సమాధానం లేని ప్రశ్నలు

0
283
పి. చిదంబరం 
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

మంత్రుల ఫోన్లపై నిఘా విషయంలో ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తోంది? 2017–19 మధ్యకాలంలో తాము ఉపయోగించిన ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించమని ఆ మంత్రులను ఎందుకు ఆదేశించలేదు? దేశపౌరులుగా ఇవి మనం అడుగుతున్న ప్రశ్నలు. పెగాసస్ నిఘా విషయమై సత్యం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. ఎందుకీ ఉదాసీనత?

రాజకీయ నాయకులు (ప్రతిపక్ష సభ్యులు, మంత్రులు), న్యాయమూర్తులు, సివిల్ సర్వెంట్స్, విద్యార్థులు, పౌరహక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, వ్యాపార దిగ్గజాల మీద గూఢచర్యానికి స్పైవేర్‌ను ఉపయోగించడంపై చర్చను, ఈ కాలమ్ శీర్షికలోని మూడుమాటలు నిర్వచించి తీరాలి. పెగాసస్ అనే దుష్ట సాఫ్ట్‌వేర్ (మాల్‌వేర్) స్రష్ట, యజమాని అయిన ఎన్‌ఎస్ఓ గ్రూప్ లిఖిత వర్తమానంలో ఆ మూడు మాటలు ఉన్నాయి. ‘ప్రభుత్వాల గూఢచర్య సంస్థలు, శాంతిభద్రతల పరిరక్షణ ఏజెన్సీలకు మాత్రమే ఎన్‌ఎస్‌ఓ తన సాంకేతికతలను విక్రయిస్తుందని’ ఆ గ్రూప్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే తమ క్లయింట్లు వాస్తవంగా ఆ సాంకేతికతలను ఎలా ఉపయోగిస్తున్నారనే విషయాన్ని ఆ గ్రూప్‌ ఉపేక్షించింది. కొన్ని క్లయింట్ ప్రభుత్వాలు ఎన్ఎస్ఓ నుంచి కొనుగోలు చేసిన స్పైవేర్‌ను దుర్వినియోగపరిచి ఉండవచ్చు. మనదేశం విషయంలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. వాటిని ఏకరువు పెట్టే ముందు ఒక హెచ్చరిక: తర్కాన్ని లేదా హేతుబద్ధమైన వాదనను ఇష్టపడనివారి కోసం ఆ ఇబ్బందికరమైన ప్రశ్నలను ఉద్దేశించలేదు. మిగతా వారికోసమే అవి. ఆ ప్రశ్నలు:

(1) భారత ప్రభుత్వం లేదా దాని ఏజెన్సీలలో ఏదైనా ఒకటి ఎన్ఎస్ఓకు క్లయింట్‌గా ఉందా? ఇది చాలా సరళమైన, సూటి ప్రశ్న. దీనికి సమాధానం అవును లేదా కాదు అని మాత్రమే అయితీరుతుంది. అయితే చెప్పలేని కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం ఈ ప్రశ్నకు తిన్నగా జవాబిచ్చేందుకు తిరస్కరిస్తోంది. సమాధానమివ్వడానికి ఎంతకూ ససేమిరా అంటుండడంతో పాలకులపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

(2) అంతర్జాతీయ దర్యాప్తులపై ఆధారపడి ‘ఎన్ఎస్ఓ గ్రూప్‌నకు భారతీయ క్లయింట్ ఒకరు ఉన్నార’ని ‘ది వైర్’ వెల్లడించింది. దీంతో పై ప్రశ్నకు ప్రభుత్వం ఇవ్వాల్సిన సమాధానం మరింత సంక్లిష్టమవుతుంది. ఇంతకూ ఆ క్లయింట్ భారతప్రభుత్వం కాకపోతే మరెవరు? ఎన్ఎస్ఓకు తాను క్లయింట్‌ను కాదని ప్రభుత్వం చెప్పిందనుకోండి. అయితే భారతీయ క్లయింట్ ఎవరు? అని వెన్వెంటనే మరొక ప్రశ్న దూసుకువస్తుంది. తనకు తెలియదని ప్రభుత్వం అంటే, ‘మరయితే ఆ క్లయింట్ ఎవరో తెలుసువాలనే ఆసక్తి, ఆతురత లేవా?’ అని ఇంకో ప్రశ్న తప్పక వస్తుంది. ఈ ప్రశ్నకు ఎలా సమాధానమివ్వాలో ప్రభుత్వానికి తెలియడం లేదు. ఎందుకంటే సమాధానం ఏమైనప్పటికీ అది అనేక ప్రశ్నలకు దారితీస్తుంది కనుక. వాటికి సమాధానమివ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా లేదు!

(3) భారత ప్రభుత్వం గానీ లేదా దాని ఏజెన్సీలలో ఏదైనా ఒకటిగానీ ఎన్ఎస్ఓకు క్లయింట్ అయితే, అది ఎప్పుడు ఆ సాంకేతికతలను సమకూర్చుకుంది? ఈ ప్రశ్నకూ సమాధానమివ్వడానికి ప్రభుత్వం తిరస్కరిస్తోంది. తత్కారణంగా అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నాయి. (4) ఆమ్నెస్టీ, ఫర్‌బిడెన్ స్టోరీస్ వెబ్‌సైట్ దర్యాప్తులో ‘ఆసక్తికరమైన వ్యక్తుల’ జాబితా ఒకటి వెల్లడయింది. ఆ జాబితాను అలా ఉంచి, పెగాసస్ నిఘాకు గురైన వ్యక్తులపై దృష్టిని కేంద్రీకరిద్దాం. ‘ది వైర్ ’ కథనం ప్రకారం సదరు వ్యక్తులలో అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్ పటేల్ (ఇరువురూ మంత్రులే) ఉన్నారు. మరి ఈ వాస్తవం ప్రభుత్వాన్ని ఎందుకు గాభరా పెట్టడం లేదు?

మంత్రుల ఫోన్లపై నిఘా విషయంలో ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తోంది? 2017–19 మధ్యకాలంలో తాము ఉపయోగించిన ఫోన్లను ఫోరెన్సిక్ (న్యాయసంబంధమైన) పరీక్షకు పంపించమని ఆ మంత్రులను ఎందుకు ఆదేశించలేదు? దేశపౌరులుగా ఇవి మనం అడగుతున్న ప్రశ్నలు. పెగాసస్ నిఘా విషయమై సత్యం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. ఆ ఉదాసీనత ప్రభుత్వ నిజాయితీపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది? ఈ వ్యవహారంపై వివిధ సంస్థల దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెల్లడవుతున్న వాస్తవాల విషయంలో ప్రభుత్వం చాలా ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తోంది. తనను ప్రశ్నిస్తున్నవారికి కొన్ని హెచ్చరికలూ జారీ చేస్తోంది.

ఏమైనా ఎన్ఎస్ఓ గ్రూప్‌నకు భారతీయ క్లయింట్ ఒకరు ఉన్నారనేది స్పష్టం. మనదేశంలో పలువురి మొబైల్ ఫోన్స్ పెగాసస్ నిఘాకు గురయ్యాయన్నది మరింత స్పష్టం. ప్రభుత్వం అనుసరించే ఏ వైఖరి అయినా ఈ చేదు సత్యాన్ని కప్పిపుచ్చలేదు. ఎన్ఎస్ఓ భారతీయ క్లయింట్ పేరు త్వరలోనే వెల్లడవుతుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఆసక్తికర వ్యక్తుల జాబితాకు సంబంధించిన మరిన్ని ఫోన్లను న్యాయసంబంధమైన పరీక్షలకు పంపించే అవకాశం కూడా ఎంతైనా ఉంది. ఆ ఫోన్లు పెగాసస్ నిఘాకు గురయ్యాయన్న విషయం తప్పక నిర్ధారణ అవుతుంది. ఆ దశలో ప్రభుత్వం ఏం చేస్తుంది?

పెగాసస్ వ్యవహారంపై మోదీ ప్రభుత్వ ప్రతిస్పందన, ఫ్రాన్స్ ప్రతిస్పందనకు మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ఫ్రాన్స్ ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థ. తమపై వచ్చిన ఆరోపణలకు అది తీవ్రంగా ప్రతిస్పందించింది. అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ అత్యవసర భద్రతా సమావేశాలను నిర్వహించారు. వివిధ దర్యాప్తులకు ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్‌తో మాట్లాడారు. తమ దర్యాప్తులలో వెల్లడయిన అంశాలను ఫ్రాన్స్‌కు తప్పక తెలియజేస్తానని మెక్రాన్‌కు బెన్నెట్ హామీ ఇచ్చారు. ఎన్ఎస్ఓ గ్రూప్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై జాతీయ భద్రతా మండలి దర్యాప్తునకు ఇజ్రాయెల్ ఆదేశించింది. హంగరీలో న్యాయశాఖ మంత్రి పెగాసస్ స్పైవేర్‌పై వ్యాఖ్యానించేందుకు తిరస్కరించారు. పైగా ప్రతి దేశానికి అటువంటి గూఢచర్య సాధనాలు అవసరమని’ ఆయన అనడం గమనార్హం.

ఆ దేశంలో ప్రతిపక్ష నేతలు మేయర్లు, జర్నలిస్టులపై పెగాసస్ నిఘా ఉంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు ప్రజా మద్దతు పెరుగుతోంది. అయితే హంగరీ ప్రభుత్వం ఆ డిమాండ్‌ను కొట్టివేస్తోంది. ఇక మనదేశంలో ఈ అనైతిక వ్యవహారంపై దర్యాప్తు డిమాండ్‌ను ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్లమెంటులో ఆ అంశంపై చర్చకు సైతం అనుమతినివ్వడం లేదు. మరి హంగరీకి మనకు తేడా ఏమిటి? ఆ యూరోపియన్ దేశపు ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమైనది. మరి మనదీ అంతేనా? ఇందుకు మీరు గర్విస్తున్నారా?

Courtesy Andhrajyothi

Leave a Reply