- నిఘాకు నిరసనగా టీ-కాంగ్రెస్ రేపు ‘చలో రాజ్‌భవన్’
- పార్లమెంట్ ఉభయసభల్లో రగిలిన సెగ
న్యూఢిల్లీ, హైదరాబాద్ : రెండేళ్ల క్రితం.. 2019లో కర్ణాటకలో జేడీయూ, కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూలిపోవడంలో ‘పెగాసస్’ నిఘాయే కీలకపాత్ర పోషించిందా? పెగాసస్ బాధితుల జాబితాకు సంబంధించి మూడోరోజు వెల్లడైన పేర్లను పరిశీలిస్తే ఆ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి 2019లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. కాంగ్రెస్, జేడీయూ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు.. కుమారస్వామి కార్యదర్శి సతీశ్ ఫోన్, అప్పటి ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర ఫోన్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య సెక్రటరీ వెంకటేశ్ ఫోన్ నంబర్లు లక్ష్యిత జాబితాలో ఉన్నట్టు ‘ద వైర్’ మంగళవారం నాటి కథనంలో వెల్లడించింది. అంతేకాదు.. సరిగ్గా అదే సమయంలో, రాహుల్‌గాంధీ ఉపయోగించడం ప్రారంభించిన కొత్త ఫోన్ నంబర్ కూడా ఆ జాబితాలో ఉన్నట్టు వెల్లడించింది. వారి నంబర్లను అప్పుడు నిజంగా నిఘాలో పెట్టారా అని నిగ్గు తేల్చే డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు లేనందున ఆ విషయాన్ని నిర్ధారణగా చెప్పలేంగానీ.. లక్ష్యిత జాబితాలో చేర్చిన సమయ మే లోగుట్టును రట్టు చేస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే.. మాజీ ప్రధాని దేవెగౌడ భద్రతాధికారి మంజునాథ్ ముద్దెగౌడ నంబర్ కూడా పెగాసస్ ప్రాజెక్ట్ లీక్డ్ రికార్డుల్లో ఉండడం గమనార్హం. వీరంతా ఆ సమయంలో.. ఈ జాబితాలో ఉన్న నంబర్లను వినియోగిస్తున్నట్టు ధ్రువీకరించారు. కొందరు అవే నంబర్లను కొనసాగిస్తుండగా.. మరికొందరు వాటి వినియోగాన్ని ఆపేశారు. మరోవైపు.. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి సన్నిహితుల నం బర్లు కూడా నిఘాలో ఉన్నట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. దీనిపై మీడియా మంగళవారం గొగోయ్ వివరణ కోరగా.. వ్యాఖ్యానించేందుకు ఆయన తిరస్కరించారు.
దద్దరిల్లిన పార్లమెంటు
పెగాసస్ సెగలు పార్లమెంటు వర్షాకాల సమావేశాలను వరుసగా రెండోరోజూ కుదిపేశాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేతలు సర్కారీ నిఘాపై, రైతుల సమస్యలు, అధిక ధరలు తదితర అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడుసార్లు వెల్‌లోకి దూసుకురావడంతో.. సభ గురువారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ మంగళవారం ఉదయం 15 పార్టీల నేతలు పెగాసస్ నిఘాతోపాటు కీలక అంశాలపై చర్చ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గందరగోళం సృష్టించారు. దీంతో సభ చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభను వాయిదా వేశారు. మరోవైపు.. పెగాసస్ నిఘాపై ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాగా.. ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ నిఘాను నిరసిస్తూ ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ నుంచి రాజ్‌భవన్ వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీకి చెందిన ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. కేంద్రంతోపాటు రాష్ట్ర సర్కారు కూడా.. తమ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న ప్రతిపక్ష నేతల ఫోన్లను, వ్యక్తుల ఫోన్లను హ్యాక్ చేస్తోందని భట్టి ఆరోపించారు.
ఫ్రాన్స్‌లో విచారణ షురూ
రాజకీయ ప్రత్యర్థులు, పాత్రికేయుల ఫోన్ల మీద పెగాసస్ నిఘాపై విచారణకు మనదేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. చట్టవిరుద్ధమైన నిఘా అసాధ్యమని ప్రభుత్వం చెబుతోంది. ఫ్రాన్స్‌లోనూ అచ్చం ఇదే తరహా ఆరోపణలు రాగా.. పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దీనిపై ఇప్పటికే విచారణ ప్రారంభించేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ‘మీడియాపార్ట్’ అనే వెబ్‌సైట్, ఇద్దరు జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ ప్రారంభించినట్టు పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం మంగళవారం తెలిపింది.
ఎన్‌క్రిప్షన్‌నూ బలహీనం చేస్తున్నారు
చూడబోతే.. భారత ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపైన, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలపై రహస్యంగా నిఘా పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. యాదృచ్ఛికంగా.. వారు(భారతప్రభుత్వం) మెసెంజర్ యాప్స్‌లో ఎన్‌క్రిప్షన్‌ను కూడా బలహీన పరిచే చట్టాలను తేవడం ఆసక్తికర..ఒకవైపు పెగాసస్ రగడ, మరోవైపు సోషల్ మీడియా కట్టడికి తెచ్చిన కొత్త నియమావళి నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘సిగ్నల్’ చేసిన ట్వీట్ ఇది.
Courtesy Andhrajyothi