ఆద్యంతం ఉత్కంఠ రేపుతున్న పెలోసీ పర్యటన
”శిఖరం నుంచి అమెరికా కుప్పకూలకుండా ఆపేందుకు ఇదే ‘తుది హెచ్చరిక’ అని నిపుణులు చెబుతున్నారు” అంటూ నాన్సీ పెలోసీ పర్యటనపై గ్లోబల్ టైమ్స్ నిన్న ఓ వ్యాసం రాసింది. వాస్తవానికి ‘చైనా ఫైనల్ వార్నింగ్’ అంటేనే అమెరికాకు ఇప్పటికీ ఓ పెద్ద జోక్. అటువంటి వాటిని పెలోసీ తేలిగ్గా తీసుకొన్నారు. షీజిన్‌పింగ్ గాండ్రింపులను.. బైడెన్ గొణుగుడును పట్టించుకోకుండా తైవాన్ చేరుకొన్నారు. పెలోసీ మొండిఘటమని తెలిసిన అమెరికా సైన్యం ఆద్యంతం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. తాజాగా తైవాన్ అధినేత త్సాయి యింగ్ వెన్‌తో భేటీ అయ్యారు. మరోపక్క చైనా యుద్ధవిన్యాసాలు మొదలుపెట్టి బెదిరించే యత్నాలు చేస్తోంది.
మలేషియా నుంచి భిన్నమైన మార్గంలో..
మలేషియా పర్యటన ముగించుకొన్న వెంటనే ఆమె విమానం స్పార్-19 కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టు నుంచి గాల్లోకి ఎగిరింది. ఈ విమానం కదలికలను దాదాపు 7,08,000 మంది ట్రాక్ చేసినట్లు ఫ్లైట్ రాడార్24 వెల్లడించింది. తమ వెబ్‌సైట్‌లో అత్యధిక మంది ట్రాక్ చేసిన విమానం ఇదే అని తెలిపింది. ఒక దశలో ఈ వెబ్‌సైట్ ట్రాఫిక్‌ను తట్టుకోలేకపోయింది. మరో వైపు స్పార్-19 విమానం బ్రూనై మీదుగా ఫిలిప్పీన్స్ సముద్రంపై నుంచి తైపే వైపు దూసుకెళ్లింది. తైవాన్ మలుపు తీసుకొని తైపే దిశగా వెళ్లింది. వాస్తవానికి కౌలాలంపూర్ నుంచి దక్షిణ చైనా సముద్రం మీదుగా తైవాన్ వెళ్లవచ్చు. కానీ, అక్కడ చైనా కృత్రిమ ద్వీపాలు ఉండటంతో.. ఆ మార్గాన్ని తప్పించి ఫిలిప్పీన్స్ సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు.
చైనా రంకెలు కొత్తేమీ కాదు..
‘చైనా ఫైనల్ వార్నింగ్’లు రావడం అమెరికాకు ఇదేం కొత్తకాదు. 1950లు, 1960ల్లో తైవాన్ జలసంధి విషయంలో అమెరికా-చైనాల సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్లో నిత్యం అమెరికా మిలిటరీ జెట్‌లు ఇక్కడ చక్కర్లు కొట్టేవి. చైనా దీనికి నిరసనలు తెలిపేది. ఆ క్రమంలో 1964 నాటికి దాదాపు దౌత్య మార్గాల్లో 900ల సార్లకుపైగా ‘చైనా ఫైనల్ వార్నింగ్’లు జారీ చేసింది. ఇవి ప్రసార మాధ్యమాల్లో రావడం నిత్యకృత్యంగా మారిపోయింది. చివరికి ఇదో ఊతపదంలా మారిపోయింది. చైనా చుట్టుపక్కల యూఎస్‌ఎస్‌ఆర్ మాజీ దేశాల్లో ఈ ఊతపదం ప్రచారంలో ఉంది. ముఖ్యంగా బాల్టిక్ దేశమైన ఎస్తోనియాలో ఇది బాగా వాడుకలో ఉంది. ఇటీవల చైనా ‘నిప్పుతో చెలగాటం’ పదాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే చైనా అధికారులు సహా.. షీజిన్‌పింగ్ కూడా ఈ పదాన్ని చాలా సార్లు వాడారు. అయినా నాన్సీ పెలోసి తైవాన్‌కు వెళ్లారు.
మేము తైవాన్‌ను వదిలేయలేదు..
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ అధ్యక్ష భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ”నిస్సందేహంగా ఓ విషయం స్పష్టంగా చెబుతున్నాను. అమెరికా హామీల నుంచి వైదొలగి తైవాన్‌ను వదిలేయలేదు. మా రెండు దేశాల మధ్య స్నేహానికి గర్విస్తున్నాం. అమెరికా మద్దతు ఇప్పుడు అత్యంత కీలకం. దానిని తీసుకొనే నేను వచ్చాను” అని పేరొన్నారు.
అంతకు ముందు తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెలన్ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని నాన్సీపెలోసీకి అందజేశారు. అసలే పెలోసీ పర్యటనపై చైనా మండిపడుతుంటే.. మరో పక్క తన పర్యటనలో తియానెన్మెన్ స్క్వేర్ ఘటన ప్రస్తావన తీసుకొచ్చారు. ”నేను తైవాన్ మిత్రురాలినని మీరు అన్నారు. దానిని కాంప్లిమెంట్‌గా స్వీకరిస్తున్నా. తైవాన్‌కు బలమైన మద్దతు ఉంది. భవిష్యత్తులో ఇరు దేశాల చట్టసభల మధ్య సమన్వయం పెంచడమే నా పర్యటన ఉద్దేశం. ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుత సమాజాల్లో తైవాన్ ఒకటి. ఒక్కనిమిషం తియానెన్మెన్ స్క్వేర్‌పై మాట్లాడదాం. అప్పట్లో రెండు పార్టీల(అమెరికాలో) మద్దతు లభించింది. అది 30 ఏళ్ల క్రితం మాట” అని పేర్కొన్నారు.
చైనా సైనిక విన్యాసాలు..
పెలోసీ పర్యటన నేపథ్యంలో చైనా లైవ్ ఫైర్ మిలిటరీ డ్రిల్స్‌ను ప్రారంభించింది. తైవాన్ చుట్టుపక్కల ప్రదేశాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ప్రకటించింది. వీటిల్లో దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేదించడం వంటి వాటిని కూడా నిర్వహిస్తామని వెల్లడించింది. తైవాన్ తీర ప్రాంతానికి కేవలం 12.4 మైళ్ల దూరంలో వీటిని నిర్వహించడం ఆందోళనకరంగా మారింది. నిన్న మొత్తం 21 చైనా ఫైటర్ జెట్ విమానాలు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి చొరబడ్డాయి.
తైవాన్‌పై బీజింగ్ ఆంక్షలు..
పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా చైనా తైవాన్‌పై ఆర్థిక యుద్ధం ప్రకటించింది. చైనీస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ పలు ఆంక్షలను ప్రకటించింది. తైవాన్ నుంచి చేపలు, పండ్ల దిగుమతిని నిషేధించింది. వాటిల్లో అధిక పురుగు మందులు ఉన్నాయని ఆరోపించింది. ఇక శీతలీకరించిన చేపల్లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొంది. దీంతోపాటు తైవాన్ నుంచి దిగుమతి అయ్యే ఇసుకపై కూడా నిషేధం విధించింది.
తైవాన్‌ను శిక్షించడానికి దాని వ్యవసాయ రంగాన్ని చైనా లక్ష్యంగా చేసుకొన్నట్లు తెలుస్తోంది. తైవాన్‌లోని దక్షిణ ప్రాంతంలో పండ్లతోటలను నిర్వహించే చాలా కుటుంబాల్లో త్సాయి యింగ్ వెన్‌కు భారీ మద్దతు ఉంది. తైవాన్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఏటా ఈ రెండు దేశాల వాణిజ్యం పెరిగి 328 బిలియన్ డాలర్లకు చేరింది. దీనిలో తైవాన్‌కు వాణిజ్య మిగులు ఎక్కువగా ఉంటోంది. దానిపైనే ఇప్పుడు చైనా గురి పెడుతోంది.