రెండు వారాల్లో పరిహారం చెల్లించండి

0
194

– ఉద్యోగం.. వసతి సమకూర్చాలి

– బానో కేసులో గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: 2002 గుజరాత్‌ అల్లర్ల బాధితురాలు బిల్‌కిస్‌ బానోకు రూ.50 లక్షల నష్ట పరిహారం, ఉద్యోగం, వసతిని రెండువారాల్లో సమకూర్చాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పరిహారానికి సంబంధించి ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ గుజరాత్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇందులో విచారించాల్సిందేమీలేదనీ, కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని స్పష్టంచేసింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోరు నేత త్వంలోని ధర్మాసనం ఈ మేరకు సోమవారం తీర్పునిచ్చింది. 2002 మార్చి 3.. గోద్రా అల్లర్ల సమయంలో అహ్మదాబాద్‌కు సమీపంలోని రన్‌ధిక్‌పుర్‌ గ్రామంలో మూకలు బిల్‌కిస్‌ బానో కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో బానో ఐదు నెలల గర్భవతి. ఆమె కుటుంబసభ్యులందరినీ హత్య చేసిన మూకలు, ఆమెపై లైంగికదాడికి పాల్పడి, చిత్రహింసలకు గురిచేశారు.

అనంతరం ఆమె స్పృహకోల్పోగా, చనిపోయిందనుకుని వదిలేసి వెళ్ళారు. ఈ దాడిలో బానో రెండున్నరేండ్ల కుమార్తె సహా కుటుంబానికి చెందిన 14 మంది హత్యకు గురాయ్యరు. ‘బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన వారికి శిక్షపడినప్పటికి.. ఆమె తీవ్రంగా నష్టపోయింది. బాధితురాలికి తగిన పరిహారం చెల్లించాలని నిర్ణయించడానికి విస్తృత చట్టాల కోసం వెతకవలసిన అవసరం లేదు. మనోవేదనను బట్టి నష్టపరిహారాన్ని నిర్ణయించవలసి ఉంటుంది’ అని సుప్రీంకోర్టు తన తుది తీర్పులో స్పష్టంచేసింది.

Courtesy NavaTelangana…

Leave a Reply