పెగాసస్ పొగమంచులో మోదీ సర్కార్

0
244
ఎ. కృష్ణారావు

కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఒక విమానాశ్రయంలో ఉండగా, ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీది. ‘ప్రకాశ్, మీరు టీషర్ట్‌లో ఉన్నారేమిటి? ఒక కేంద్రమంత్రిగా మీరు టీషర్ట్ ధరించి వెళ్లడం సరైనదా?’ అని ప్రధాని ప్రశ్నించారని, వెంటనే ప్రకాశ్ జవదేకర్ తన ఇంటికి తిరిగి వెళ్లి దుస్తులు మార్చుకుని వచ్చారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. జవదేకర్‌కు ప్రధాని సరైన సలహాయే ఇచ్చారని అందరూ అనుకోవడంతో ఆ ప్రచారం సద్దుమణిగింది.

మోదీ దగ్గర అందరి జాతకాలుంటాయి, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులకు సంబంధించి కీలక సమాచారానికి సంబంధించి ఫైళ్లు ఉంటాయి.. అని ప్రచారం జరిగినప్పుడు ఇదంతా ఊహాగానాలేనని చాలామంది కొట్టిపారేశారు. 2015లో తమ ముఖ్యమంత్రి ఫోన్‌ను మరో ముఖ్యమంత్రి ట్యాప్ చేయించారని ఒక రాష్ట్ర డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడు అసలు ఫోన్ ట్యాపింగ్‌కు ఆస్కారమే లేదని అప్పటి టెలికం జాయింట్ సెక్రటరీ రాకేశ్ గర్గ్ కొట్టి పారేశారు. ‘అసలు ఫోన్ ట్యాపింగ్‌పై రాద్ధాంతం చేయకండి. కేసులు పెట్టవద్దని మీ ముఖ్యమంత్రికి చెప్పండి..’ అని కేంద్ర హోం సెక్రటరీ స్వయంగా ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పారు.

నిజానికి అప్పటికే దేశంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి, కాంగ్రెస్ హయాంలో నీరా రాడియా అనే పేరు మోసిన పీఆర్వో పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు, జర్నలిస్టులతో జరిపిన సంభాషణల రికార్డులు బయటపడ్డాయి. మన్మోహన్‌సింగ్ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ ఇప్పించాలన్న దానిపై కూడా నీరా రాడియా చర్చలు జరిపారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్ ఒక సినిమా తారతో జరిపిన రసవత్తరమైన సంభాషణ కూడా రికార్డులకు ఎక్కింది. గుజరాత్‌లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ‘స్నూప్ గేట్’పేరిట ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ఎస్సార్ గ్రూప్ కూడా కొందరు వివిఐపిల ఫోన్లను ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. కాని ఇప్పుడు వినిపిస్తున్న ట్యాపింగ్ ఉదంతాలను గతంలో జరిగిన ట్యాపింగ్‌లతో పోలిస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. భారతదేశంలో నిఘా ఇంత తీవ్రంగా  విశ్వరూపం దాలుస్తుందని ఎవరూ ఊహించలేదు.

మనం నడుస్తుంటే, మాట్లాడుతుంటే, నిద్రిస్తుంటే, ఆఖరుకు ఊపిరి పీలుస్తుంటే కూడా ఎవరో మనను గమనిస్తున్నారని, మన మాటలు రికార్డు చేస్తున్నారని తెలిస్తే  మనకు ఎలా ఉంటుంది? మనకంటూ ఒక వ్యక్తిగత జీవితం లేకపోతే, మనం ఎవరితోనైనా స్వేచ్ఛగా సంభాషించకపోతే, మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కూడా హాయిగా మాట్లాడడానికి వెనుకాడవలసి వస్తే ఆ బతుకుకు అర్థం ఏమి ఉంటుంది? మన చేతిలో ఉన్న ఫోనే మనపై ఒక మారణాయుధంగా విరుచుకుపడితే మనం ఏమి చేయగలం? అసలు మనం ఒక ప్రజాస్వామిక సమాజంలో ఉన్నామా? లేక నిత్యం నిఘా కళ్ల చూపుల మధ్య ఆలోచనలను కూడా స్వేచ్ఛగా చేయలేని స్థితిలో ఉన్నామా? ఉగ్రవాదుల, నేరస్థుల ఆచూకీని, రహస్యాలను కనిపెట్టేందుకు ఒక ఇజ్రాయిల్ సంస్థ రూపొందించిన మిలటరీ గ్రేడ్ స్పైవేర్‌ను భారత దేశంలో న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు, రాజకీయనాయకులు, వ్యాపార వేత్తలు, అధికారులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రచయితలు, మేధావులు, వారి కుటుంబ సభ్యులపై నిఘా విధించేందుకు ప్రయోగించారని వార్తలు వచ్చినప్పుడు గగుర్పాటు కలుగక మానదు. ఒక మంత్రి, ఆయన సన్నిహిత సహచరులు, ప్రైవేట్ సెక్రటరీలు, ఆఖరుకు అతడి వంటవాడు, తోటమాలి ఫోన్లను కూడా ఈ నిఘా వదిలిపెట్టలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఒక పెద్ద మనిషిపై లైంగిక ఆరోపణలు చేసిన ఒక మహిళ, ఆమె కుటుంబ సభ్యులకు చెందిన 11 ఫోన్లపై నిఘా పెట్టవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? దాని వల్ల ఆ నిఘా ఉంచిన వారికి ఏమి ప్రయోజనాలు కలిగాయి? తాను ఒక కేంద్రమంత్రిని కలిసినప్పుడు ఆయన ఈ నిఘా పట్ల భయకంపితుడై కనిపించారని, తమ ఇద్దరి ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయించి వేరే గదిలో ఉంచేలా చేశారని, ఆ గదిలో సంగీతం పెట్టమని కోరారని  సీనియర్ జర్నలిస్టు సిద్ధార్థ వరదరాజన్ చెప్పిందే నిజమైతే ఈ దేశంలో అనేకమంది తమ చేతిలో ఫోన్లనే అనుమానించే పరిస్థితి తలెత్తిందని అనుకోవాలి.

‘అక్కడ అబద్ధాలు సత్యాలుగా ధ్వనిస్తాయి. హత్యలు గౌరవంగా కనిపిస్తాయి. పైకి దృఢంగా కనిపించేదాని వెనుక కేవలం గాలి తప్ప మరేదీ ఉండదు..’ అని ప్రముఖ ఆంగ్ల రచయిత జార్జి ఆర్వెల్ ఆధునిక రాజకీయ పరిభాష గురించి చేసిన ఒక రచనలో అన్నారు. ఒక ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత సమాజాన్ని విధ్వంసం చేసేందుకు జరిగే నిరంకుశ పద్ధతులు ఎలా ఉంటాయో ఆయన తన పలు రచనల్లో అభివర్ణించారు. బూటకపు ప్రచారం, నిఘా, తప్పుడు సమాచారం, రెండు నాలుకల ధోరణి, చరిత్రను వక్రీకరించడం, మనిషి గత ఉనికినే మార్చివేయడం ద్వారా ఆధునిక నియంతృత్వ ప్రభుత్వాలు సమాజంపై పట్టు సాధించేందుకు చేసే ప్రయత్నాలను ఆయన వివరించారు. ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ ద్వారా భారత దేశంలో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలతో పాటు అనేకమంది ఫోన్లపై నిఘా వేశారని ఆరోపణలు వచ్చినప్పుడు డేటా పరిరక్షణపై నిపుణుల కమిటీకి చైర్మన్‌గా ఉన్న జస్టిస్ బి.ఎన్ శ్రీకృష్ణ కూడా దేశం ఆర్వేలియన్ సమాజంగా మారుతున్నదేమోనని భయం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టపరమైన అనుమతులు లేకుండా ప్రజలపై నిఘా వేసేందుకు ప్రభుత్వం పెగాసస్ వంటి స్పైవేర్‌ను ఉపయోగిస్తే అది రాజ్యాంగ వ్యతిరేకమని, దాన్ని న్యాయస్థానంలో సవాలు చేయవచ్చునని ఆయన చెప్పారు. నిజానికి తాను ముసాయిదా బిల్లులో సూచించిన అంశాలకు భిన్నంగా డేటా పరిరక్షణ బిల్లు పరిధి నుంచి తన సంస్థలకు వేటికైనా మినహాయింపు నిచ్చి నిఘా విధించే అధికారం కల్పించాలని  ప్రభుత్వం నిర్ణయించినప్పుడే జస్టిస్ శ్రీకృష్ణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. డేటా పరిరక్షణ అథారిటీపై ప్రభుత్వానికి పట్టు ఉండకూడదని, అది స్వతంత్ర రాజ్యాంగ సంస్థ కావాలని ఆయన వాదించారు. ఇప్పుడు పార్లమెంట్‌లో డేటా పరిరక్షణ బిల్లు ఏ రూపంలో రానుందో, ఏ కోరలతో ప్రత్యక్షమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది.

ఇజ్రాయిల్ సంస్థ ఎన్‌ఎస్‌ఓ సృష్టించిన పెగాసస్ స్పైవేర్‌ను ఏయే దేశాల్లో ఎవరెవరిపై ప్రయోగించారో అంతర్జాతీయ జర్నలిస్టు, మానవ హక్కుల సంస్థలు, ఆయాదేశాల వార్తాసంస్థలే తేల్చాయి. అయినప్పటికీ భారత ప్రభుత్వం తాను ఆ స్పైవేర్‌తో నిఘాను నిర్వహించానని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అంతా చట్టబద్ధంగా జరుగుతోందని, అక్రమ నిఘాకు భారతదేశంలో ఆస్కారం లేదని నూతన ఐటీ, కమ్యూనికేషన్ల  మంత్రి అశ్వినీ వైష్ణవ్ అంటున్నారు. కాని ఇజ్రాయిల్ స్పైవేర్‌ను భారతదేశం కొన్నదో లేదో ఆయన చెప్పలేదు. ఆయనకు ముందు ఐటీ మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ కూడా ధ్రువీకరించలేదు, తమ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వాలకే అమ్ముతానని ఇజ్రాయిల్ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే భారత్‌లో ఫోన్లపై పెగాసస్ దాడి జరిగిందని ధ్రువపడింది కనుక మనదేశంలో ఈ స్పైవేర్ ఉపయోగించింది ఎవరు? ఎందుకు ఉపయోగించారు?

ఈ అనుమానాలు నివృత్తి కాకపోతే ఈ దేశంలో జర్నలిస్టులతో ఏ కీలక వ్యక్తీ ఫోన్‌లో మాట్లాడడానికి సిద్ధపడరు. అంతేకాదు, ఇలాంటి నిఘా పరికరాలు దేశ రాజకీయ ఆర్థిక, సామాజిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రుల్ని నియంత్రించడానికి, ప్రతిపక్ష నేతల్ని బలహీనపరచడానికి, వ్యాపార రహస్యాలు చేరవేయడానికి, ప్రశ్నించే గొంతుల్ని నిర్వీర్యం చేయడానికి తోడ్పడతాయి. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు కూడా ఉపయోగవడవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఖరుకు మనిషిని మనిషి అనుమానించే పరిస్థితి తలెత్తుతుంది. ఇప్పటికే అనేక కేంద్రీకృత చట్టాలను ప్రయోగించి రాష్ట్రాల అధికారాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం ఈ నిఘా సాఫ్ట్‌వేర్‌తో మొత్తం దేశంపై ఉక్కుపిడికిలి బిగించి సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా కాలరాచే అవకాశం లేకపోలేదు.  2014లో మోదీ సారథ్యంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేయడానికి, ప్రభుత్వాలను గద్దెదించడానికి, నేతలను తమ వైపుకు తిప్పుకోవడానికి అవలంబించిన మార్గాలు చూసిన తర్వాత ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య సంస్కృతి మన దేశంలో కోల్పోయామేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పెగాసస్ మోదీ సర్కార్‌పై పొగమంచులా కమ్ముకుంది. ఈ పొగమంచును ఛేదించి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వానిదే, దీన్నంతా అంతర్జాతీయ కుట్రగా అభివర్ణించి తప్పుకోవాలని ప్రయత్నిస్తే చెల్లదు. లేకపోతే  ప్రతిపక్షాలే కాదు, స్వపక్షాలు కూడా తమ నీడను తామే నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది.

Courtesy Andhrajyothi

Leave a Reply