పెగాసస్‌ తీవ్రమైన విషయమే..

0
263
  •   గూఢచర్యం జరిగితే క్రిమినల్‌ కేసు ఎందుకు పెట్టలేదు?
  • సుప్రీంకోర్టు ప్రశ్న
  • ఏ సెక్షన్‌ కింద పెట్టాలో  తెలియడం లేదు: న్యాయవాది
  • తదుపరి విచారణ 10కి వాయిదా 

దిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న వార్తలు నిజమే అయితే అది తీవ్రమైన విషయమేనని సుప్రీంకోర్టు గురువారం అభిప్రాయపడింది. దీనిపై దాఖలైన తొమ్మిది వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నందున కేంద్రానికి ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు. ఒక పిటిషనర్‌ ఈ కేసులో ప్రధాని నరేంద్రమోదీని వ్యక్తిగతంగా కక్షిదారునిగా పేర్కొనడంపై అభ్యంతరం తెలిపింది. దావాల పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని పిటిషనర్లకు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల పదో తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే దేశంలోకి ఈ స్పైవేర్‌ వచ్చే అవకాశమే లేదని, అందువల్ల దీనిపై కేంద్రమే వివరణ ఇవ్వాల్సి ఉంటుందని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

ధర్మాసనం ప్రశ్నలు
ప్రధాన పిటిషన్‌దారులైన సీనియర్‌ పాత్రికేయులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ల తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, ఇతరుల పక్షాన మరికొందరు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి ధర్మాసనం కొన్ని ప్రశ్నలు వేసింది.
* పత్రికల వార్తలు నిజమైతే ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవని అనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాం.
* దావాల పత్రాలను చదివినప్పుడు ఈ వ్యవహారం రెండేళ్ల క్రితం 2019 మే నెలలో వెలుగు చూసినట్టు ఉంది. ఇప్పుడ[ు ఎందుకు ఆకస్మికంగా ప్రస్తావనకు వచ్చింది? ఎందుకు ఆలస్యం జరిగింది?
* మరింత దృష్టిని కేంద్రీకరించడం ద్వారా గానీ, ఇంకాస్త కృషి చేయడం ద్వారా గానీ ఎక్కువ సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేది.
* తన ఫోనును దొంగచాటుగా వింటున్నారని ఓ పిటిషన్‌దారు అంటున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు టెలిగ్రాఫ్‌ చట్టం కింద లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం కింద క్రిమినల్‌ కేసు పెట్టే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రయత్నాలు జరిగినట్టు లేదు.

న్యాయవాదుల సమాధానాలు
‘‘పెగాసస్‌ అక్రమాలకు పాల్పడేందుకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం. ఇది చట్టవిరుద్ధం. మనకు తెలియకుండానే మన వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించే సాధనం. ఇందుకు సంబంధించిన ఎలాంటి వివరాలూ అందుబాటులో లేవు. ఫోన్లను ప్రత్యక్షంగా హ్యాక్‌ చేసిన సందర్భాలు పది ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వ్యక్తిగత గోప్యత, ప్రతిష్ఠపై జరుగుతున్న దాడి లాంటిది. భద్రత, పౌరుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన వ్యవహారం కావడంతో ప్రభుత్వమే ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు?’’ అని సిబల్‌ అన్నారు.  ఒక్కో మొబైల్‌ ఫోన్‌లో ఈ స్పైవేర్‌ పెట్టడానికి 50 వేల డాలర్లు (సమారు రూ.37 లక్షలు) ఖర్చవుతుందని తెలిసిందని సిబల్‌ చెప్పారు. కేసు పెట్టడానికి ఏ నిబంధన కింద ఫిర్యాదు చేయాలో అర్ధం కావడం లేదని సీనియర్‌ న్యాయవాది అరవింద్‌ దాతర్‌ చెప్పారు. నూతన ఐటీ చట్టం ప్రకారం గూఢచర్యానికి పాల్పడితే కేసులు పెట్టేందుకు నిబంధనలు లేవని తెలిపారు. పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు సంబంధించిన సమస్య కావడంతో దర్యాప్తు జరిపించాలని సీనియర్‌ న్యాయవాది మీనాక్షి అరోడా కోరారు.

స్పైవేర్‌ కొనుగోలుకే ఇజ్రాయెల్‌ వెళ్లారా?
ముంబయి: పెగాసెస్‌ తరహా స్పైవేర్‌ను కొనుగోలు చేయడానికి 2019లో మహారాష్ట్ర అధికారుల బృందం ఇజ్రాయెల్‌ వెళ్లిందని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని గురువారం బాంబే హైకోర్టు స్వీకరించింది. ఆ దావా ప్రకారం.. ‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత 2019 నవంబరు 15న సమాచార పౌరసంబంధాల డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయానికి చెందిన అయిదుగురు ఎంపిక చేసిన ఉన్నతాధికారులు ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో నూతన ప్రభుత్వం ఏర్పాటుపై ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. ఇలాంటి పర్యటనలు చేయడానికి ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం అనుమతులు తీసుకోవాల్సి ఉండగా, అలాంటిదేమీ జరగలేదు. ఫోన్ల ట్యాపింగ్‌ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనపై దర్యాప్తు జరిపించాలి’’ అని పిటిషనర్‌ కోరారు.

Courtesy Eenadu

Leave a Reply