తిగా పనిచేయని అథ్లెట్లను టీ-47 కేటగిరీ విభాగంలో చేరుస్తారు.

గడ్డికోత మిషన్‌లో చేయిపడి..
హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లా బదౌన్ నిషద్ స్వగ్రామం. రష్పాల్ సింగ్, పుష్పకుమార్ అతడి తల్లిదండ్రులు. రష్పాల్ ఎకరంలోపే ఉన్న పొలాన్ని సాగు చేయడంతోపాటు తాపీ పనికి కూడా వెళ్తుంటాడు. నిషద్‌కు ఆరేళ్ల వయస్సులో ఇంటివద్ద తల్లికి సాయపడే క్రమంలో గడ్డికోత మిషన్‌లో చిక్కుకోవడంతో అతడు కుడిచేయిని కోల్పోయాడు. ఎనిమిదేళ్ల వయస్సులో కోచ్ రమేశ్ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్‌లోకి అడుగుపెట్టిన నిషద్ తొలుత 200మీ, 400 మీ. పరుగులో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తర్వాత హైజం్‌పలోకి మారాడు. ‘ప్రమాదం నుంచి కోలుకున్నాక టీవీలో క్రీడా పోటీలు చూస్తూ వాటిపట్ల ఆసక్తి పెంచుకున్నాడు. తాను సాధారణ పిల్లల కంటే ఏమాత్రం తీసిపోనని వారికంటే మిన్నగా అథ్లెటిక్స్‌లో రాణిస్తానని తల్లికి ఎప్పుడూ చెబుతుండేవాడు. ఆరంభంలో సాధారణ క్రీడాకారులతో అథ్లెటిక్స్‌లో పోటీపడ్డాడు. పారాలింపిక్స్ పతకం అతడి కష్టానికి ఫలితం’ అని నిషద్ నాన్న రష్పాల్ సింగ్ ఉద్వేగంగా స్పందించాడు. బెంగళూరులో సాయ్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ఏడాది ఆరంభంలో కుమార్ కొవిడ్ బారిన పడ్డాడు. గత ఫిబ్రవరిలో దుబాయ్‌లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రీలో టీ 46/47 విభాగం హైజం్‌పలో పసిడి పతకంతో సత్తా చాటాడు. 2009 నుంచి పారా అథ్లెటిక్స్ బరిలో దిగుతున్నాడు.
అద్భుత పోరాట పటిమతో ఫైనల్‌కు దూసుకొచ్చిన టీటీ క్రీడాకారిణి భవినాబెన్ పటేల్ అంతిమ సమరంలో చైనాకు చెందిన వరల్ద్ నెం. 1 యింగ్ ఝౌ చేతిలో పరాజయం చవిచూసింది. మహిళల సింగిల్స్ క్లాస్-4లో జరిగిన ఫైనల్లో 7-11, 5-11, 6-11 స్కోరుతో వరుస గేముల్లో యింగ్ ఝౌ చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. తద్వారా ఈ పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం ఆమె అందించింది. పారాలింపిక్స్ టీటీ మహిళల సింగిల్స్‌లో రెండు స్వర్ణాల విజేత యింగ్‌తో భవినా పోరు 19 నిమిషాల్లో ముగిసింది. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లోనూ ఝౌ చేతిలో భవినాకు ఓటమే ఎదురైంది.
రెండో మహిళ:
పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన రెండో మహిళా అథ్లెట్‌గా పటేల్ రికార్డు సృష్టించింది. భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షురాలు దీపా మాలిక్ రియో ఒలింపిక్స్ షాట్‌పుట్‌లో రజత పతకం అందుకుంది. అయితే పారాలింపిక్స్ టీటీలో పతకం నెగ్గిన తొలి భారత ప్లేయర్‌గా భవినా ఘనత వహించింది. .
గుజరాత్ సర్కారు రూ. 3 కోట్ల నజరానా:
భవినాబెన్ పటేల్‌కు గుజరాత్ ప్రభుత్వం రూ. మూడు కోట్లు బహుమతిగా ప్రకటించింది. భారత టీటీ సమాఖ్య రూ. 31 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపింది.
ఆర్చరీ మిక్స్‌డ్‌లో ముగిసిన పోరు
ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ ఓపెన్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో రాకేశ్ కుమార్/జ్యోతి బలియన్ జోడీ 151-153తో టర్కీ ద్వయం ఒజ్నూర్ క్యూర్/ బ్లూయెంట్ చేతిలో ఓడింది. అంతకుముందు ఆరోసీడ్ భారత్ ద్వయం.. థాయ్‌లాండ్‌కు చెందిన అనోన్/ప్రపాపోర్న్‌పై 147-141తో నెగ్గి క్వార్టర్స్‌కు చేరింది. మహిళల కాంపౌండ్ ఓపెన్ విభాగంలో తలపడిన ఏకైక భారత ఆర్చర్ జ్యోతి తొలిరౌండ్‌లో 137-141తో కెర్రీ లూసీ (ఐర్లాండ్) చేతిలో ఓటమి పాలైంది.

డిస్క్‌సత్రోలో వినోద్ కూడా..
పురుషుల డిస్కస్ త్రో ఎఫ్-52 ఈవెంట్‌లో 41 ఏళ్ల వినోద్ కుమార్ 19.91 మీ. దూరం విసిరి కొత్త ఆసియా రికార్డుతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. పొయిటర్ కోస్విక్ (పోలెండ్, 20.02 మీ.) స్వర్ణం, వీల్మిర్ శాండర్ (సెర్బియా, 19.98 మీ.) రజతం గెలుపొందారు.
ఎఫ్-52 అంటే..:
కండరాల సామర్థ్యంలో తేడా, పరిమితమైన శరీర కదలికలు, కాలు పొడవులో తేడాలు..వంటి వైకల్యాలు ఉండి వీల్‌చెయిర్‌లో కూర్చొని పోటీపడే క్రీడాకారులను ఈ విభాగంలో చేరుస్తారు.
పదేళ్లు మంచానికే పరిమితమై..
హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన వినోద్ బీఎ్‌సఎ్‌ఫలో చేరి శిక్షణ సందర్భంగా లేహ్‌లో లోయలో పడిపోవడంతో కాళ్లకు తీవ్ర గాయాలై దాదాపు దశాబ్దంపాటు మంచానికే పరిమితమయ్యాడు. ఆ సమయంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. కోలుకున్నాక వీల్‌చైర్‌కే పరిమితమైన వినోద్.. రో్‌హతక్‌లో కిరాణా దుకాణంతో జీవనం ప్రారంభించాడు. దుకాణానికి వచ్చే ఓ ఆర్చరీ కోచ్ సూచనతో వినోద్ క్రీడలవైపు మళ్లాడు. వినోద్ తండ్రి ఆర్మీలో పని చేశాడు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో ఆయన పాల్గొన్నాడు.

వినోద్ ఎంపికపై అభ్యంతరాలు..!
వినోద్ కుమార్‌ను ఎఫ్-52 విభాగానికి ఎంపిక చేయడంపై బరిలో దిగిన అథ్లెట్లు కొందరు సవాలు చేశారు. ఈనెల 22నే ఈ విభాగ వర్గీకరణ పూర్తయినా.. ఏ కారణంతో సవాలు చేశారన్నది తెలియరాలేదు. ‘వర్గీకరణ విధానంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ విభాగం ఫలితాన్ని సమీక్షిస్తున్నాం. అందువల్ల పతక ప్రదానాన్ని సోమవారానికి వాయిదా వేస్తున్నాం’ అని నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫలితాన్ని సవాలు చేసినా వినోద్ పతకానికి ప్రస్తుతానికి ఎలాంటి ఢోకా లేదని భారత చెఫ్ డి మిషన్ గురుశరణ్ సింగ్ వెల్లడించారు.
నిషద్ రజతం గెలవడం సంతోషంగా ఉంది. అతడిలో అద్భుత నైపుణ్యాలున్నాయి. కుమార్‌లో పట్టుదల కూడా అధికం. అతడికి అభినందనలు. భవినా, వినోద్ కుమార్‌కు కూడా అభినందనలు.
– ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
క్రీడా ప్రముఖుల ప్రశంసలు:
పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లను సచిన్ టెండూల్కర్ సహా క్రీడారంగ ప్రముఖులు ప్రశంసించారు.